Monday, April 29, 2024

సంక్షేమమే కాదు, ప్రగతీ ముఖ్యమే!

- Advertisement -
- Advertisement -

Not welfare progress is important in India

 

భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వైపు అందరి చూపు మళ్లింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆమె కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. గత సంవత్సరం కూడా ఇదే ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా… బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి కొన్ని రోజుల ముందు ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి, ప్రముఖ ఆర్థిక మేధావుల నుంచి సలహాలు, సూచనలు వెళ్లాయి. తీరా బడ్జెట్ ఆమోదం పొందిన తరువాత అది అనుకున్న స్థాయిలో యావన్మంది దేశ ప్రజల మన్ననలు పొందలేదు. సహజంగా నేడు కార్పొరేట్ కంపెనీలు ఆధిపత్యం చలాయిస్తున్న నేపథ్యంలో మన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే వెలువడుతున్నాయి.
గత సంవత్సరం ఫిబ్రవరిలో బడ్జెట్ ఆమోదం పొందిన నెల రోజులకే కరోనా సంక్షోభం ముంచుకురావడం తద్వారా దేశ వ్యాప్త్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోవడం, పేదలు, అతి నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు వంటి అనేక కోట్లాది మంది ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడిప్పుడే కొంత మేర తేరుకుంటున్నప్పటికీ… కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం వుంది. పుండు మీద కారం లాగా కరోనా ద్వారా ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి తోడుగా దేశ వ్యాప్తంగా ఇంచుమించు అన్ని రాష్ట్రాలలో వరదలు రావడంతో అతివృష్టి వల్ల దేశ ప్రజానీకంలో మెజారిటీ ప్రజలైన రైతుల పంటలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్‌తో పాటు నేపాల్, చైనా వంటి సరిహద్దు దేశాల నుంచి కూడా ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో సమస్యలు వెంటాడుతూనే వున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రపంచంలో రెండవ అతి పెద్ద దేశంగా వున్న భారత సామాజిక వ్యవస్థను గాడిన పెట్టడానికి నిర్మలమ్మ ఏ తాయిలాలు తీసుకొస్తున్నారో… సామాన్యులకు ఎటువంటి ఊరట లభిస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఆశతో… ఇంకొందరు ఆత్మ విశ్వాసంతో ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్‌లో ఇలా … ఇలా వుండాలని ఈ సారి కూడా అప్పుడే సలహాలు, సూచనలతో పాటు విజ్ఞప్తులు పంపిస్తున్నారు.
2018 2019 ప్రారంభంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థికమాంద్యం ద్వారా వచ్చిన సమస్యలతో సతమత మయ్యా యి. భూతల స్వర్గంలా రాణించిన అమెరికా కూడా మొదటిసారి ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆర్థిక క్రమశిక్షణకు మరో పేరుగా రాణిస్తూ… ఈ రెండు దశాబ్దాల కాలంలో దూసుకువెళ్లిన చైనా సైతం ఒడిదుడుకులకు లోనయ్యింది. అటువంటి సమయంలో కూడా భారత్ వృద్ధి రేటు 8 శాతాన్ని సాధించి ఔరా..! అనిపించుకుంది. రెండు సంవత్సరాల కిందట ప్రపంచ ధనిక దేశాలలో మన దేశానికి ఆరవ స్థానం వచ్చిందని పాలకులు చాలా సంబరపడిపోయారు. అయితే…. కేవలం ఒక శాతం కుబేరుల చేతుల్లో 70 శాతం సంపద కేంద్రీకృతమైన విషయం మరిచిపోకూడదు. కరోనా కష్టకాలంలో మన దేశం దాదాపు యాభై పేద దేశాలకు కొంత మేర ఆర్థికంగా చేయూతనిచ్చింది. ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు సైతం మన భారత్ మేధోపరంగా ఇతరత్రా వనరుల పరంగా దిక్సూచిగా వ్యవహరిస్తున్నది. ఇలా మన దేశంలో పుష్కలమైన సహజ వనరులు, మానవ వనరులు అధికంగా ఉన్నాయి. అయితే 130 కోట్ల జనాభాలో ఎదుగూ బొదుగూ లేని 40 కోట్ల పేదల పరిస్థితిని గురించి ఆలోచించవలసి వుంది. నూతన వ్యవసాయ చట్టాల ద్వారా ‘వన్ నేషన్ వన్ మార్కెట్’ పద్ధతి ద్వారా పేద రైతులకు గిట్టుబాటు ధర లభించనున్నదని చిన్న తరహా, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సౌలభ్యం రానున్నదని చెబుతున్నప్పటికీ ఇందులో ఆచరణలోకి వచ్చేసరికి సవా లక్ష అడ్డంకులు ఎదురు కానున్నాయి. రైతులకు సంబంధించిన కొన్ని పంటలకు కనీస గిట్టుబాటు ధరను నిర్ణయిస్తూ… దానికి చట్ట రూపం తీసుకురావాలనేది అన్ని వర్గాల రైతుల ఆకాంక్ష. ఇలాగే బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఆధిపత్యం వహించే చోట చిన్న చితక పరిశ్రమలు, దేశీయ పరిశ్రమలు వటవృక్షం కింద వేరే మొక్కలు ఎదగవనే విషయం అడుగడుగునా నిరూపితమవుతున్నది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ మన పాలకులు ఎన్నికల ముందర తీసుకొచ్చే బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. సంక్షేమ పథకాలు వుండవలసిందే. అదే సందర్భంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను విస్మరించకూడదు. చేపలు ఇవ్వడం కన్నా వాటిని పెంపొందించడం నేర్పించాలనేది ఓ సామెత. కరోనా కష్టకాలం నుంచి ప్రజలను కొంత మేర ఆదుకోడానికి ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రభుత్వం లక్షలాది కోట్లు సంక్షేమ పథకాలకు, రాయితీలకు కేటాయించింది. అయితే… అవి అసలైన అర్హులకు, లబ్దిదారులకు కనీసం 30 శాతం కూడా వెళ్లలేదు. పాలకులలో జవాబుదారీతనం, పారదర్శకత లోపించడం వల్ల యథారాజా తథాప్రజా అనే విధంగా ప్రజలు కూడా తీసుకుంటున్న రుణాలను, పొందుతున్న రాయితీలను తాత్కాలిక ప్రయోజనాలకు, విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. పాలకులలో లోపించిన పారదర్శకతలో భాగంగానే విజయమాల్యా, లలిత్‌మోడీ, నీరవ్‌మోడీ లాంటి వాళ్లు బ్యాంకులకు వేలాది కోట్లు శఠగోపం పెట్టారు.
భారత నేతలు, కుబేరులకు సంబంధించిన నల్లధనం స్విస్ బ్యాంకుతో పాటు ఇతర దేశాల్లో రూ. 300 లక్షల కోట్లు దాగి వుందని ఎప్పటి నుంచో ప్రచారంలో వుంది. తాజా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంలో భాగంగా నిర్మలా సీతారామన్ తోటి మంత్రి వర్గ సభ్యులకు భారత ప్రధానికి విదేశాల నుంచి రప్పించవలసిన భారత నల్లధనం గురించి సరైన సలహా ఇవ్వాలని అందుకు పటిష్ఠంగా కఠినమైన చట్టాన్ని రూపొందించడానికి సూచనలు చేయాలని మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే పారిశ్రామికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి తీపిమాటలతో వేలాది ఎకరాలు ప్రభుత్వాల నుంచి నామమాత్రపు ధరకు పొందిన బడా పారిశ్రామికవేత్తలు ఆ భూములను మరో కోణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ఇతరత్రా వాటికి వినియోగిస్తున్నందున అటువంటి వారి భరతం పట్టడానికి కూడా ఈ బడ్జెట్‌లో ప్రస్తావించవలసిన అవసరం వుంది. ట్రస్ట్‌లు, ఎన్‌జిఒలు, ఇతర ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవల పేరుతో ప్రభుత్వానికి తగిన విధంగా ట్యాక్స్ చెల్లించకుండా ఎగురగొడుతున్న వ్యవస్థల మీద కూడా కన్నెర్ర చేయవలసి వుంది. బహుళజాతి కంపెనీలను, కార్పొరేట్ కంపెనీలను పక్కనబెట్టి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద పీట వేసి బ్యాంకుల ద్వారా లింకేజీ లేకుండా నేరుగా ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు చేయూతనిచ్చి వారి ఉత్పత్తులను విక్రయించడానికి వారితో ప్రభుత్వం భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి. ఇలాగే రైతు ఉత్పత్తులను రైతులే అమ్ముకునే విధంగా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఆ స్థాయిలో ఓ ప్రణాళిక తీసుకురావాలి.
ఈ విధంగా తాజా బడ్జెట్‌లో సామాన్యులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూనే శాశ్వత అభివృద్ధికి కూడా దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలి. ఇందుకు అన్ని రంగాలలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే అవినీతికి, నిర్లక్ష్యానికి చరమగీతం పాడినట్లవుతుంది. ధనకామందులు, బలవంతులు దూరం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదే సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ సహకార రంగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భారత్‌లో కూడా సహకార వ్యవస్థకు పెద్ద పీట వేయవలసి వుంది. కార్పొరేట్ వ్యవస్థ వద్దు కో ఆపరేటివ్ వ్యవస్థ ముద్దు అనే నినాదం దేశ వ్యాప్తంగా ఊపందుకోవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News