Sunday, April 28, 2024

సురక్షిత సడలింపు

- Advertisement -
- Advertisement -

Lockdown gives better results

 

ఆశ నిరాశ, అభయం భయం: ఇది ఒక విచిత్ర స్థితి. నెల రోజులకు పైగా కొనసాగుతున్న కఠోరమైన కరోనా లాక్‌డౌన్ చాలా చోట్ల మెరుగైన ఫలితాలను ఇస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వాటి ప్రోత్సాహంతో వీధులు బార్లా తెరచి సకల కార్యకలాపాలను తిరిగి అనుమతిస్తే వైరస్ మళ్లీ విజృంభించి మరింతగా ప్రాణాలను కబళిస్తుందేమోనన్న భయమూ పీడిస్తున్నది. ఒకవైపు ప్రాణ హాని, ఇంకోవైపు సాధారణ ప్రజాకోటిని అలముకున్న ఆకలి, అభద్రతల ఆందోళన. అడకత్తెరలో పోక మాదిరి పరిస్థితి. లాక్‌డౌన్ 2 ముగిసిపోవస్తున్న తరుణంలో చెప్పనలవికాని సందిగ్ధం. తెలంగాణ దాదాపు కరోనా రహిత రాష్ట్రం కాబోతున్నదని, ఇప్పటికే 21 జిల్లాలలో కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాని వాతావరణం నెలకొన్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటన భరోసానిస్తున్నది.

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు ముఖ్యమంత్రులతో జరిపిన విడియో సదస్సులో కూడా కొంత ఆశావహ దృక్పథం, మరి కొంత జాగరూకతతో కూడిన అవగాహన కనిపించాయి. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయకుండా దశలవారీగా సడలింపునివ్వడం వైపు మొగ్గు సూచీ కనిపించింది. లాక్‌డౌన్ మంచి ఫలితాలనిస్తున్నదంటూనే తదుపరి ఏమి చేయాలి అనే దానిని ఆలోచించవలసి ఉన్నదని ఆయన అన్నారు. కరోనా తీవ్రత కొనసాగుతున్న ప్రాంతాల మీద దృష్టి పెంచి వాటిని క్రమక్రమంగా మామూలు స్థితికి తీసుకు రావాలని మోడీ సూచించారు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాలు సహా వైరస్ ముమ్మరించిన ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు కొనసాగిస్తూనే మెరుగుపడిన చోట్ల సడలింపులివ్వాలన్న అభిప్రాయం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ 2కి ప్రధాని మోడీ విధించిన మే 3 గడువుకు, ముఖ్యమంత్రి కెసిఆర్ పెట్టిన 7వ తేదీ హద్దుకూ ప్రాధాన్యమేర్పడుతున్నది.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, బీహార్, ఈశాన్య రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగించాలని కోరినట్టు సమాచారం. అక్కడక్కడా తెరచినందువల్ల ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని, ప్రాణాలు కాపాడడానికే అగ్రతర ఇవ్వాలని ఈ రాష్ట్రాలు అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. అయితే లాక్‌డౌన్‌ను ఎల్లకాలం కఠినంగా కొనసాగించినందువల్ల కరోనా వైరస్ తిరిగి కనిపించకుండా మటుమాయమవుతుందని అనుకోడానికి వీలు లేదు. వేసవి వెళ్లిపోయి వాతావరణం మళ్లీ చల్లబడిన తర్వాత వైరస్ తిరిగి విజృంభిస్తే ఎలా అనే ప్రశ్నార్థకమూ తలెత్తుతున్నది. ఇక్కడ అమెరికాలో కరోనా బలిపీఠంగా మారిపోయిన న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ ఎంక్యూమో ఆలోచనలను ప్రస్తావించుకోడం సముచితంగా ఉంటుంది. అమెరికాలో లాక్‌డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టిన దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యవస్థను తెరిచే విషయంలో తుది నిర్ణయాధికారం తనదేనని అంటున్నాడు.

ఆ విధంగా దేశ ఆర్థికానికి తిరిగి జీవం పోశాడన్న ప్రతిష్ఠను మూటగట్టుకొని అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలుపొందాలని ఆశిస్తున్నాడు. దానిని డెమొక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వీరిలో ప్రథముడు క్యూమో. కరోనా కాటుకు తీవ్రంగా నష్టపోతున్న న్యూయార్క్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా తొలగించాలని ఆయన కోరుకుంటున్నాడు. కరోనాను దగ్గరకు రానివ్వకుండా చూడడానికి అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటూనే ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలని భావిస్తున్నాడు. వైరస్ వ్యాప్తి, ఆసుపత్రులలో చేరికలు వరుసగా 14 రోజుల పాటు తగ్గు ముఖం పట్టిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ దశలవారీ రద్దును అమలు చేయాలనుకుంటున్నాడు. తొలిదశలో భవన నిర్మాణం, వస్తూత్పత్తి రంగాలను తెరవాలని, పని స్థలాల్లో వైరస్ సోకడానికి తక్కువ అవకాశాలున్న వ్యవస్థలకు వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నాడు.

అత్యవసరం కాని రంగాల ఉద్యోగులు ఇంటినుంచి పని చేస్తూనే ఆరడుగుల దూరాన్ని పాటించేలా ముఖ ముసుగులు ధరించేలా పథక రచన జరగాలని అభిప్రాయపడుతున్నాడు. తెరిచేటప్పుడు ప్రతి రెండు దశల మధ్య రెండు వారాల వ్యవధి పాటించాలని, ప్రతి ఒక్క దశ నుంచి కలిగే మేలుకీళ్లను నిశితంగా పరిశీలించిన తర్వాతనే తదుపరి దశను అనుమతించాలని వ్యూహ రచన చేశాడు. ఎల్లకాలం గృహ నిర్బంధాన్ని కొనసాగించే బదులు తగిన అన్ని జాగ్రత్తలతో సురక్షితమైన రీతిలో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే వివేకవంతమవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ ఢోకా లేదని ప్రధాని మోడీ అన్నారు. కాని పేద, మధ్య తరగతి ప్రజలు అత్యధికంగా వున్న మన వంటి దేశాలలో వారి రోజువారీ బతుకులు దుర్భరంగా కావడం కంటే ఆందోళనకరమైనది మరొకటి ఉండదు. ఆర్థిక చక్రం మామూలుగా తిరిగినప్పుడే వారికి అంతోఇంతో ఉపాధి కలుగుతుంది. ఈ కోణంలో చూసి నిర్ణయం తీసుకోవలసి ఉంది.

 

Lockdown gives better results
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News