Monday, April 29, 2024

రేవంత్‌కు 14 రోజులు రిమాండ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్‌ కెమెరాలను వినియోగించిన కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డికి గురువారం ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసు బందోబస్తు నడుమ గోల్కోండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నేరుగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఢిల్లీలో లోక్‌సభ సమావేశాలకు హాజరై గురువారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డిని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించిన కేసులో ఎంపి రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితునిగా పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సెక్షన్ 184, 187, 11 రెడ్ విత్ 5ఎ, రెడ్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద ఎంపి రేవంత్‌రెడ్డితో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో ఐదుగురిని బుధవారం నాడు నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టిన రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాల మేరకే వీరు డ్రోన్ ఎగరవేసినట్టు తేల్చిన పోలీసులు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రశ్నించిన అనంతరం ఉప్పర్‌పల్లి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఇదిలాఉండగా నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలు వాడారనే ఆరోపణలపై నమోదైన ఈ కేసులో రేవంత్‌రెడ్డిని ఎ1గా నమోదు చేయడంతో పాటు సిఆర్‌పిసి సెక్షన్ 41 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కేసు వివరాలు
మల్కాజిరిగి ఎంపి రేవంత్‌రెడ్డి సోదరుడైన అనుముల కృష్ణారెడ్డి సూచనమేరకు మార్చి 1న ఉప్పర్‌పల్లికి చెందిన అన్నదమ్ములు విజయ్‌పాల్‌రెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, వీరి స్నేహితుడైన విజయ్‌సింహారెడ్డి కారులో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఆఫీస్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి డ్రోన్‌కెమెరాతో చిత్రీకరణ కోసం ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయ్‌సింహారెడ్డి కోకాపేటకు వెళ్లి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తిని కలిశారు. జైపాల్‌రెడ్డి స్థానిక యువకుడైన ఓం ప్రకాశ్‌రెడ్డిని వీరికి పరిచయం చేసి చిత్రీకరణకు సహకరిస్తారని వివరించాడు. దీంతో వీరంతా డ్రోన్‌కెమెరాతో అక్కడి క్రికెట్‌గ్రౌండ్‌వద్ద ఉన్న ఎత్తు ప్రదేశానికి చేరుకుని రహస్యంగా వారు అనుకున్న ప్రాంతంతోపాటు పరిసరాలను చిత్రీకరించి వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారు. విజువల్స్‌ను కృష్ణారెడ్డికి వాట్సప్‌ద్వారా పంపించారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి కార్యాలయానికి చేరుకొని పూర్తి సమాచారాన్ని కృష్ణారెడ్డికి అందజేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తుచేసిన నార్సింగి పోలీసులు బుధవారం ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయ్‌సింహారెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్(డ్రోన్‌ఆపరేటర్), శివ, ఓం ప్రకాశ్‌రెడ్డిను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై 224/2020లో సెక్షన్ 184, 187 ఐపిసి, 11ఎ రెడ్‌విత్ 5 ఎ ఎయిర్‌క్రాఫ్ట్‌కింద అభియోగాలు మోపారు. సైబరాబాద్‌పరిధిలో డ్రోన్‌కెమెరా ఉపయోగించడంపై ఇప్పటికే నిషేధం ఉన్న విషయం విదితమే.
సోషల్ మీడియాలో డ్రోన్ విజువల్స్ 
ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు, ఆస్తులపైకి డ్రోన్ కెమెరాలు పంపించడంపై నిషేధం ఉన్నా పట్టించుకోకుండా.. మంత్రి కెటిఆర్ ఫామ్ హౌస్ విజువల్స్ తీయడమే కాకుండా, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ఆరోపణలపై ఎంపి రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ వీడియోను మీడియాకు కూడా విడుదల చేయడంపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

MP Revanth Reddy Arrest at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News