Monday, April 29, 2024

వరిలో రికార్డు

- Advertisement -
- Advertisement -

Paddy acreage reaches record level in Telangana

భారీ స్థాయికి చేరిన విస్తీర్ణం

61.75లక్షల ఎకరాల్లో వరినాట్లు
కోటి 29లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయశాఖ అంచనాలను తలకిందులు చేస్తూ వరిసాగు విస్తీర్ణం రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు సీజన్‌కింద వరిసాగు విస్తీర్ణం 181.58శాతానికి చేరుకుంది. గత ఏడాది వానాకాలం వరిసాగు వీస్తీర్ణం కంటే ఈ ఏడాది పది లక్షల ఎకరాల్లో అధికంగా వరినాట్లు పడ్డాయి. ఇంత భారీ ఎత్తున వరిసాగు కావటం పట్ల వ్యవసాయ శాఖ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

రాష్ట్రంలో వానాకాలం వరిసాగు సాధారణ విస్తీర్ణం 34.01లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది వాతావరణ అనుకూలత ,బారీ వర్షాలతో రిజర్వాయర్లు నిండిపోయి సాగునీటి లభ్యత పెరగటంతో వరిసాగు విస్తీర్ణం 55లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ముందస్తు అంచనాలు వేసుకొంది. అయితే బుధవారం నాడు వ్యవసాయ శాఖ విడుదల చేసిన వారాంతపు పంటలసాగు నివేదికను బట్టి రాష్ట్రంలో ఇప్పటివరకూ 61,75,534ఎకరాల విస్తీర్ణంలో వరినాట్లు పడ్డాయి. ఈ నెలాఖరు నాటికి మరో రెండు మూడు లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 51,90,726 ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఈ ఏడాది అనూహ్య రీతిలో వరిసాగు పెరగటం పట్ల అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

కోటి29లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు

రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం అన్నిరకాల పంటలు కలిపి ఇప్పటి వరకూ 1,29,19,312ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. మొత్తం 110.77శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. సాగులోకి వచ్చిన పంటల్లో అత్యధిక శాతం వరిపంటే సాగులోకి వచ్చింది. మిగిలిన ఆహారధాన్య పంటల్లో జొన్న 37409ఎకరాలు, సజ్జ 622 ఎకరాలు, మొక్కజొన్న 704487ఎకరాలు, రాగి 635ఎకరాలు, ఇతర చిరుధాన్య పంటలు 298ఎకరాల్లో సాగులోకి వచ్చాయి.

79.50శాతంలోనే పప్పుధాన్య పంటలు:

రాష్ట్రంలో పప్పుధాన్య పంటల సాగు విస్తీర్ణం 79.50శాతం వద్దనే ఆగిపోయింది. అన్ని రకాల పప్పుధాన్య పంటలు కలిపి 9లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రధాన పంటల్లో కంది 7.59లక్షల ఎకరాలు, పెసర 88339ఎకరాలు, మినుము 47251ఎకరాలు, ఉలవ 987ఎకరాలు, ఇతర మరికొన్ని పప్పుధాన్య పంటలు 3731ఎకరాల్లో సాగు చేశారు.

4.09లక్షల ఎకరాల్లో నూనెగింజ పంటలు

రాష్ట్రంలో వానాకాలం సీజన్‌కింద అన్ని రకాల నూనెగింజ పంటలు కలిపి 4.09లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. అందులో వేరుశనగ 28483ఎకరాలు, నువ్వులు 1524ఎకరాలు, పొద్దుతిరుగుడు 282ఎకరాలు , ఆముదం 5333 ఎకరాలు , సోయాబీన్ 3,73,698ఎకరాలు , ఇతర మరికొన్నినూనెగింజ పంటలు 367ఎకరాల్లో సాగు చేశారు. రాష్ట్రంలో నూనెగింజల సాధారణ సాగు విస్తీర్ణం 5.92లక్షల ఎకరాలు కాగా గత ఏడాది 4.61లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగు చేయగా ఈ సారి 69.18శాతంలోనే సాగులోకి వచ్చాయి.

46.25లక్షల ఎకరాల వద్దే ఆగిన పత్తి విస్తీర్ణం

రాష్ట్రంలో పత్తి సాగు వీస్తీర్ణం భారీగా పెరుగుతుందని ఆంచనా వేయగా ఈ పంట విస్తీర్ణం 97.17శాతం వద్దనే ఆగిపోయింది. రాష్ట్రంలో పత్తిసాగు సాధారణ విస్తీర్ణం 47.60లక్షల ఎకరాలు కాగా , గత ఏడాది 60లక్షల ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. ఈ సారి పత్తిపంటను 46.25లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వాణిజ్య పంటల్లో ఇప్పటివరకూ 1364ఎకరాల్లో పొగాకు నాటేశారు. చెరకు పంట 51022ఎకరాలు , ఇతర మరికొన్ని వాణిజ్య పంటలు 12546ఎకరాల్లో సాగు చేశారు. రాష్ట్రంలో వానాకాలం అన్నిరకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 11663267 ఎకరాలు కాగా, ఈ సమయానికి 10862287ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సివుండగా ఇప్పటివరకూ 12919312ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది ఇదే సమాయానికి 13336499ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News