Sunday, April 28, 2024

రాష్ట్ర ‘మహిళా భద్రత’ విభాగం పనితీరు భేష్

- Advertisement -
- Advertisement -
State Women Safety department performance Good
జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ

హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాలను పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖ మహిళా భద్రతా విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల వివాహాలకు సంబందించిన మోసాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు న్యాయ సంబంధిత చట్టాలపై అవగాహనపై శుక్రవారం నాడు బేగంపేట టూరిజం ప్లాజాలో డి.ఐ.జి సుమతి అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేఖాశర్మ మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఢిల్లీల అనంతరం దక్షణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో ఎం.ఆర్.ఐ వివాహ సంబంధిత మోసాల కేసులు అధికంగా ఉన్నాయన్నారు. జాతీయ మహిళా కమీషన్ వద్ద ఎం.ఆర్.ఐ. వివాహాల కు సంబంధించి 5 ,858 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి వివిధ దేశాలకు చెందిన పలు ఏజెన్సీలు, మన దేశంలోని వివిధ సంస్థల సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నందున, పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఈవిధమైన గృహ సంబంధిత నేరాలకు అదుపునకు, మహిళలు ప్రధానంగా వివాహానికి సిద్ధంగా ఉన్న యువతులను చైతన్య పరచడమే మార్గమని రేఖాశర్మ అభిప్రాయం పడ్డారు. ముఖ్యంగా మహిళా కళాశాలల్లో ఎన్. ఆర్.ఐ వివాహాలకు సంబందించిన చట్టాలు, జాగ్రత్తలు, జరిగే మోసాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను పోల్చి చూస్తే తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని అభినందించారు. రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ సునీతా లక్షా రెడ్డి మాట్లాడుతూ ఎన్.ఆర్.ఐ వివాహ మోసాలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమీషన్‌కు 15 ఫిర్యాదులు అందాయని తెలియ చేశారు. పోలీస్ శాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం, లీగల్ సర్వీసెస్ అథారిటీ తదితర సంస్థల సమన్వయంతో మహిళల సమస్యలపై అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డిజి స్వాతి లక్రా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 728 ఎన్.ఆర్.ఐ వివాహాలకు సంబందించిన కేసులు దాఖలయ్యాయని వెల్లడించారు. వీటిలో 678 కేసులు గ్రామీణ పోలీస్ స్టేషన్లలో నమోదయినవే ఉన్నాయని తెలిపారు.

మహిళా భద్రతా విభాగంలో 2019 నుండి 239 కేసులు నమోదు కాగా 42 కేసులను పరిష్కరించామని, మిగిలినవి వివిధ స్థాయిల్లో ఉన్నాయని వివరించారు .ఎన్.ఆర్.ఐ వివాహ మోసాలకు సంబందించిన ప్రతీ కేసు భిన్నంగా ఉంటున్నందున వీటి పరిష్కారానికై భాదితులు ఎంతో ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానంగా అమెరికా,ఆస్ట్రేలియా, బ్రిటన్, సౌదీ అరేబియా, కెనడా దేశాలకు సంబందించిన కేసులే అధికంగా ఉన్నాయని వివరించారు. ఎ.ఆర్.ఐ వివాహాలకు సంబంధించిన కేసు నమోదయితే ఆయా కేసుకు ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించి, వివిధ ఏజెన్సీలు, విదేశీ ఎంబసీలతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు చేపట్టామని అడిషనల్ డిజి వివరించారు. డి.ఐ.జి సుమతి మాట్లాడుతూ, మహిళలకు సంబందించిన పలు సమస్యల పరిష్కారానికై ప్రత్యేకంగా 18 మహిళా పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు.

మహిళలకు సంబంధించి ప్రవాస భారతీయుల మోసాలపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి పోలీస్ శాఖ తోపాటు జాతీయ మహిళా కమీషన్, భారత విదేశీ మంత్రిత్వ శాఖ, హోమ్ మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో పని చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్బంగా తెలంగాణా లో ఎన్.ఆర్.ఐ సెల్ విభాగం పని తీరు అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆవిష్కరించారు. జాతీయ మహిళా కమీషన్, తెలంగాణా పోలీస్ మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ ఎం.వి రమేష్, ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి బాలయ్య,హైదరాబాద్ లోని వివిధ దేశాలకు సంబంధించిన కన్సొలేట్ అధికారులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News