Monday, April 29, 2024

మామిడి పండు ఒకటి రూ.1000!

- Advertisement -
- Advertisement -

మామిడి పండు ఒకటి రూ.1000!
మధ్యప్రదేశ్‌లో మాత్రమే పండే ‘నూర్జహాన్ ’ రకానికి ముందే బుకింగ్‌లు
ఈ సారి పంటతోపాటు పండు సైజు కూడా బాగా ఉందంటున్న రైతులు

ఇండోర్: అందరూ ఎంతో ఇష్టంగా తినే మామిడి పండు ధర మహా అయితే ఒకటి 20 రూపాయలు ఉంటుంది. అపురూపంగా లభించే కొన్ని రకాల పండ్లు అయితే కాస్త ఎక్కువ ఉంటుందేమో. కానీ మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో మాత్రమే పండే ఓ మామిడి పండు ఒక్కోటి దాదాపు రూ.1000 పలుకుతోందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకపోదు. అయితే, ఇది ముమ్మాటికీ నిజం. స్థానికులు ‘నూర్జహాన్’గా పిలిచే ఈ మామిడి పండు ఒక్కోటి రూ.500 నుంచి రూ.1000 దాకా పలుకుతోందని అక్కడి రైతులు చెపుతున్నారు. ఈ ఏడాది దిగుబడి బాగా ఉండడంతో పాటుగా పండు సైజు కూడా పెద్దదిగా ఉండడమే ఇంత ధర పలకడానికి కారణమని వారు చెపుతున్నారు. అఫ్ఘానిస్థాన్ ప్రాంతానికి చెందిన ఈ నూర్జహాన్ మామిడిని గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అలీరాజ్‌పూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తారు. ‘నా తోటలో ఉండే మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 కాయలు కాశాయి.

ఈ పండు ఒక్కోటి రూ. 500నుంచి రూ.1000 దాకా ధర పలుకుతోంది. ఈ పండ్లకు ఇప్పటికే బుకింగ్ కూడా జరిగిపోయింది’ అని కత్తివాడ ప్రాంతంలో మామిడిపంట పండించే శివరాజ్ సింగ్ జాదవ్ అనే రైతు చెప్పాడు. మధ్యప్రదేశ్‌తో పాటు పొరుగున ఉండే గుజరాత్‌కు చెందిన ఈ పండ్లను ఇష్టపడే వారు ముందుగా వీటిని బుక్ చేసుకున్నట్లు ఆయన చెప్పాడు. ఈ సారి ఒక్కో నూర్జహాన్ మామిడి పండు బరువు 2 నుంచి 3.5 కిలోల దాకా ఉందని కూడా ఆయన చెప్పాడు. కాగా, ఈ సారి పంట బాగా ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా వ్యాపారం దెబ్బతిన్నదని మరో రైతు ఇషాక్ మన్సూరి చెప్పాడు. గత ఏడాది వాతావరణం సరిగా లేకపోవడంతో నూర్జహాన్ చెట్లు సరిగా పూత పూయలేదని ఆయన చెప్పాడు. జనవరి నెలలో పూతకు వచ్చే ఈ రకం పండ్లు జూన్ నెలలో లభిస్తాయి.

Noorjahan Mangoes price up to Rs 1000 apiece in MP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News