Monday, April 29, 2024

భా.క.పాలో మిత, అతివాదాల పాత్ర

- Advertisement -
- Advertisement -

Role of moderation and extremism in Communist party of India

భారత కమ్యూనిస్టు నిర్మాణ ఉద్యమంలో రివిజనిజం, అతివాదం పైచేయి సాధించటం వలన మార్క్సిజం, లెనినిజాన్ని దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి విప్లవోద్యమాన్ని నిర్మించటంలో నేటికీ అనేక అవరోధాలు ఏర్పడి ఉద్యమం పురోగమించలేకపోతున్నది. ఫలితం గా కమ్యూనిస్టు అభిమానులు నిరాశకు గురవుతున్నారు. పార్టీ కార్యదర్శి పిసి జోషి నాయకత్వాన ఉన్న కేంద్ర కమిటీ రివిజనిజాన్ని, సంస్కరణ వాదాన్ని, వర్గ సామరస్యాన్ని అమలు జరిపింది. బ్రిటిష్ సామ్రాజ్యవాద వలసపాలన నుండి దేశ విముక్తి కోసం స్వతంత్ర ప్రజా ఉద్యమాన్ని నిర్మించకుండా గాంధీ నాయకత్వాన ఉన్న ఉద్యమం చుట్టూ తిరిగే కార్యాచరణ రూపొందించింది.

జాతీయోద్యమ పోరాట నాయకత్వాన్ని కాంగ్రెస్‌కి కట్టబెట్టింది. వర్గ ఉద్యమాల దృక్పథాన్ని పక్కనపెట్టింది. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమ నాయకుడుగా రూపొందలేక పోయింది. జోషి నాయకత్వాన ఉన్న పార్టీ కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నా దేశంలోని అనేక ప్రాంతాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, వర్గ పోరాట అవసరాన్ని ముందుకు తెచ్చాయి. అలాంటి పోరాటాల్లో చారిత్రక ప్రాధాన్యత కలిగిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటం నైజాం నిరంకుశ పాలనకు, జాగీర్దార్లకు, జమీందార్లకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరీ రద్దు, దున్నేవానికే భూమి, భూస్వామ్య వ్యవస్థ రద్దుకోసం తెలంగాణ ప్రజలు సాగించిన సాయుధ తిరుగుబాటు.

ఈ పోరాటంలో అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ పార్టీలో దాగి ఉన్న రివిజనిజాన్ని, అతివాదాన్ని బహిర్గత చేసింది. సరైన పంథాను ముందు పెట్టింది. పిసి జోషి మితవాదానికి వ్యతిరేకంగా కామ్రేడ్స్ చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్యలు భారత విప్లవ పంథా ఏమిటన్నది స్పష్టమైన విధానంతో కేంద్ర కమిటీ ముందుపెట్టారు. ఆ విధంగా తొలిసారిగా భారత విప్లవ పంథా ప్రవేశపెట్టబడింది. భారత సామాజిక వ్యవస్థ విశ్లేషణ, వర్గవిభజన చేసి జనతా ప్రజాతంత్ర విప్లవం, సోషలిస్టు విప్లవం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుందని, వ్యవసాయ విప్లవం జనతా ప్రజాతంత్ర విప్లవానికి ఇరుసుగా సాగుతుందని, ప్రజా యుద్ధ పంథా అమలు చేయాలని ఆంధ్రా థీసెస్ పేర్కొంది. ఈ థీసీస్‌ను జోషి నాయకత్వాన ఉన్న కేంద్ర కమిటీ తిరస్కరించింది. జోషి నాయకత్వాన ఉన్న కేంద్ర కమిటీకి వ్యతిరేకంగా జరిగిన సిద్ధాంత పోరాటంలో జోషి స్థానంలో రణదీవె కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. రణదీవె నాయకత్వాన ఉన్న కేంద్ర కమిటీ అతివాద విధానాలు అమలు జరిపింది. ఆంధ్రా థీసీస్‌ను వ్యతిరేకించిందీ, అవహేళన చేసింది. దేశ వ్యాప్త విప్లవ పరిస్థితులను అంచనా వేయటంలో అతివాద ధోరణికి గురై సర్వవ్యాపిత తిరుగుబాటుకు పిలుపు ఇచ్చింది. పార్టీ నిషేధానికి గురైంది. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ తీవ్ర నష్టాలను పొందింది. అనేక ఉద్యమాలకు నష్టం వాటిల్లింది.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా మితవాద, అతివాదం తీవ్రస్థాయిలో ముందుకు వచ్చాయి. జోషి నాయకత్వాన ఉన్న పార్టీ వర్గ సామరస్యాన్ని ప్రబోధిస్తే, రణదీవె నాయకత్వాన ఉన్న కేంద్ర కమిటీ అతివాద దుందుడుకు విధానాలు అనుచరించి పార్టీని తీవ్ర నష్టానికి గురి చేసింది. అతివాద, మితవాద విధానాల వలన పార్టీకి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆంధ్ర థీసిస్‌ను చర్చించి ఆమోదించి, కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుని కార్యదర్శగా ఎన్నుకోవటం జరిగింది. ఈ పరిణామం పార్టీలో అత్యంత ముఖ్యమైనది. కామ్రేడ్ రాజేశ్వరరావు కార్యదర్శిగా ఎన్నిక కావటంతో సరైన మార్గంలో విప్లవోద్యమం ముందుకు పోతుందని పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాసులు ఆశించారు. సరైన పంథా అమలు జరగకుండా అతివాద, మితవాదులు ఐక్యంగా ఎలా అడ్డుపడతారో కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలియజేసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గొప్ప నాయకుడుగా ప్రచారం చేయబడ్డ రావి నారాయణరెడ్డి నెహ్రూ సైన్యాలు ప్రవేశం తర్వాత ఢిల్లీకి వెళ్లి రైతాంగ సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచి కాంగ్రెస్ మెప్పు పొందిన గొప్ప మహానుభావుడు.

అతివాద, మితవాద ధోరణుల ప్రాతినిధ్య నాయకుల అడ్డంకులు, అవరోధాలను ఎదుర్కోవటం లో సరైన పంథాకు ప్రాతినిధ్యం వహించే నాయకత్వంలో ఉన్న ఊగిసలాట ఫలితంగా పోరాట కొనసాగించాలా లేక విరమించాలా అన్ననిర్ణయం కోసం కామ్రేడ్ స్టాలిన్ సలహా కోసం రష్యా కు వెళ్ళటం జరిగింది.ఆయన ఇరుపక్షాలతో మాట్లాడిన తర్వాత, తాత్కాలిక పోరాట విరమణ చేసి పోరాటాన్ని తిరిగి పునర్నిర్మించాలని ఆయన సూచించటం జరిగింది. ఆ విధంగా పోరాట విరమణ జరిగింది.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమించిన తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ 1951 పాలసీ స్టేట్ మెంట్‌లో పంథా గురించి ఇలా చెప్పింది. ‘అనేక నెలల పాటు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత దేశ స్వాతంత్య్రాన్ని, ప్రజల ఆనందాన్ని సాధించటానికి సరైన పంథాకు సంబంధించిన నూతన అవగాహనకు పార్టీ ఇప్పుడు వచ్చింది. ఈ పంథాను రష్యా పంథా అనో లేక చైనా పంథా అనో పిలవం. ఇది మార్క్, ఏంగిల్స్, లెనిన్, స్టాలిన్‌ల బోధనలకు అనుగుణమైనదిగా, చరిత్రలో జరిగిన అన్ని పోరాటాలు, ప్రత్యేకించి రష్యా, చైనాలు అందించిన గుణపాఠాలను వినియోగించుకొనేదిగా ఉండాలి, ఉంటుంది. వ్యక్తిగత హింసావాదానికి మార్క్సిజం, లెనినిజంలో స్థానం లేదని కూడా చెప్పింది. అజయ్ ఘోష్ నాయకత్వాన ఉన్న మితవాద, అవకాశవాదం పార్టీలో పైచేయి సాధించి 1951 పాలసీ స్టేట్‌మెంట్ నుండి వైదొలగింది.

1953 డిసెంబర్ 1954 జనవరి పార్టీ కాంగ్రెస్, ‘స్వాతంత్య్రాన్ని సాధించాలి’ అనే దానికి బదులు ‘స్వాతంత్య్రాన్ని రక్షించాలి’ అన్న సూత్రీకరణను తెచ్చింది. పార్లమెంట్ మార్గంలో ప్రజాస్వామిక ఐక్యసంఘటన ప్రభుత్వ ఏర్పాటు చేయటాన్ని లక్ష్యంగా పేర్కొంది. జనతా ప్రజాస్వామిక లక్ష్యాన్ని ఎత్తివేసింది. 1955 నాటికి భారత స్వాతంత్య్రం గురించి 1951 పాలసీని తిరగదోడింది. 1956 ఏప్రిల్ పాల్ఘాట్ మహాసభ భారతదేశం ‘ నూతనంగా స్వాతంత్య్రం, సార్వభౌమత్వం పొందిన దేశం అన్న సూత్రీకరణ చేసింది. జాతీయ ప్రజాస్వామిక సంఘటన, ‘ప్రజల ప్రజాస్వామిక సంఘటన’ అన్న రెండు సూత్రీకరణల ప్రాతిపదికన కేంద్ర కమిటీ రెండు గ్రూపులుగా విడిపోయింది.1958 అమృత్‌సర్ మహాసభ శాంతియుత పద్ధతుల ద్వారా అధికారంలోకి రావచ్చని పేర్కొంది. 1960 విజయవాడలో జరిగిన మహాసభలో రెండు సెక్షన్ల మధ్య విభేదాలు తీవ్రమైనాయి. భారత కమ్యూనిస్టు పార్టీలో జరుగుతున్న అంతర్గత సిద్ధాంత పోరాటానికి, రష్యా, చైనాల మధ్య జరిగిన సిద్ధాంత పోరాట ప్రభావం కూడా పడి 1964లో పార్టీ చీలికకు దారి తీసింది.

సిపిఐ నుంచి విడిపోయిన సిపిఐ(యం) భారత బూర్జువా వర్గాన్ని బడా బూర్జువావర్గంగా, అది సామ్రాజ్యవాదంపై ఆధారపడేదిగా ఉంటుందని చెప్పినప్పటికీ దాని దళారీ స్వభావాన్ని గుర్తించలేదు. బడా బూర్జువా, భూస్వామ్య రాజ్య నియంతృత్వ స్వభావాన్ని గుర్తించ నిరాకరించింది. శాంతియుత పద్ధతుల్లో శ్రామికవర్గ అధికారాన్ని నెలకొల్పటంపై నమ్మకం ప్రకటించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎడల నమ్మకం పెట్టుకుంది. ఐక్యసంఘటన ప్రభుత్వాలను కాపాడుకొనుట ముఖ్యమని భావించింది. ‘ప్రస్తుతాభివృద్ధి దశలో మొత్తం పార్టీ భవిష్యత్తు ఈ మంత్రి వర్గాలను జయప్రదంగా నిర్వహించడంతో సన్నిహితంగా ముడిపడి ఉంది. అలాగే మంత్రివర్గాల్లోని మన పార్టీ పాత్రతో అది ముడిపడి ఉంది. ‘మిశ్రమ ప్రభుత్వాల ద్వారా శాంతియుత విప్లవానికి 8 మంచి అవకాశాలు ఉన్నాయి’ (నూతన పరిస్థితుల్లో- నూతన కర్తవ్యాలు- సిపియం డాక్యుమెంట్ 1967) దీన్ని గమనిస్తే సిపిఐ, సిపియం మధ్య మాటల తేడా తప్ప ఒకే విధానం కలిగి ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, బూర్జువా, భూస్వామ్య పార్టీలతో కలిసి ఐక్యసంఘటన ప్రభుత్వాల ఏర్పాటు వీటి లక్ష్యం. మాటల్లో మార్క్సిజం ఆచరణలో రివిజనిజం ఈ పార్టీల విధానం.

సిపిఐ (యం) నయా రివిజనిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు విప్లవకారులు దేశవ్యాపితంగా సిద్ధాంతపోరాటం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కామ్రేడ్స్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వాన సిపిఐ (యం) నయా రివిజనిజానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు సమీకృతమై అంతరంగిక సిద్ధాంత పోరాటం జరిపి 1968లో సిపియం నుంచి బయటకు రావటం జరిగింది. దేశ వ్యాపితంగా అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్టు విప్లవకారులు సిపియంనుంచి విడగొట్టుకుని ప్రత్యేక నిర్మాణంగా ఏర్పడ్డారు.

CPI

ఈ సందర్భంలోనూ చారుమజుందార్ రూపంలో అతివాదం ముందు కు వచ్చి ఒకే విప్లవ పార్టీ నిర్మాణాన్ని అడ్డుకుంది. నేటికీ ఇది వెంటాడుతూనే ఉంది. కామ్రేడ్ లెనిన్ చెప్పినట్లు దోపిడీ పాలక వర్గాల సంస్కరణల బూటకత్వాన్ని వివరించి ప్రజలను చైతన్యపరిచే కార్యాచరణ కాకుండా సంస్కరణల ఎడల, పాలకుల ఎడల భ్రమలు కల్పిస్తున్నారు. చివరికి 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని సిపిఐ పూర్తిగా సమర్ధించగా, 20 సూత్రాల పథకంలోని 18 పథకాలను సిపియం బలపర్చింది. 1977లో జిజెపి భాగస్వామ్యంగా ఉన్న ఎన్నికల ఫ్రంట్‌లో సిపియం భాగస్వామ్యంగా ఉంది. దేవగౌడ ప్రభుత్వం లో సిపిఐ మంత్రి పదవి చేపట్టగా, సిపియం బయట నుంచి సమర్ధించింది.

తనకు ప్రధాన మంత్రి పదవి చేజారినందుకు జ్యోతిబసు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు బిజెపి వ్యతిరేక కూటమి పేరుతో నితీశ్ కుమార్, తేజస్వియాదవ్, స్టాలిన్, కెసిఆర్, దేవగౌడ మొదలగు బూర్జువా, భూస్వామ్య ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల ఫ్రంటు ఏర్పాటుకు ఆత్రుతపడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో సీట్ల ఒప్పందం చేసుకుంటున్నాయి. చివరికి ఈ రెండు పార్టీలు సోషల్ డెమోక్రాటిక్ పార్టీలు గా మారాయి. సిపిఐ, సిపిఐ (యం) పార్టీలు అనుసరించిన రివిజనిజం, నయా రివిజనిజంవలన వ్యక్తిగత హింసావాదం అమలు జరిపిన కొన్ని విప్లవ గ్రూపులవలన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్‌బరీ, శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాలు తీవ్రనష్టంతో పాటు భారత విప్లవోద్యమం ప్రతిష్టంభనకు గురికావటం, వర్గఉద్యమాల పురోగతి కుంటుపడడం జరిగింది. ఫలితంగా పార్టీ ఎడల ప్రజల విశ్వాసం సన్నగిల్లింది. రివిజనిజం, సంస్కరణ వాదానికి వ్యతిరేక పోరాటం చేస్తూ వర్గ ఉద్యమాల నిర్మాణం చేయటం ద్వారా మాత్రమే తిరిగి పార్టీ ప్రజల విశ్వాసం పొందగలుగుతుంది. అందుకు విడివిడిగా ఉన్న విప్లవ కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే పార్టీగా ఏర్పడాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News