Wednesday, May 1, 2024

గాంధీలో ప్లాస్మా సేకరణ

- Advertisement -
- Advertisement -

Plasma Therapy

 

 ఇద్దరి నుంచి తీసుకున్న వైద్యులు
ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారమే ప్రాణపాయం ఉన్న కరోనా రోగులకే ప్లాస్మా ప్రక్రియ : గాంధీ సూపరింటెండెంట్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుప్రతిలో ప్లాస్మాథెరపీ ట్రయల్ విధానం ప్రారంభమైంది. సోమవారం ఇద్దరు వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా రాజారావు తెలిపారు. వరంగల్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు, ఎల్‌బినగర్‌కి చెందిన మరో వ్యక్తి నుంచి ప్లాస్మాను తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్లాస్మాథెరఫీ ట్రయల్స్ ప్రారంభం తర్వాత ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కాన్వలసెంట్ ప్లాస్మా ప్రక్రియను ప్రారంభించామని, రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వరంగల్‌కు చెందిన యువ న్యాయవాది ఎన్నంశెట్టి అఖిల్ ప్లాస్మాను డోనేట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక్కోక్క వ్యక్తి నుంచి ప్లాస్మా తీసుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టిందని, దాతల నుంచి సేకరించిన ప్లాస్మాను మైనస్ 0.8 డిగ్రీస్‌లో భద్రపరుస్తామని చెప్పారు.

ఈ ప్లాస్మాపై ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం పరిశోధనలు చేసిన తర్వాత కోవిడ్ క్రిటికల్ రోగులకు ఎక్కిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్లాస్మా ఎక్కించే ముందు దాత, బాధితుడి బ్లడ్ ఒకే గ్రూప్‌కి చెంది ఉండాలని, దీంతో పాటు క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాత ప్లాస్మాథెరఫీ చికిత్స చేస్తామని ఆయన వెల్లడించారు. నేడు(మంగళవారం) కూడా మరికొందరు దాతలు వచ్చే అవకాశం ఉందని, వీరందరి ప్లాస్మాను ప్రత్యేక ల్యాబ్‌లో ఉంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం మొట్టమొదటి ప్లాస్మాదాత ఎన్నంశెట్టి అఖిల్ మాట్లాడుతూ… కరోనా వ్యాధి సోకితే ఎవరు భయాందోళన గురికావొద్దని, గాంధీ ఆసుపత్రిలో అద్బుతమైన చికిత్స లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

తాను డిశ్చార్జ్ అయిన 40 రోజుల తర్వాత ప్లాస్మా ఇచ్చానని, ఇలా దానం చేయడం వలన మరోకరి ప్రాణం నిలబెట్టినవాళ్లమవుతామని ఆయన అన్నారు. దీని వలన నష్టం కూడా లేదని, ప్రతి రోజూ సంపూర్ణమైన ఆహారాన్ని తీసుకుంటూ ప్లాస్మాను డోనేట్ చేయవచ్చని వివరించారు. ఇప్పటికే వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్న వారిలో ఆరోగ్యవంతులుగా ఉన్న వారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చి ఇతరుల ప్రాణాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎఒ జయకృష్ణ, వైద్యాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News