Saturday, April 27, 2024

‘ఐటి’ కరీం’నగ’ర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Begins IT Tower in Karimnagar

ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ నైపుణ్యవంతులున్నారు

వరంగల్ తరహాలో కరీంనగర్‌కు పెద్ద సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం
ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజే కాదు ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
తొలి రోజే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉంది
కరీంనగర్‌లో ఐటి టవర్ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్
వివిధ అభివృద్ధి కార్యకలాపాల పరిశీలన, ప్రారంభోత్సవాలు

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: ప్రస్తుత పరిస్థితుల్లో ఐటి నిర్వచనం మార్చాల్సి ఉందని, ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌లోని లోయర్ మానే రు డ్యాం తీరంలో రూ. 34 కోట్లతో నిర్మించిన ఐటి టవర్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఐటి టవర్‌లో ఎంఓయూ చే సుకున్న సంస్థల్లో నియమితులైన యువతీయువకులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటి టవర్ ప్రారంభం రోజునే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటి ఫలాలు జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ ఐటి టవర్‌లో 15 కం పెనీలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ఫస్ట్ స్కిల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. కరీంనగర్ నగరానికి సంబంధించిన ఎన్‌ఆర్‌ఐ మిత్రులు ఇక్కడి ఐటి టవర్‌లో తమ శాఖలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞ ప్తి చేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో 56వేల కోట్ల ఐటి ఎగుమతులు ఉండేవని, ఐటి రంగం పురోగతి ఆగకుడదన్న ఆలోచనతో డబుల్ స్పీడ్ కావాలన్న లక్షం పెట్టుకున్నామన్నారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు లక్షా 28 వేల కోట్లకు తెలంగాణ ఐటి ఎగుమతులు చేరుకున్నాయన్నారు.

ఐటి రంగంలో టాలెంట్ కేవలం హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ లాంటి నగరాల విద్యార్థులకే సొంతం కాదన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో, నగరాల్లోని నైపుణ్యవంతులైన యువత ఇతర నగరాలకు వలస పోవాల్సి వస్తోందన్నారు. తెలివైన యువతీ యువకులు గ్రా మీణ ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నో అద్భుత వి జయాలు సాధిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. స్థానిక యువతలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించాలన్నదే తమ లక్షమన్నారు. మని షి జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించే ఐటి సొల్యూషన్స్ రావాల్సి ఉందన్నారు. డిజిటల్ వాలెట్ (ఎం వ్యాలెట్) వచ్చిన తర్వాత వాహనదారులు తమ వెంట లైసెన్సు, ఇతర అనుమతి పత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఇలాంటివి మరిన్ని రావాలని సూచించారు. కోవిడ్ సంక్షోభం వల్ల ఐటి టవర్‌లో స్టార్టప్‌లకు జనవరి వరకు ఎలాంటి రెంట్ లేకుండా చూస్తామన్నారు. మరో టవర్ కూడా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. కరీంనగర్ నుండి వెళ్లి విదేశాల్లో ఐటి సం స్థలు నడుపుతున్న ఎన్‌ఆర్‌ఐలు కరీంనగర్ ఐటి టవర్‌లో కూడా తమ సంస్థలు స్థాపించాలన్నా రు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే విధంగా ఇదే టవర్‌లో టాస్క్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో టెక్ మహీంద్రలాంటి సంస్థలు వచ్చాయని, ఇక్కడికి కూడా పెద్ద సంస్థలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామన్నారు. కరీంనగర్‌లో ఐటి రంగం మరిన్ని మెట్లక్కి వేలాది మందికి ఉపాధి కల్పించే కేంద్రంగా మారాలన్నారు. తాను కరీంనగర్‌లోనే చదువకున్నానని, అప్పటికీ, ఇప్పటికీ ఈ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. రానున్న ఐదు, పది ఏళ్లలో హై స్పీడ్ రైళ్లు వస్తే కరీంనగర్ – నుంచి హైదరాబాద్‌కు 45 నిముషాల్లో వెళ్లి 45 నిముషాల్లో రావచ్చన్నారు.

మంచినీటి పథకం ప్రారంభం

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మంత్రి గంగుల కమలాకర్, నగర పాలక సంస్థ మేయర్ వై.సునీల్‌రావు ఆధ్వర్యంలో తాగునీటి పథకాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లో ప్రతిరోజూ మంచినీరు అందించే ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం మొత్తంలోనే కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా అది విజయవంతం అవుతుందని సిఎం కెసిఆర్ బలంగా నమ్ముతారని, అందుకే అనేక కార్యక్రమాలు ఇక్కడి నుంచే ప్రారంభించారని తెలిపారు. భవిష్యత్తులో 24 గంటల మంచినీటి సరఫరా కూడా కరీంనగర్ నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. 109 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 2048 సంవత్సరం వరకు ఉండే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టామని తెలిపారు. పెరుగుతున్న కరీంనగర్ నగర అభివృద్ధి, విస్తరణను దృష్టిలో ఉంచుకొని ఈ బృహత్తర కార్యక్రమం 94 ఎంఎల్‌డి సామర్థంతో ప్రారంభించామని వివరించారు. ఈ పథకాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపడతామని తెలిపారు. కరీంనగర్‌లోని మానేరు డ్యాం సమీపంలో గల లేక్‌పోలీస్‌స్టేషన్ వద్ద మంత్రి మొక్కలు నాటారు.

ఆరేళ్లలో అనేక సమస్యలు పరిష్కారం

కరీంనగర్ కోసం అర్బన్ లంగ్ స్పేస్‌ను మంత్రి గంగుల కమలాకర్ అడిగారని, కరీంనగర్ జనసాంద్రత ప్రకారం 80 ఎకరాల్లో అర్బన్ లంగ్స్ బేస్‌ను వెంటనే మంజూరు చేస్తామన్నారు. కరీంనగర్‌లో సైక్లింగ్ పార్కును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరీంనగర్‌లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులను చూసి మంత్రి కెటిఆర్ మురిసిపోయారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా స్మార్ట్ సిటీ పనులను పరిశీలించి మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్‌రావు, కమిషనర్ వల్లూరి క్రాంతిలను అభినందించారు. అనంతరం హెలిప్యాడ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాలను మంత్రి కెటిఆర్ జెండా ఊపి ప్రారంభించి గ్రౌండ్‌లో మొక్కలు నాటారు.

నేదునూరు ప్రాజెక్టు విషయం సిఎం దృష్టికి

నెదునూరు ప్రాజెక్టు విషయాన్ని మరోసారి సిఎం కెసిఆర్‌కు విన్నవిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సంబంధిత భూములను సద్వినియోగం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కోవిడ్ తర్వాత అనేక మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. నేదునూరు విద్యుత్ కేంద్రం కోసం సేకరించిన స్థలాన్ని, ఎస్సారెస్పీ ఖాళీ స్థలాలను కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేలా చూస్తామని స్పష్టం చేశారు.

సిఎం నాటిన మొక్కను చూసి..

2017లో ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారంలో భాగంగా మానేరు డ్యాం పరిసర ప్రాంతంలో మొక్కను నాటగా అది ఏపుగా పెరగడంతో మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి మొక్కను నాటి నీరు పోశారు. 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందన్నారు. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో మియావాకి పద్ధతిలో చేపట్టిన చిట్టడవుల పెంపకాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి సిపిటిసిలో మొక్కలు నాటారు.

కెసిఆర్ జలం.. ఇంటింటికీ వరం: మంత్రి గంగుల

కరీంనగర్‌లో మంత్రి కెటిఆర్ ప్రారంభించిన అర్బన్ మిషన్ భగీరథ నీరు కరీంనగర్ ప్రజలకు ప్రతిరోజూ అందించడం జరుగుతుందని, దానికి కెసిఆర్ జలం.. ఇంటింటికీ వరం.. అని నామకరణం చేయడం జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కాళేశ్వరం జలాలు తీసుకువచ్చిన సిఎంకు ప్రజలంతా రుణపడి ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పి ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ కె.శశాంక, పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, సుడా ఛైర్మన్ జి.వి.రామకృష్ణారావు, మాజీ జడ్పి ఛైర్ పర్సన్ తుల ఉమ, మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ అక్బర్ హుస్సేన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.

Minister KTR Begins IT Tower in Karimnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News