Monday, April 29, 2024

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

Power generation from Garbage

 

రాష్ట్రంలో మొదటిప్లాంట్‌కు అనుమతి
త్వరలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
బ్యాక్ చార్జింగ్‌కు అనుమతి ఇచ్చిన టిఎస్‌ఎస్‌పిడిసిఎల్
ప్లాంట్ నుంచి సమీపంలోని మల్కారం సబ్ స్టేషన్‌కు
లైన్ ద్వారా విద్యుత్ సరఫరా

మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ రంగంలో తెలంగాణ మరో రికార్డు సృష్టించనుంది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఢిల్లీ, అహ్మదాబాద్ రాష్ట్రాల్లో ఉండగా.. దక్షిణ భారత దేశంలో మాత్రం తెలంగాణలో మొదటి ప్లాంట్ త్వరలోనే అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో కీలక అంకం ముగిసింది. బ్యాక్ చార్జింగ్‌కు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నుంచి అనుమతి ఇచ్చింది. దీంతో వీలైనంత త్వరగా విద్యుదుత్పత్తి ప్లాంట్ (వేస్ట్ టు ఎనర్జీ)ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో లోడ్ టెస్టింగ్‌తోపాటు, బ్యాక్ ఛార్జింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని జిహెచ్‌ఎంసి పరిధిలో నిత్యం సగటున 6,300 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది.

చెత్తను వేరు చేసి తడి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువులు, శుద్ధి చేసిన చెత్తతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. వ్యర్ధాల డంపింగ్‌కు స్థలం కొరత, దుర్వాసన వస్తోందన్న పౌరుల అభ్యంతరాల నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణకు శ్రీకారం చుట్టాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్‌డిఎఫ్ ప్లాంట్ నిర్మాణం తెరపైకి వచ్చింది. వ్యర్థాల నిర్వహణను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం జవహర్‌నగర్‌కు తరలిస్తున్న వ్యర్థాలను ఆ సంస్థ అక్కడే శుద్ధి చేస్తోంది. ఒప్పందంలో భాగంగా విద్యుదుత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. తడి చెత్తతో సేంద్రియ ఎరువు, శుద్ధి చేసిన వ్యర్థాలను విద్యుదుత్పత్తికి వినియోగించడం ద్వారా డంపింగ్ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోవడం తగ్గుతుంది.

ఇది పర్యావరణహితంతో పాటు స్థానికుల ఆరోగ్యం, జల వనరులు కలుషితం కాకుండా ఉంటుంది. కాగా మొదటి దశలో భాగంగా నిత్యం 19.8 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు పూర్తి కాగా, నిర్ణీత స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కోసం రోజు 1200-ల నుంచి1300 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వినియోగించనున్నారు. ప్లాంట్ పనులు పూర్తికాగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ అనుమతి కోరారు. గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ప్లాంట్ నుంచి సమీపంలోని మల్కారం సబ్ స్టేషన్‌కు ఇప్పటికే పూర్తయిన లైన్ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News