Monday, April 29, 2024

ఎపి ఇసి నిమ్మగడ్డ ఉద్వాసనకు రంగం సిద్ధం

- Advertisement -
- Advertisement -

AP Election Commissioner

 

హైదరాబాద్ : కరోనా కట్టడి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పక్కకు తప్పించేందుకు ఆర్డినెన్సు ద్వారా సవరించి జివొ నంబర్ 617, 618 లను శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 617,618 జివొల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా చట్ట సవరణ ద్వారా ఇసి రమేష్ కుమార్ పై వేటు వేసేందుకు సిద్ధం చేశారు. ఈ క్రమంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కె) ప్రకారం (ఎస్ ఇసి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని గవర్నర్ నియమించే అధికారం ఉంటుంది. గవర్నర్ ఇసిని నియమించాక అతని పదవీకాలం 5 ఏళ్లుంటుంది. ఈక్రమంలో ఆయనను తొలగించే అధికారం పార్లమెంటుకు తప్ప ఎవరికీ ఉండదు. ఈ నేపథ్యంలో హైకోర్టు జడ్జిని తొలగించే విధానమే ఎస్ (ఇసి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపునకు వర్తిస్తుంది.

కాగా హైకోర్టు జడ్జి హోదా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎన్నికల కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు కుదించారు. ఈ జివొల ప్రకారం రమేష్ కుమార్ ని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అవకతవకల కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రానికి రమేష్ లేఖ రాసిన విషయం విదితమే. అదేవిధంగా తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని లేఖలో రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రత కోరారు. ఇదిలాఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి అధికారాలు, నిధుల గురించి 73,74వ రాజ్యాంగ సవరణల్లో స్పష్టంగా ఉందని, ప్రభుత్వ చర్యలు 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకమని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోయేలా ప్రభుత్వం చేస్తోందని, రాజ్యాంగంలో ఆర్టికల్ 243(కె), ఎపి పంచాయితీరాజ్ చట్టం 1994 సెక్షన్ 200 రెండింటి సారాంశం ఒక్కటేనని టిడిపి నేతలు వివరిస్తున్నారు. ఎవరైనా సరే 73,74 రాజ్యాంగ సవరణల అనుగుణంగావ్యవహరించాలని, ఇసి నియామకం, పదవీకాలం గురించి రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని, పంచాయితీరాజ్ చట్టానికి ఏ సవరణలు చేసినా రాజ్యాంగ పరిధిలోనే జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదిత ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Removed of AP Election Commissioner
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News