Friday, May 17, 2024

పెరుగుతున్న ఉల్లి ధరలు

- Advertisement -
- Advertisement -

Rising Onion Prices in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల కిందటి వరకు కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉన్న ధరలు ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డ కిలో రూ.50 వరకు అమ్ముతుండగా, సాధారణ ఉల్లి కిలో రూ.40కు విక్రయిస్తున్నారు. అయితే ఈ ధరలు రానున్న రోజుల్లో మరికొంత పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ప్రధానంగా సాగయ్యే రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రానికి దిగుమతులు తగ్గిపోయాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఎపి నుంచి తెలంగాణకు ఎక్కువగా దిగుమతులు అవుతాయి. గతేడాది కూడా అధిక వర్షాలకు, వరదలకు ఉల్లి పంట దెబ్బతినడంతో ఏకంగా కిలో రూ.170కి వెళ్లింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

అదే సమయంలో గతేడాది యాసంగిలో ఉల్లిసాగు గణనీయంగా పెరిగింది. దీంతో ధరలు తగ్గుతూ వచ్చాయి. మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే సమయానికి కిలో ఉల్లి ధర రూ.15 లోపే ఉంది. కూరగాయల ధరలు అమాంతం పెరిగినా, ఉల్లిగడ్డ కిలో రూ.20 దాటలేదు. అయితే మన రాష్ట్రానికి ఉల్లి దిగుమతి అయ్యే కర్నాటక, మహారాష్ట్ర, ఎపిలలో వర్షాలు అధికంగా కురిసి, మళ్లీ పంట దెబ్బతినింది. దీంతో దిగుబడులు తగ్గి, సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారి ఒకరు మన తెలంగాణకు చెప్పారు. గత నెల 10వ తేదీన ఉల్లి సరఫరా బోయిన్‌పల్లి మార్కెట్‌కు 2400 క్వింటాళ్ల వరకు రాగా నెలాఖారుకు 2 వేల క్వింటాళ్లకు పడిపోయింది. అప్పుడు హోల్‌సేల్‌గా క్వింటాకు రూ.2 వేలు ధర పలికింది. ఇప్పుడు రూ.3500 దాటింది.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిత్యావసరాల చట్టాన్ని సవరించింది. దీంతో ఉల్లిగడ్డ నిల్వలపై ప్రభుత్వ కంట్రోల్ పోయింది. దళారులు, బడా వ్యాపారులు అక్రమ ఉల్లి నిల్వలు చేయడం, ఇష్టారీతిన నిల్వలు ఎత్తివేయడం వంటి కారణాలతో కూడా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించింది. గత నెలలోనే దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా దేశీయంగా చర్యలు తీసుకోకపోతే ఉల్లి ధరలు అలాగే పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News