Saturday, April 27, 2024

రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లకు సొంత భవనాలు

- Advertisement -
- Advertisement -

Registration offices

 

త్వరలోనే నిర్మాణాలు చేపడుతాం
టెక్నాలజీ వినియోగంతో సంస్కరణలు
4.91 లక్షల ఎకరాల సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాం
భూ రికార్డులను అప్‌డేట్ చేస్తున్నాం
శాసనసభలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా, వాటిలో 33 కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నాయని, మరో 15 కార్యాలయాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. దశలవారీగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామని తెలిపారు. అసెంబ్లీలో రెవిన్యూ పద్దులపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. భూముల రిజిస్ట్రేషన్ విధానంలో తమ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పారదర్శక విధానాలు తీసుకుచ్చిందని అన్నారు. అందులో భాగంగా టీ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. 2014- 15 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 7.35 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 2019-20 సంవత్సరంలో 15 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు.

చిట్‌ఫండ్లను క్రమబద్దీకరించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజిని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ చేపడుతున్న సంస్కరణలకు కేంద్రం ఆ శాఖకు గోల్డ్ మెడల్ ఇచ్చిందని వెల్లడించారు. పాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసిందని అన్నారు. 4.91 లక్షల ఎకరాల సాదాబైనా దరఖాస్తులను పరిష్కరించామని చెప్పారు. ప్రస్తుతం మీ సేవా ద్వారా 74 రకాలు సేవలను అందిస్తున్నామని అన్నారు. భూ రికార్డులను అప్‌డేట్ చేస్తున్నామని, రాష్ట్రంలో 2.48 కోట్ల ఎకరాల భూమి ఉంటే 77 లక్షల ఎకరాలు మినహా భూ రికార్డులు అప్‌డేట్ అయ్యాయని వెల్లడించారు. కొత్త రెవిన్యూ చట్టంపై సిఎం కెసిఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా పేరు మార్చాలని ఎంఎల్‌ఎ ఛల్లా ధర్మారెడ్డి అడిగారని, ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అలాగే రెవిన్యూ కోర్టులలో పెరుగుతున్న పెండింగ్ కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఎంఎల్‌ఎ రాజాసింగ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని, ఇంకా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

జూన్‌లో గొర్రెల పంపిణీ : మంత్రి తలసాని
గొర్రెల పంపిణీ కోసం దరఖాస్తు చేసుకుని డిడిలు కట్టిన వారికి జూన్‌లో గొర్రెలు పంపిణీ చేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అసెంబ్లీ ఆయన పశుసంవర్థక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ పద్దులపై మంత్రి మాట్లాడారు. వాతావరణ కారణాల వల్ల ప్రస్తుతం పంపిణీ చేయలేమని, జూన్‌లో గొర్రెలను పంపిణీ చేస్తామని తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మత్సకారులకు టూ వీలర్, ఫోర్ వీలర్‌లు పంపిణీ చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం జీవాలకు కూడా అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడంతోపాటు జీవాలకు కూడా ఆధార్ కార్డు ఇస్తుందని తెలిపారు. గోశాలలో మొబైల్ వాహనం అందుబాటులో ఉంచామని అన్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఇతర రా్రష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

నీరా కేంద్రం ఏర్పాటు చేస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
తాటిచెట్టు కల్పవృక్షం లాంటిదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. గీత కార్మికులు ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే తమ ప్రభుత్వ లక్షమని స్పష్టం చేశారు. ఈ సంవత్సరంలోనే ట్యాంక్‌బండ్‌పై నీరా కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచుకోవడమే కాదు, కార్మికులకు అండగా నిలుస్తుందని తెలిపారు. కల్లు వృత్తిపై రాష్ట్రంలో సుమారు 5 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలలో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు.

ఫ్యాన్సీ నెంబర్లకు ఆన్‌లైన్ బిడ్డింగ్‌తో రూ.55 లక్షల ఆదాయం : మంత్రి పువ్వాడ
రాష్ట్రంలో రవాణాశాఖలో 59 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహిస్తున్నామని, ఈ విధానం ద్వారా రవాణా శాఖకు అదనంగా రూ.55 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో రవాణాశాఖ, ఆర్‌టిసి పద్దులపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమాధానం ఇచ్చారు. త్వరలో అన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆర్‌టిసి కార్మికుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచామని, రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగినులు విధులు నిర్వహించ చర్య లు తీసుకున్నామన్నారు.ఆర్‌టిసి సమ్మె సమయంలో ప్రతిపక్షాలు చేసిన వికృత చేష్టలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే కార్మికుల మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.

 

Own buildings to the Registration offices
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News