Monday, April 29, 2024

పెగాసస్‌పై నిపుణుల కమిటీ: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

Supreme court
న్యూఢిల్లీ: ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌కు ఇజ్రాయెల్ ఎన్‌ఎస్‌ఓకు చెందిన గూఢచర్య సాఫ్టవేర్ ‘పెగాసస్’ను ప్రభుత్వం వినియోగించిందంటూ ఇటీవల రచ్చ జరిగింది. అయితే ఈ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గురువారం తెలిపారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీచేయనున్నట్లు ఓ కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది చందర్‌ఉదయ్ సింగ్‌కు తెలిపారు.
పెగాసస్ నిఘాలో దాదాపు 300 భారతీయ మొబైల్‌ఫోన్లు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కన్సార్టియం ఇటీవల రిపోర్టుచేసింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇద్దరు కేంద్ర మంత్రులు-ప్రహ్లాద్ సింగ్ పటేల్, రైల్వే, ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, ఓ మాజీ సిబిఐ చీఫ్, కనీసం 40 మంది జర్నలిస్టులు లీక్ అయిన ఎన్‌ఎస్‌ఒ డేటాబేస్‌లో ఉన్నాయని సమాచారం. అయితే వారందరి ఫోన్లు హ్యాక్ అయ్యాయా అన్నది ఇంకా ధృవపడలేదు.

వాస్తవానికి ఈ నిపుణుల కమిటీ ఏర్పాటు విషయంలో ఈ వారంలోనే ఉత్తర్వులు జారీచేయాలని సుప్రీంకోర్టు భావించింది. కానీ సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఉండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరం చెప్పడంతో దాని ఏర్పాటు ఆలస్యమవుతోందని రమణ వెల్లడించారు. పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులను ఆపి ఉంచిన సంగతి తెలిసిందే.

కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని, కానీ ఫోన్లపై నిఘాపెట్టడానికి పెగాసస్, ఇతరత్రా సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నామో లేదో చెప్పే అఫిడవిట్‌ను దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత పేరిట మరోసారి విముఖత చూపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ముందు హాజరై ఈ విషయాన్ని తెలిపారు. దీంతో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. ‘దేశభద్రతకు సంబంధించిన అంశాలను తామేమి అడగట్లేదు, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారా లేదా అని మాత్రమే అడుగుతున్నాము’ అని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News