Sunday, April 28, 2024

నిజాయితీ పన్నుదారులకు జయహో

- Advertisement -
- Advertisement -

పన్నుల వ్యవస్థ సంస్కరణకు కొత్త పథకం
‘పారదర్శక పన్ను వేదిక’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఇది దోహదపడుతుందని వ్యాఖ్య

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకు రావడానికి ‘పారదర్శక పన్ను విధాన వేదిక’ తోడ్పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీ వేదికగా మోడీ గురువారం ‘పారదర్శక పన్ను విధానం వేదిక’ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశంలో పన్నులు చెల్లించే వారు కేవలం 1.5 కోట్ల మందే ఉన్నారని, ఇది చాలా తక్కువ అని ప్రధాని అంటూ పన్ను బకాయి ఉన్న వారు ముందుకు వచ్చి, నిజాయితీగా పన్ను చెల్లించి దేశ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. ప్రత్యేక వేదిక ద్వారా సులువుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయనిఅన్నారు. గతంలో పన్ను సంస్కరణలు తప్పనిసరి పరిస్థితుల్లోనో, లేదా ఒత్తిడి వల్లో చేసే వారని, అందువల్ల అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదన్నారు. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందని మోడీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అత్యంత ఆవశ్యకమని ప్రధాని చెప్పారు. కరోనా కష్టకాలంలోను రికార్డు స్థాయిలో ఎఫ్‌డిఐలు వచ్చాయన్నారు. సెప్టెంబర్ 25నుంచి ఫేస్‌లెస్ అప్పీల్ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకు వచ్చిందని, గత ఏడాది కార్పొరేట్ పన్నురేట్లను 30 శాతంనుంచి 22 శాతానికి తగ్గించిందని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని 15 శాతం చేశామని చెప్పారు. వీలయినన్ని ఎక్కువ కేసులు కోర్టు బైట పరిష్కారమవడానికి వీలుగా ప్రభుత్వం ఇటీవల ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని తీసుకువచ్చామని, దీనిద్వారా అతి తక్కువ సమయంలో 3 లక్షల కేసులను పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును కూడా రద్దు చేశామని తెలిపారు. పన్నుల సరళీకరణే లక్షంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మోడీ చెప్పారు. అంతకు ముందు మోడీ ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘గురువారం ఉదయం 11 గంటలకు ‘ట్రాన్స్‌పరెంట్ ట్యాక్సేషన్‌ హానరింగ్ ది హానెస్ట్’ (పారదర్శక పన్ను నిజాయితీలను గౌరవించడం) ప్రారంభం కానుంది. ఇది దేశంలో పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేసేందుకు బలం చేకూరుస్తుంది. ఇది నిజాయితీగా పన్ను చెల్లించి, జాతి పురోగమనానికి దోహదపడే పలువురు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని ప్రధాని ట్విట్టర్‌లో ప్రకటించారు. కార్యకరమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి అనురాగ్ ఢాకుర్‌తో పాటుగా ఆర్థిక శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

PM Modi launches ‘Transparent Tax Platform’

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News