Monday, April 29, 2024

వైన్స్ తెరవక తప్పదా?

- Advertisement -
- Advertisement -
Revenue for the Treasury with Safe Liquor

 

లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు
ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు
సేఫ్ లిక్కర్‌తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా
ఎపి, ఢిల్లీ అనుభవాలతో మద్యం పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
లాక్‌డౌన్ కొనసాగినా వెసులుబాట్లు పెంచాల్సిన అవసరం
కంటైన్మెంట్లలో కఠినం, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు

మనతెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్రంలో కఠినంగా అమల్లో ఉన్న 40 రోజుల పైచిలుకు సం పూర్ణ లాక్‌డౌన్ దరిమిలా దాదాపు జీరోకు చేరిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాల్సిన పరిస్థితులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆర్థికం కన్నా ప్రజల ప్రాణాలకే ఇప్పటి దాకా ప్రాధాన్యతను ఇచ్చినా కేంద్రం ఇచ్చిన సడలింపులతో పొరుగు రాష్ట్రాలు ఖజానాను నింపుకొనే ప్రయత్నాలు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత తలకిందులు చేసే సూచనలు కనిపిస్తున్నాయనడానికి మద్యానికి పొరుగున ఉన్న మూడు రాష్ట్రాలు అనుమతించడం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన సడలింపులను పొరుగు రాష్ట్రాల మాదిరిగానే అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తూనే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో మార్చి 23న లాక్‌డౌన్ ప్రకటిస్తే మే 7 వరకు అంటే 44 రోజులు, కేంద్రం ప్రకటించిన మే 17 అంటే 54 రోజులు సడలింపులతో లాక్‌డౌన్‌ను ప్రజలు పాటిస్తున్నారు.

కాని దాదాపుగా రెండు నెలల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు ఆదాయమే లేకుంటే దైనందిన జీవనంలో సంక్షోభం ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వలస కూలీలు పని లేక ఆదాయం లేక రోజులు గడిచే మార్గంలేక నిబంధనల సంకెళ్లను తెంపుకొని ప్రాణాంతక ప్రయాణాలు చేస్తున్నారంటే వారిలో ఆక్రోశం ఎంతగా ఉందో కళ్ల ముందు రోజూ కనిపిస్తున్నదే. ఇలాంటి పరిస్థితే సాధారణ ప్రజల నుంచి రాక ముందే ప్రభుత్వాలు ఆర్థికాన్ని ఎంత వేగం గా పట్టాలపై ఎక్కిస్తే అంతగా అందరికీ క్షేమమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దీని వల్ల ప్రజలకు ఉపాధి లభించడంతోపాటు ఆకలి, ఆక్రోశాలు అంతమవుతాయని ఇది చేయకుండా సుదీర్ఘంగా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే ఎంత కాలం ప్రభుత్వాలు ఆర్థికాన్ని భరిస్తాయని ఆయన ప్రశ్నించడం ఈ సందర్భంగా గమనార్హం. కరోనా మహమ్మారిని కఠినంగా కట్టడి చేస్తూనే సురక్షితంగా దశలవారీగా, రంగాల వారీగా లాక్‌డౌన్‌ను నిష్క్రమించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆర్థికవేత్తలు కూడా సూచిస్తున్నారు. లాక్‌డౌన్ పద్మవ్యూహం నుంచి బయటపడడం అంత సులభం కాదు.

ఇది అత్యంత సున్నితమైన సమస్య. కట్టడిలో కఠినంపై రాజీ పడకుండా సమస్యలు లేని చోట సరళంగా వ్యవహరిస్తూ పోవడమే రాష్ట్రం ముందున్న మార్గమని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తున్న ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. కేంద్రం అనుమతించిన సడలింపులతో రాష్ట్రానికి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల్లో మద్యం షాపులు తెరుచుకోవడంతో ఆ రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి మద్యంపై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి బదులు రాష్ట్రంలో కూడా మద్యానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో మద్య ం ద్వారా నెలకు రూ. 1200 కోట్ల దాకా రెవెన్యూ వస్తున్నది. తెలంగాణలో మద్యాన్ని అనుమతించకపోతే ఇక్కడి మందుబాబులు పొరుగున ఉన్న రాష్ట్రాల్లో మ ద్యం కొనుగోలు చేస్తారు. ఇది మూడు పొరుగు రాష్ట్రాల్లో మద్యానికి తలుపులు తెరిచిన సోమవారం రోజే ఇక్కడి ప్రజలు అక్కడ మద్యం కొనడానికి ఏదో ఒక దారిలో వెళ్లి క్యూలో నిల్చున్న దృశ్యాలు, సంఘటనలు కనిపించా యి. ఎపి, ఢిల్లీ మాదిరిగా లిక్కర్ కోసం కి.మీల క్యూ లను నివారించాలంటే ఇక్కడ గుంపులు, క్యూలు లేని విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించినా దొంగ దారుల్లో మద్యాన్ని అత్యధిక రేట్లకు అమ్ముతున్నారు. కొందరు ఈ నిషేధాన్ని కాసుల కల్పవృక్షంగా మార్చుకున్నారు. ఇంకో వైపు గుడుంబాకు మళ్లీ ప్రాణం పోశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుడుంబాను నిషేధించింది. కాని ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో మద్యం అసలు దొరకని పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి గుడుంబాను విచ్చల విడిగా తయారు చేసి దొంగ మార్గాల్లో విక్రయిస్తున్నారు. చివరకు కల్లును కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఏకైక ఆశయానికి ఈ దొంగదార్లు గండి కొడుతున్నాయి. మద్యాన్ని ఇప్పటిలా పూర్తిగా నిషేధిస్తే ఖజానాకు చేరాల్సిన ఆదాయం పొరు గు రాష్ట్రాలకు, అక్రమ మద్యం వ్యాపారులకు వెళ్లిపోతున్నది. పైగా కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలకు గండం ఏర్పడుతున్నది. ఆదాయం కోల్పోయి ప్రజల ప్రాణాలను కల్తీకి వదలడం కన్నా మద్యంపై ఆదాయాన్ని రాబడుతూ ఆ డబ్బులను కరోనా నిరోధానికి వాడితే బాగుంటుందికదాని ఆర్థిక వేత్తలు సలహా ఇస్తున్నారు.

కొత్తగా పొరుగున ఉన్న మూడు రాష్ట్రాలు మద్యానికి గేట్లు తెరవడంతో రాష్ట్రం అనివార్యంగా రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోవడానికి బదులు పరిమితులతో మద్యాన్ని అనుమతించాల్సిన పరిస్థితులను కల్పించాయి. మరో వైపు నిషేధ కాలంలో మందు దొరకక మానసిక స్థిమితం కోల్పోయి వేలాది మంది ఎర్రగడ్డ ఆసుపత్రికి చేరుకున్న దృశ్యాలు మన ముందు కనిపించాయి. మరి కొందరు మద్యం కోసం వైన్ షాపులను బద్దలు కొట్టి నేరస్థులుగా మారారు. ఒక్క మద్యమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల ద్వారా నెలకు రూ. 12,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నది. మార్చి లో వారం రోజులు, ఏప్రిల్‌లో నెల రోజులు, మే లో ఇప్పటి వరకు ఆదాయం కోల్పోయింది.

ఏ రంగం నుం చి ఆదాయం రాలేదు. అప్పులు, బాండ్ల ద్వారా ఆర్థికాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాలను తగ్గించడం ద్వారా ఆర్థిక వెసులుబాటును కొనసాగిస్తున్నా ఇది మరి కొంత కాలం ఇలాగే కొనసాగితే ఆ వర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకవచ్చు. రాష్ట్రంలో జిఎస్‌టి ద్వారా నెలకు రూ. 5000 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 600 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ద్వారా రూ. 1000 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ. 2000 కోట్లు, గ్రాంట్లు, అప్పుల ద్వా రా రూ. 3000 కోట్లు వస్తున్నాయి. ఇందులో గ్రాంట్లు, అప్పులు మినహా మిగతావేవీ లాక్‌డౌన్ కారణంగా రావడం లేదు.

తీవ్రత ఆధారంగా సడలింపులు, కఠినాలు
కేంద్రం 21 రోజులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోని 33 జిల్లాలను రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా విభజించింది. ఇందులో హైదరాబాద్, వికారాబాద్, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్‌లను రెడ్ జోన్లుగా గుర్తించింది. తొమ్మిది జిల్లాలను గ్రీన్ జోన్‌లుగా, 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించారు. ఇందులో 27 జిల్లాలు గ్రీన్, ఆరెంజ్ జిల్లాలున్నాయి. రెడ్ జోన్‌లో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు కీలకమైనవి. రాష్ట్ర ఆదాయంలో సింహ భాగం ఈ జిల్లాల నుంచే వస్తున్నది. అయితే ఈ మొత్తం జిల్లాలలో ఆర్థిక కార్యకలాపాలను ఆపడానికి బదులు సమస్య తీవ్రత ఉన్న కంటైన్‌మెంట్ జోన్ల పరిధిని తగ్గించి పరిమిత రంగాలకు అనుమతిస్తే అటు కరోనాను నియంత్రించడంతోపాటుగా రెవెన్యూకు ఇబ్బంది ఉండదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.

ఈ సందర్భంగా నారాయణ హృదయాలకు చెందిన దేవిశెట్టి కామెంట్లను కూడా గమనంలోకి తీసుకోవాలి. కంటైన్‌మెంట్ జోన్లను శాస్త్రీయంగా వర్గీకరించాలి. అంటే ఒక ఇంట్లో కోవిడ్ ఒకరికి సోకితే ఆ ప్రాంతంలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లో ఉండే కొన్ని ఇళ్లను కొంత పరిధిలో నిలువరించాలి. కాని కిలోమీటర్ల దూరంలో కాలనీలకు కాలనీలే నిలువరించే జోన్‌లుగా ప్రకటించి బాధితులు కాని ప్రజలందరి స్వేచ్ఛను హరించడం ఏ మేరకు శాస్త్రీయమనే ఆయన ప్రశ్నను పాలకులు చర్చించడం మంచిది. అంటే సంపూర్ణంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయకుండా షరతులతో అన్ని ముందు జాగ్రత్తల చర్యలతో పాక్షికంగా ఆర్థిక కార్యకలాపాలను అనుమతించాలని వారు సూచిస్తున్నారు.

ఏది అవసరం, ఏది కాదు
లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు, ఔషధాలు, కూరగాయలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ మారిన ఆధునిక కాలంలో అనేకం అత్యవసరాల్లో చేరా యి. వాటిని విస్మరిస్తే ప్రజల జీవనం ఎలా గడుస్తుందని సామాజికవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మధ్యవయస్కులు చివరకు కొందరు యువత కూడా కళ్ల జోడు లేకుండా పని చేయలేకపోతున్నారు. ఎక్కడైనా ప్రమాదంలో కళ్లజోడు పగిలిపోతే వీటిపై ఆధారపడ్డ వారు పని చేయని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. అంటే ఎక్కడ కళ్లజోళ్ల షాపులకు అనుమతి లేదు. అలాగే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితమే లేదు. దురదృష్టవశాత్తు ఫోన్ పగిలిపోతే రిపేరుకు దుకాణాలు లేవు. ఇప్పుడున్న ఆధునిక జీవనంలో ఫోన్‌తోనే బ్యాంకింగ్ చెల్లింపులు జరుగుతున్నాయి. అలాంటప్పుడు వీటిని కనీస అవసరాలుగా గుర్తించకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇప్పుడు మండుటెండల్లో ఇంట్లో కనీసం కూలర్ అయినా అందరికీ అత్యవసరమే. కాని వాటిని కొనుగోలు చేయాలంటే ఎలక్ట్రికల్ దుకాణాలే లేవు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో 4 లక్షలకు మందికి పైగా ఐటి ఉద్యోగులు లాక్‌డౌన్‌లో ఇంటినుంచి పని చేయాలంటే ఇంటర్‌నెట్ కోసం హై స్పీడ్ రౌటర్లు అవసరం. కాని అవి బయట దొరకడం లేదు, ఆన్‌లైన్‌లో కూడా లభించడం లేదు. దీనితో అనేక మంది పనికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెపుకోవాలంటే ఫోన్ ఛార్జర్లు కూడా ఇప్పుడు అత్యంత ముఖ్యమే. అవి లేకుంటే ఫోన్ పని చేయదనే విషయం అందరికీ తెలిసిందే. కాని వాటిని రిపేర్ చేయడానికో, కొత్తవి కొనుక్కోవడానికో ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడానికో అవకాశమే లేదు. ఇవన్నీ అత్యవసరాల జాబితాలో లేవు. అవసరాలు, అత్యవసరాలను శాస్త్రీయంగా పునర్ నిర్వచించాల్సిన పరిస్థితిని లాక్‌డౌన్ కల్పించింది. ఈ చేదు అనుభవంతోనైనా ప్రభుత్వం ఈ-కామర్స్ సంస్థల ద్వారా పరిమితంగా అంటే ఎలక్ట్రానిక్ వస్తువులను కాంటాక్ట్ లెస్‌గా సరఫరా చేయవచ్చు. పూర్తిగా ఈకామర్స్ ఆంక్షలు విధించకుండా ఈ సంస్థల ద్వారా పంపిణీ చేసే వస్తువుల జాబితాను విస్తరించవచ్చు.

 

Revenue for the Treasury with Safe Liquor
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News