Sunday, April 28, 2024

బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు ఇకలేరు..

- Advertisement -
- Advertisement -

బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు కన్నుమూత

Senior Actor Kondala Rao passes away

హైదరాబాద్: ప్రముఖ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండల రావు (88) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600కి పైగా సినిమాల్లో నటించిన రావికొండల రావు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. రాముడు భీముడు, తేనె మనసులు, అలీబాబా 40 దొంగలు, పెళ్లి పుస్తకం, భైరవ దీపం, మీ శ్రేయోభిలాషి, కింగ్, వరుడు, చంటబ్బాయి, రాధాగోపాలం వంటి అనేక సినిమాల్లో ఆయన నటించారు. రావికొండల రావు భార్య రాధాకుమారి కూడా సినీ నటి. ఆమె ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1932 సంవత్సరం ఫిబ్రవరి 11న జన్మించారు రావికొండల రావు. ఆయనకు చిన్నతనం నుండి నాటకాలంటే ఎంతో ఇష్టం. కథలు కూడా రాసేవారు. ‘బాల’ పత్రికలో రావికొండలరావు కథలు రాసేవారు. ఆ సమయంలోనే ఆ పత్రికలో కథలు రాసే ముళ్లపూడి, బొమ్మలు గీసే బాపుతో ఆయనకు స్నేహం ఏర్పడింది. స్వయంవరం, కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ల చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం తదితర నాటకాలు రాసిన రావికొండలరావు 1956లో ‘బంగారు పాప’ పత్రికను మొదలుపెట్టారు.


చిత్ర పరిశ్రమలోకి…
సినీ జీవితం ప్రారంభంలో రావికొండల రావు… ముళ్లపూడి రమణ ఇంట్లో ఉండేవారు. 1953లో తెలుగులోకి డబ్బింగ్ చేసిన ఓ మలయాళ చిత్రానికి స్క్రిప్ట్ రాసి సినీ రంగంలోకి ప్రవేశించారు ఆయన. ఆతర్వాత 1958లో వచ్చిన ‘శోభ’ చిత్రానికి ఆయన సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో దర్శనమచ్చి నటుడిగా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఇక ముళ్లపూడి రచయితగా చేసిన ‘దాగుడుమూతలు’, ‘ప్రేమించి చూడు’ చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఆయన. సినిమాల్లో నటిస్తూనే పొట్టిప్రసాద్, రాజబాబు, కాకరాల తదితరులతో కలిసి నాటకాలు వేశారు. ఇక 1960లో రాధాకుమారిని పెళ్లి చేసుకున్నారు రావి కొండలరావు. నాటక రంగానికి ఆయన తన భార్య రాధాకుమారితో కలిసి చేసిన సేవ వెలకట్టలేనిది. రాధాకుమారి కూడా నటిగా మెప్పించారు. ఆమె పలు చిత్రాల్లో నటించారు.
రావి కొండలరావు ‘సుకుమార్’ అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు, నాటకాలు కూడా రచించారు.

2004లో ఆయన రచించిన ‘బ్లాక్ అండ్ వైట్’ అనే పుస్తకం తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారానికి ఎంపికైంది. భైరవద్వీపం, బృందావనం, పెళ్లిపుస్తకం, చల్లని నీడ వంటి చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. ‘పెళ్లి పుస్తకం’ చిత్రానికి కథను అందించి స్వర్ణ నంది పురస్కారం పొందారు. పలు తమిళ, మలయాళ చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు రావి కొండలరావు. నిర్మాతగానూ కొన్ని చిత్రాలను రూపొందించారు. బృందావనం, భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం తదితర చిత్రాల నిర్మాణ, రచన బాధ్యతలు చూసుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా ‘బంగారు పంజరం’ చిత్రానికి గాను నంది అవార్డును అందుకున్నారు. సినిమా రచనలే కాకుండా ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల తదితర పత్రికలలో ఆయన రచనలు చేశారు. హాస్య రచయితగా గుర్తింపు పొందారు. రావి కొండలరావు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి ఆయనను గౌరవించింది. ఇక రావి కొండల రావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు, నాటకరంగానికి తీరనిలోటని పలువురు సినీ, నాటక రంగ ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.


సినీ రంగానికి తీరని లోటు…
పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ..“ప్రముఖ నటులు, రచయిత రావి కొండల రావు తుదిశ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. తెలుగు చిత్రసీమకు కొండలరావు అందించిన బహుముఖ సేవలు అజరామం. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు. నాటక రచయితగా, నటుడిగా రంగస్థలానికి, పాత్రికేయుడిగా సినీ జర్నలిజానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి”అని అన్నారు.

Senior Actor Kondala Rao passes away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News