Monday, April 29, 2024

తెరుచుకొంటున్న మద్యం షాపులు

- Advertisement -
- Advertisement -

 Liquor stores

 

రెడ్‌జోన్లలోను కంటైన్‌మెంట్ ఏరియాల వెలుపల అనుమతి
ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకలోని అన్ని జిల్లాల్లో నేటినుంచి అమ్మకాలు
అదే బాటలో ఎపి,గోవా, అసోం
మరిన్ని రాష్ట్రాలు కూడా అనుమతించే అవకాశం

న్యూఢిల్లీ/ముంబయి/బెంగళూరు: దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఆంక్షల సడలింపులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలకు మినహాయింపులుకూడా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ఢిల్లీ తో పాటుగా మహారాష్ట్ర, కర్నాటక, గోవా, అసోం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకాలం మూసి ఉన్న మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతించాలని నిర్ణయించాయి. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాటలోనే మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతించే అవకాశం ఉంది. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. అన్నిటికన్నా ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలోకి రాని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతించాలని నిర్ణయించింది. దీంతో 400కు పైగా మద్యం దుకాణాలు సోమవారంనుంచి తెరుచుకోనున్నాయి.

అయితే మాల్స్‌లలో ఉండే మద్యం దుకాణాలను మాత్రం అనుమతించరు. ఢిల్లీ ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం నగరంలో 545 లిక్కర్ షాపులున్నాయి. వీటిలో కొన్ని మాల్స్‌లో, మరికొన్ని కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నాయి. కొన్ని షరతులతో మద్యం షాపులు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం శనివారం ఎక్సైజ్ శాఖను నగరంలో విడివిడిగా ఉన్న మద్యం షాపుల వివరాలను కోరింది. అయితే ఢిల్లీలోని 11 జిల్లాలు కూడా రెడ్‌జోన్‌లో ఉండగా, 96 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. అయితే కేంద్ర హోం శాఖ పేర్కొన్నట్లుగా భౌతిక దూరంతో పాటుగా జనం పెద్ద సంఖ్యలో గుమికూడకుండా చూడడం లాంటి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేట్లు చూడాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా, కేంద్ర ప్రభుత్వం ఆరంజ్, గ్రీన్ జోన్లలో మాత్రమే మద్యం దుకాణాలను కొన్ని షరతులు పాటిస్తూ తెరవడానికి అనుమతి ఇవ్వగా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెడ్ జోన్లలో కూడా మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సోమవారంనుంచి నిత్యావసరం కాని వ్యాపార కార్యకలాపాలకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో మద్యం షాపులు కూడా ఉండడం వివాదాస్పదంగా మారింది. నిత్యావసరాల విషయంలో ఎలాంటి షరతులు విధించని రాష్ట్రప్రభుత్వం నిత్యావసరాలు కాని వాటి విషయంలో మాత్రం ఒక లైన్‌లో అయిదు షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే మహారాష్ట్రలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో మద్యం దుకాణాలను ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం అనుమతించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై లేదని కొందరు విమర్శిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సోమవారంనుంచి మద్యం షాపులను అనుమతించనున్నట్లు కర్నాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్ నగేశ్ తెలియజేశారు. అయితే రెడ్‌జోన్లలో మాత్రం కంటైన్‌మెంట్ జోన్లకు వెలుపల ఉన్న షాపులను మాత్రమే అనుమతించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అలాగే మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఉండే దుకాణాలను మాత్రం అనుమతించమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్, అసోం, గోవా ప్రభుత్వాలు కూడా సోమవారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలను అనుమతించనున్నట్లు ప్రకటించాయి. అయితే మద్యంపై కోవిడ్ సెస్ విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది.

 

Permission to open Liquor stores
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News