Monday, April 29, 2024

రాహుల్ కు ఊరట

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎట్టకేలకు ఊరట లభించింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ ట్రయల్ కోర్టు ఆయనకు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే మంజూరు చేయడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరణ అయ్యేందుకు దారి ఏర్పడింది. దేశంలో ప్రతిపక్షానికి విలువైన నేతగా ఉన్న వ్యక్తి ఇటువంటి కేసుల్లో చిక్కుకోడం ప్రజాస్వామ్య మనుగడకి హానికరమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కోలార్‌లో మాట్లాడుతూ పేరుల చివర మోడీ అని ఉన్నవారంతా దొంగలే ఎలా అవుతున్నారు అని అన్నందుకు రాహుల్ పై గుజరాత్ బిజెపి ఎంఎల్‌ఎ పూర్ణేశ్ మోడీ వేసిన పరువు నష్టం కేసులో ఆ చట్టంలోని క్రిమినల్ సెక్షన్ కింద రెండేళ్ల గరిష్ఠ శిక్షను ట్రయల్ కోర్టు విధించింది. దీనిపై ఆ రాష్టంలోని పై కోర్టులను ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది.గుజరాత్ హైకోర్టు కూడా ఈ శిక్షను ఆపలేదు. దానితో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ స్టే దొరికింది. కింది కోర్టు శిక్ష ప్రకటించిన వెంటనే ఆగమేఘాల మీద ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు, అధికారిక నివాస భవనం నుంచి కూడా ఖాళీ చేయించారు. 2019లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆయన సంప్రదాయ లోక్‌సభ స్థానం అమేథీలో ఓడిపోయారు.

తనకు స్టే నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ చేసుకొన్న అప్పీలును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయి, పిఎస్ నరసింహ, సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారించింది. అప్పీలుపై పూర్తి విచారణ ఇంకా జరగవలసి వుంది. ఆలోగా ధర్మాసనం స్టే మంజూరు చేసింది. నరేంద్ర మోడీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీ (ఇతర ఇద్దరు మోడీలు ఆర్ధిక నేరస్థులు)- వీరి ముగ్గురూ మోడీలే కావడాన్ని రాహుల్ గాంధీ తన కోలార్ ప్రసంగంలో ప్రస్తావించారు. మొత్తం మోడీ జాతినే అవమాన పరిచారంటూ పూర్ణేశ్ మోడీ కోర్టుకెక్కారు. క్రిమినల్ పరువు నష్టం కింద గరిష్ఠ శిక్ష విధించిన ట్రయల్ కోర్టు అప్పీల్ చేసుకోడానికి రాహుల్ గాంధీకి నెల రోజుల వ్యవధి ఇచ్చింది. పరువు నష్టం దావా సెక్షన్ 8 కింద రాహుల్ గాంధీకి శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు తగిన కారణాలు చూపలేదని, కేవలం మందలించి గరిష్ఠ శిక్ష విధించిందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ శిక్ష రాహుల్ హక్కులనే కాకుండా, ఆయనను ఎన్నుకొన్న ఆ నియోజకవర్గ ప్రజల హక్కులను సైతం హరించిందని అభిప్రాయపడుతూ ధర్మాసనం స్టే మంజూరు చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. పరువు నష్టం కింద రెండేళ్ల గరిష్ఠ శిక్ష విధించడమంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఆయనకు నిరాకరించడమే కాగలదని ఆ విధంగా రాహుల్ గాంధీ నోరును ఎనిమిదేళ్ల పాటు నొక్కి వేయడం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్‌కు ఇంత వరకు ఏ కేసులోనూ శిక్ష పడలేదని చెప్పారు. ఇందుకు సమాధానంగా రాఫెల్ యుద్ధ విమానాల కేసులో సుప్రీంకోర్టు ప్రధాని మోడీని తప్పు పట్టిందని అబద్ధమాడినందుకు రాహుల్ గాంధీని అత్యున్నత న్యాయస్థానం మందలించిందని, ఎదుటివారిని విమర్శించేటప్పుడు ఇక ముందు జాగ్రత్త వహించాలని హెచ్చరించిందని అది కూడా శిక్ష కిందికే వస్తుందని సీనియర్ న్యాయవాది మహేష్ జేత్మలానీ అన్నారు. ఈ విచారణలో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా పాల్గొన్నారు. ఒక దశలో న్యాయమూర్తి గవాయ్ వ్యాఖ్యానిస్తూ సాలిసిటర్ జనరల్ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి వస్తున్న తీర్పులు ఆసక్తిదాయకంగా ఉన్నాయని అన్నారు. ఇటువంటి కేసుల్లో హైకోర్టు స్థాయిలోనే స్టేలు మంజూరు కావాలన్నది జస్టిస్ గవాయ్ ఉద్దేశం అయి ఉంటే ఉండవచ్చు. కారణాలు చూపకుండానే ట్రయల్ కోర్టు పరువు నష్టం కింద గరిష్ఠ శిక్ష విధించడమూ ఆయనను ఆశ్చర్యపరిచి ఉండవచ్చు.

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు వేసిన శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు గల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని కాపాడి, ఒక హెచ్చరిక కూడా చేసింది. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమన్నది. ఆయన చేసిన మోడీల వ్యాఖ్య సభ్యతాయుతంగా లేదని అన్నది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా అన్నది.దేశంలో రాజకీయ నాయకులు పరస్పరం వేసుకొంటున్న నిందలు, చేసుకొంటున్న విమర్శలు సభ్యతా పరిధిని ఎప్పుడో దాటిపోయాయి. అవి అన్నీ సుప్రీంకోర్టు దృష్టికి వెళితే గౌరవ న్యాయమూర్తులు విస్తుపోతారు. అవి వ్యక్తిగత కక్షతో రువ్వుకొనేవి కూడా కాదని చెప్పవచ్చు. రాహుల్ పై ఈ కేసు బిజెపి వారు ఆయనను ఇరుకున పెట్టడానికి వేసిందే. ఆ విషయం అందరికీ తెలిసిందే. పాలకులు దేశాన్ని దోచుకొంటున్నారు అని విమర్శించడానికి రాహుల్ గాంధీ, మోడీల ప్రస్తావన తెచ్చి ఉండవచ్చు. దేశద్రోహం కేసు మాదిరిగానే పరువు నష్టం కేసు కూడా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందుల పాలు చేయడానికి దుర్వియోగమవుతున్నది. అందుచేత పరువు నష్టంలోని క్రిమినల్ సెక్షన్‌ను రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి వన్నె తెస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News