Sunday, April 28, 2024

మోడీ పాలన: పొంతనలేని సర్వేలు

- Advertisement -
- Advertisement -

mood of the nation survey 2020 report

దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్‌సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా ఆగస్టు సర్వే వివరాలను వెల్లడించారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొదలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అనే ప్రశ్న వరకు అనేక అంశాల మీద అభిప్రాయాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ సంస్ధ గత సర్వేను ఈ ఏడాది జనవరిలో నిర్వహించింది. పందొమ్మిది రాష్ట్రాలు, 97 లోకసభ నియోజకవర్గాల పరిధిలోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,021 మందిని ప్రశ్నించి జూలై 1527 తేదీల మధ్య అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 67 శాతం మంది గ్రామీణ ప్రాంతాలు, 33శాతం మందిని పట్టణ ప్రాంతాల నుంచి ఎంచుకున్నారు.

దీనికి ఉన్న పరిమితులను పై అంకెలు తెలియ చేస్తున్నాయి. వాటిని బట్టి దేశ మానసిక స్ధితిని ఈ సర్వే సమగ్రంగా ప్రతిబింబించిందా అనే సందేహాలు రావటం సహజం. సర్వేలో అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి వచ్చిన సమాధానాలు మరికొన్నింటి విషయంలో భిన్నంగాను పొంతన లేనివిగానూ కనిపిస్తాయి. నరేంద్రమోడీ మై హూనా అని ఆర్ధిక పరిస్దితి గురించి ఇస్తున్న ధీమాను జనం నమ్మటం లేదని ఈ సర్వేకు కొద్ది రోజుల ముందు ప్రచురించిన బ్రిటన్ యు గవ్ సర్వే వెల్లడించింది. భారత రిజర్వు బ్యాంకు నిర్వహించిన సర్వేలో అనేక ప్రతికూల ధోరణులు వెల్లడయ్యాయి. ఇండియా టుడే సర్వేలో మూడింట రెండు వంతుల మంది గ్రామీణులు పొల్గొనగా, ఆర్‌బిఐ పూర్తిగా పట్టణ ప్రాంతాల్లోనే జరిపింది. బ్రిటన్ యుగవ్ అంతర్జాతీయంగా అనేక దేశాల వారి అభిప్రాయాలు సేకరించగా మన దేశం నుంచి సహజంగానే పట్టణ ప్రాంతాలకే పరిమితం అయి ఉండవచ్చు. మూడు సర్వేల ప్రశ్నావళి, ఎంచుకున్న అంశాలు భిన్నమైనవి అయినప్పటికీ మూడింటిలో ఉన్న ఏకైక అంశం దేశ, పౌరుల ఆర్ధిక స్ధితి. కనుక మూడింటిని ఒకదానితో మరొక దానిని పోల్చలేము. ఇండియా టుడే సర్వేను చూసినపుడు మొత్తం ఆరేండ్ల మోడీ పాలన తీరు తెన్నుల గురించి అడిగినట్లుగా ఉంది. యుగవ్, ఆర్‌బిఐ వర్తమాన పరిస్ధితుల మీదనే జరిపాయి.

ఆర్ధిక నిర్వహణలో గత యుపిఏ ప్రభుత్వం కంటే నేటి సర్కార్ మెరుగ్గా ఉందని జనం ఇంకే మాత్రం విశ్వసించటం లేదని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. యు గవ్ , ఆర్‌బిఐ సర్వేలు అంతసూటిగా చెప్పకపోయినా వాటిలోని అంశాల భావమదే. ఇండియా టు డే సర్వే గురించి ముందు చూద్దాం. నరేంద్రమోడీ ప్రభుత్వం సాధించిన ఒక అతి పెద్ద విజయం ఏమిటి అన్న ప్రశ్నకు 18 అంశాల మీద సమాధానాలు వచ్చినట్లు పేర్కొన్నారు. వాటిలో ఆర్టికల్ 370 రద్దుకు 16శాతం, రామాలయం మీద సుప్రీం కోర్టు తీర్పు అని 13, మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం అని 11, అవినీతి లేకపోవటం, నల్లధనం మీద చర్యలని తొమ్మిది శాతాల చొప్పున, కరోనా సమస్య మీద వ్యవహరించిన తీరు అని 7, పెద్ద నోట్ల రద్దు, రైతులు, పేదలకు సంక్షేమ పధకాలని ఆరు శాతం చొప్పున పేర్కొన్నారు.జనం అతి పెద్ద విజయాలుగా జనం భావించినట్లు పేర్కొన్న ఆర్టికల్ 370 రద్దు యావత్ దేశానికి సంబంధించినది కాదు.

వివాదాస్పద రాజకీయ నిర్ణయం తప్ప ప్రభుత్వ పధకమూ కాదు. రామాలయ నిర్మాణం సుప్రీం కోర్టు తీర్పు పర్యవసానం తప్ప ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, ఒక పార్టీ లేదా వ్యక్తుల విజయమో అసలే కాదు. అయితే సుప్రీం కోర్టు న్యాయమూర్తులను నరేంద్రమోడీ ప్రభావితం చేసి అలాంటి తీర్పును వచ్చేట్లు చేశారని జనం భావిస్తున్నారా అన్న సందేహం వస్తోంది. అయితే ఈ రెండు అంశాల మీద బిజెపి, ప్రసార మాధ్యమాలు పెద్ద ఎత్తున చేసిన ప్రచార తీరు తెన్నులతో జనం వీటిని మోడీ విజయాలుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తమ నేత నరేంద్రమోడీ నాయకత్వంలో సాధించిన విజయాలుగా బిజెపి లేదా మోడీ ప్రచార గణం జనానికి చెప్పిన అంశాను జనం పెద్ద విజయాలుగా భావించటం లేదని సర్వే అంకెలు చెబుతున్నాయి. పౌర సత్వ సవరణ చట్టం (సిఏఏ), ఆయుష్మాన్ భారత్ అతి పెద్ద విజయాలని ఒక శాతం, విదేశాల్లో భారత ప్రతిష్టను పెంచటం, మేకిన్ ఇండియా, డిజిటల్ డ్రైవ్, మహిళాసాధికారత, ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించటం అతి పెద్ద విజయం అని భావించిన వారు కేవలం రెండు శాతం చొప్పున ఉన్నారు. జిఎస్‌టి అని చెప్పిన వారు ఐదుశాతమే.

మోడీ ప్రభుత్వ అతి పెద్ద ఏకైక వైఫల్యం ఏమిటి అన్న ప్రశ్నకు కరోనా వైరస్ వ్యాప్తి పట్ల వ్యవహరించిన తీరు అని 25శాతం, నిరుద్యోగంగా 23శాతం, లాక్‌డౌన్ సమయంలో వలస కూలీల పట్ల వ్యవహరించిన తీరు అని 14, ధరల పెరుగుదల అని 11శాతం మంది పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటన్న ప్రశ్నకు కరోనా మహమ్మారి అని 70శాతం మంది, నిరుద్యోగం అని 12శాతం పేర్కొనగా చైనాతో వివాదం అని కేవలం నాలుగుశాతం మందే పేర్కొన్నారు. ఇదే సమయంలో చైనాతో సరిహద్దు వివాదంలో యుద్దానికి పోవాలని 59శాతం మంది పేర్కొన్నట్లు సర్వే తెలిపింది.

అసలు అది పెద్ద సమస్య కాదని ఒక వైపు చెప్పిన వారు ఈ విధంగా స్పందించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. చైనా వ్యతిరేకతను, జాతీయవాదాన్ని రెచ్చగొట్టిన పర్యవసానం అనుకోవాలా ? ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో యుపిఏతో సమంగా ఉందని గత ఏడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా భావించిన వారు కేవలం పదకొండు శాతం మాత్రమే ఉంటే, ఇప్పుడు ఏకంగా 45శాతానికి పెరిగారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఇదే ఇండియా టుడే సర్వేలో ఆర్ధిక నిర్వహణ యుపిఏ కంటే మెరుగ్గా ఉందని భావించిన వారు 60శాతం ఉన్నారు. గతేడాది ఆగస్టులో కూడా అంతే ఉండగా తాజా సర్వేలో 43శాతానికి తగ్గారు. మన రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గానిది కీలక పాత్ర. కేంద్రంలో ప్రధాన మంత్రి, రాష్ర్టంలో ముఖ్యమంత్రి వాటికి సారధులు తప్ప సర్వాధికారులు కాదు. మోడీ కాబినెట్‌లో మంత్రుల జనసమ్మతి విషయానికి వస్తే జనవరిఆగస్టు మధ్య అమిత్ షాకు 43 నుంచి 39కి, రాజనాధ్ సింగ్ 3917, నితిన్ గడ్కరీ 3410, నిర్మలా సీతారామన్ 269, పియూష్ గోయల్ 242, స్మృతి ఇరానీ 222, రవిశంకర ప్రసాద్ 163 శాతాలకు పడి పోయింది. దీని అర్ధం కీలక మంత్రులు సరిగా పని చేయలేదనే కదా ? యుపిఏ కంటే ఆర్ధిక నిర్వహణ మెరుగ్గా లేక మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని జనం చెప్పారు.

ఇంకా అనేక అంశాలను ప్రతికూలంగానే చూడగా మరో వైపు మొత్తంగా ఎన్‌డిఏ పని తీరు సంతృప్తికరంగా ఉందని చెప్పిన వారు 72శాతం మంది ఉన్నట్లు సర్వే చెప్పింది. అదెలా సాధ్యం ? ప్రస్తుత మధ్యగత (మీడియన్) ద్రవ్యోల్బణం 9.9శాతంగా ఉంది. ఇంకా పెరగవచ్చనే వినియోగదారులు భావిస్తున్నారు. మరోవైపు వాణిజ్య మదింపు సూచిక గత ఏడాది చివరి త్రైమాసంలో 102.2 ఉండగా ఏప్రిల్‌జూన్ మధ్య 55.3 అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఉత్పత్తి, ఆర్డర్లు, ఉపాధి స్థ్దితిగతులను బట్టి ఉత్పాదక సంస్ధలు మదింపు వేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు నిర్వహించిన వర్తమాన పరిస్దితుల సూచీ(సిఎస్‌ఐ) సర్వేలో వినియోగదారుల విశ్వాసం చరిత్రలో రికార్డు స్ధాయికి పడిపోయినట్లు వెల్లడైంది. మే నెలలో సిఎస్‌ఐ 63.7శాతం ఉండగా జూలైలో 53.8కి తగ్గిందని ఆగస్టు మొదటి వారంలో ఆర్‌బిఐ విడుదల చేసిన వివరాలు వెల్లడించాయి.

జూలై 112వ తేదీల మధ్య దేశంలోని 13 ప్రధాన నగరాల్లోని 5,342 కుటుంబాల వారిని వివిధ అంశాలపై టెలిఫోన్ ద్వారా సర్వే చేశారు. మేనెలతో పోలిస్తే ప్రస్తుత ఆర్ధిక స్ధితిగతుల పట్ల మరింత ఎక్కువ నిరాశాపూరితంగా వినియోగదారులు ఉన్నారని తేలింది. గత ఏడాది కాలంలో మొత్తం మీద ఖర్చు పెరిగినప్పటికీ ప్రస్తుతం ఆచితూచి ఖర్చు చేస్తున్నామని, అత్యవసరం కాని వాటి మీద వచ్చే ఏడాది కూడా ఖర్చు చేసే అవకాశం లేదని, అయితే వచ్చే ఏడాది పరిస్ధితి బాగుపడవచ్చనే ఆశాభావాన్ని వినియోగదారులు వ్యక్తం చేశారు. సిఎస్‌ఐ సూచిక 100 ఉంటే మార్పు ఉండదని, వందకంటే ఎక్కువ ఉంటే గత ఏడాది కంటే మెరుగ్గా ఉంటుందని వినియోగదారులు భావిస్తున్నట్లుగా పరిగణిస్తారు. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి తమ స్ధితి మెరుగుపడుతుందనే ఆశాభావం వినియోగదారుల్లో కనిపించటం లేదు. ఆర్ధిక పరిస్దితి క్షీణించిందని చెప్పిన వారు 77.8శాతం ఉన్నారు. గతేడాది మే నుంచి ఆర్ధిక స్ధితి గురించి ప్రతికూల అభిప్రాయమే వెల్లడి అవుతోంది.

ధరల మీద ప్రతికూల అవగాహనతో 76.2శాతం ఉంటే రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటుందని చెప్పిన వారు 61.5శాతం మంది ఉన్నారు. అంటే ప్రస్తుత పాలకులు ధరలను తగ్గిస్తారనే విశ్వాసం వినియోగదారుల్లో లేదు. ఎనభైశాతం మంది ధరలు పెరిగినట్లు భావిస్తే రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతాయని 72శాతం పేర్కొన్నారు. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భావంతో ఉన్నారు. మేనెలలో ఖర్చు తగ్గించామని చెప్పిన వారు 12శాతం ఉంటే జూలైలో 17శాతానికి పెరిగారు. భవిష్యత్‌లో కూడా తగ్గుతుందని చెప్పిన వారు పదిశాతం మంది ఉన్నారు. యు గవ్ సర్వే ప్రకారం మన దేశం మాంద్యంలోకి పోనున్నదని 54శాతం మంది చెప్పగా ఇప్పుడున్న స్దితే కొనసాగుతుందని చెప్పిన వారు 21, అచ్చేదిన్ అని చెప్పిన వారు 14శాతం మంది ఉన్నారు. సర్వేకు ముందు నెలతో పోల్చితే సర్వే సమయంలో తమ ఆదాయం తగ్గిందని చెప్పిన వారి సంఖ్య ప్రపంచంలో అత్యధికంగా మెక్సికోలో 58శాతం కాగా రెండవ స్ధానంలో ఫిలిప్పీన్స్‌లో 51, మూడవ స్ధానంలో ఉన్న మన దేశంలో 50శాతం మంది చెప్పారు.

ఆదాయాలు పడిపోవటం ఎక్కువగా ఉన్న కారణంగానే యథాతధ స్ధితి కొనసాగుతుందని చెప్పిన వారి సంఖ్య తక్కువగా ఉంది. ప్రజల అవగాహనకు సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నరేంద్రమోడీ హయాంలో తమ ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడిందని చెప్పిన వారు 48శాతం మంది ఉన్నట్లు ఇండియా టుడే సర్వే పేర్కొన్నది. పదిశాతం దిగజారిందని, 42 శాతం మార్పులేదని చెప్పినట్లు ఉంది. సర్వేలో పాల్గొన్నవారు మూడింట రెండు వంతుల మంది గ్రామీణులు. ఒక వేళ దీన్ని ప్రామాణికంగా తీసుకున్నా 52శాతం మంది పరిస్దితి మెరుగుపడలేదనే అర్ధం. ఒక వేళ సమాధానాలు చెప్పిన వారు కరోనా సమయంలో పరిస్ధితి గురించి చెప్పి ఉంటే , నిజంగా మెరుగు పడి ఉంటే జిడిపి వృద్ధి రేటు తిరోగమనంలో ఎందుకు పడినట్లు ? మొత్తంగా ఆర్ధిక పరిస్ధితి, ఉపాధి దిగజారిందని యుగవ్, రిజర్వుబ్యాంకు సర్వేలు చెబుతున్నదానికి తమ పరిస్ధితి మెరుగుపడిందని ఇండియా టుడే సర్వేలో చెప్పినదానికి విరుద్ధం.

రిజర్వు బ్యాంకు పట్టణ ప్రల నుంచి అభిప్రాయాలు సేకరించింది.ఆదాయం, ఉపాధి పరిస్ధితి మరింత క్షీణించిందని ఆర్‌బిఐ పేర్కొన్నది. లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయ పంటలకు రవాణాల్లే రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయారు. అది గ్రామీణుల్లోని అన్ని తరగతుల మీద ప్రభావం చూపుతుంది, అందువలన తమ ఆదాయం పెరిగిందని స్పందించిన గ్రామీణులు ముఖ్యంగా వారిలో 47శాతం మంది ఎస్‌సి లేదా ఎస్‌టి సామాజిక తరగతికి చెందిన వారున్నారని ఇండియా టుడే చెప్పినదానిని పరిశీలించాల్సిందే. ప్రతిదీ దిగజారుతున్న స్ధితిలో ప్రధాని నరేంద్రమోడీ పని తీరు బాగుందని జనం చెపుతున్నట్లు తమ సర్వేలో వెల్లడి కావటం దిగ్భ్రమ కలిగిస్తోందని ఇండియా టుడే సంపాదకుడు రాజదీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించారు.

 

ఎం కోటేశ్వరరావు-  8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News