Friday, May 3, 2024

జూన్ నుంచి మీటర్ రీడింగ్ చేపడతాం

- Advertisement -
TSSPDCL-CMD
హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకోవడం కుదరడం లేదు. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులను గతేడాది అదే సమయానికి వచ్చిన బిల్లుల ఆధారంగా చెల్లించాలని ఈఆర్సీ ఆదేశించింది. దాని ప్రకారం బిల్లు చూస్తే చాలా ఎక్కువగా వస్తోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చాలామంది ఇళ్లు మారడం సహజం. దీంతో ఇప్పుడు మీరు ఉంటున్న ఇంట్లో గతేడాది ఇదే టైంలో వేరు వాళ్లు ఉండి కరెంట్‌ను ఎక్కువగా వాడితే ఇప్పుడు ఉన్న వారు అదే బిల్లును చెల్లించాల్సి వస్తోంది. దీంతో చాలామంది గతేడాది తాము ఆ ఇంట్లో లేమని అంత బిల్లు తాము ఎందుకు కట్టాలని విద్యుత్ సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై కావాలనే కొందరు రకరకాలుగా పుకార్లను పుట్టిస్తూ వినియోగదారుల్లో మరింత ఆందోళన కలిగిస్తుండడంతో వారు బిల్లు కట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. 
తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తే కేసులు
ఇప్పటికే టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి సైతం వినియోగదారులు ఆందోళన చెందవద్దని, ఒకవేళ ఎక్కువగా బిల్లులను కడితే రానున్న రోజుల్లో కట్టే కరెంట్ బిల్లులో అడ్జెస్ట్‌మెంట్ చేస్తామని ప్రకటించారు. వచ్చే నెలలో ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీస్తామని దాని ప్రకారం బిల్లులు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. గత నెల రూ.1,783 కోట్లు రావాల్సి ఉండగా రూ. 1,103 కోట్లు మాత్రమే వచ్చిందని, ఇంకా 680 కోట్ల రెవెన్యూ రావాల్సి ఉందని ఆయన తెలిపారు. అపోహలను నమ్మకుండా బిల్లులు చెల్లించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇప్పటి వరకు ఎవరి విద్యుత్ కనెక్షన్ కట్ చేయలేదని, సిబ్బందికి జీతాలు ఇవ్వడం కోసం కరెంట్ బిల్లులు కట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిఎండి స్థాయి వ్యక్తి ప్రజలకు భరోసా ఇచ్చినా కొందరు కావాలనే వినియోగదారులను భయబ్రాంతులకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తుండడంతో వినియోగదారులకు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సంస్థ నిర్ణయించినట్టుగా తెలిసింది.
Meter reading will commence from June
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News