Wednesday, May 8, 2024

మేడారం జాతరలో తెలంగాణ అటవీశాఖ

- Advertisement -
- Advertisement -

 Medaram Jatara

 

హైదరాబాద్: తెలంగాణ మహా జాతర సమ్మక్క- సారలమ్మ జాతరకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరవుతారనే అంచనా ఉంది. ఈ మేడారం జాతర పూర్తిగా ములుగు జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలోనే జరుగుతుంది. దీంతో భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయటంతో పాటు, అటవీ ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగని రీతిలో అటవీ శాఖ పనులు చేస్తోంది. ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, వెంకటాపురం అటవీ డివిజన్లలో జాతరకు వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తులు అటవీ ప్రాంతంలోనే తమ బస ఏర్పాటు చేసుకుంటారు. దీంతో కొత్తగా చెట్లు కొట్టి అడవిని చదును చేయకుండా, ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలలోనే గుడారాలను వేసుకునేలా, పార్కింగ్ ప్రాంతాలను అటవీ శాఖ సూచిస్తోంది.

భక్తులకు అవసరమైన వెదురును అందించేందుకు కూడా అటవీ శాఖ ప్రత్యేకంగా వెదురు అమ్మకం కేంద్రాలను జాతర ప్రాంతంలో ఏర్పాటు చేస్తోంది. ఇక ప్రత్యేక సిబ్బందితో నిరంతర నిఘా పెట్టి అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగకుండా, ఎక్కడపడితే అక్కడ నిప్పు రాజేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. అటవీ జంతువుల వేట, మాంసం సరఫరాపై కూడా అటవీశాఖ నిఘా పెడుతోంది. ఈ సారి జాతరలో పూర్తిగా ప్లాస్టిక్ ను నియంత్రించాలనే ప్రభుత్వ సూచనతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. జాతర జరిగే అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకాన్ని నిషేధించి, వీలైనన్ని క్లాత్ బ్యాగులను అందుబాటులో ఉంచనున్నారు. అటవీ ప్రాంతాల్లో భారీగా చెత్తాచెదారం పోగుపడే అవకాశం ఉండటంతో, వెంటనే సేకరణ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డంప్ యార్డులకు చెత్తను చేరవేసేలా తగిన జాగ్రత్తలను అటవీ శాఖ తీసుకుంటోంది.

కాగా రెండు రోజుల పాటు మేడారంలో పర్యటించిన పిసిసిఎఫ్ ఆర్. శోభ అటవీ శాఖ తరపున జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక అటవీ శాఖ తరపున ప్రత్యేకంగా కొన్ని కౌంటర్లను ఏర్పాటు చేసి వృక్ష ప్రసాదం పేరుతో మొక్కల పంపిణీ కూడా చేయనున్నట్లు వరంగల్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజె అక్బర్ తెలిపారు. మేడారం తరలివచ్చే భక్తులకు అటవీ శాఖ పూర్తిగా సహకరించి ఏర్పాట్లు చేస్తోందని, అదే సమయంలో అడవుల రక్షణ పట్ల ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రదీప్ శెట్టి కోరారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు, ఇతర సరిహద్దు జిల్లాల అటవీ సిబ్బందిని జాతరకు కేటాయిస్తున్నామని, చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు రెస్క్యూ టీమ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా సిబ్బంది డ్యూటీ ప్రదేశాలను గమనిస్తామని, అలాగే సిసి కెమెరాలను ఏర్పాటుచేసి, కంట్రోల్ రూమ్ ల నుంచి అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తామని పిసిసిఎఫ్
వెల్లడించారు.

Telangana Forest Department in Medaram Jatara
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News