Monday, April 29, 2024

8 నుంచి బొమ్మ?

- Advertisement -
- Advertisement -

Theaters Reopen in Telangana from July 8

 

సుముఖంగా ఉన్న రాష్ట్రప్రభుత్వం
సిఎస్‌ను కలసి కోరిన సినీ నిర్మాతలు దిల్‌రాజు, సురేష్‌బాబు, దామోదర్‌ ప్రసాద్, థియేటర్ యజమానులు
100% సామర్థంతో ఓపెన్!

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా కారణంగా మూతపడిన థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సోమవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా సినిమా రంగానికి చెందిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను సైతం గుర్తు చేశారు. ప్రధానంగా రూ.10 కోట్లలోపు నిర్మించే సినిమాలకు జిఎస్‌టి రీయింబర్స్‌మెంట్‌తో పాటు థియేటర్‌లో ప్రదర్శనల సంఖ్య పెంపు, సినిమా టికెట్ ధరల్లో సవరణలు, పార్కింగ్ ఫీజు వసూలు, కనీస విద్యుత్ ఛార్జీల రద్దుపై చర్చించారు. గత సంవత్సరం నుంచి పలుమార్లు థియేటర్లు మూతపడిన కారణంగా సినిమా రంగానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లిందన్నారు.

ఈ నేపథ్యంలో సినిమా రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం పలుమార్లు పేర్కొన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. కాగా సినిమారంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా సిఎస్‌ను కలిసిన వారిలో నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్‌బాబు, దామోదర ప్రసాద్‌తో పాటు పలువురు థియేటర్ యజమానులు కలిశారు. కాగా థియేటర్లను తెరుచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా ఎందుకు ప్రారంభించలేదని ఈ సందర్భంగా సిఎస్ ప్రశ్నించారు. అయితే ఎపిలో థియేటర్లు తెరిస్తే తప్ప సినిమాలు విడుదల సాధ్యంకాదని నిర్మాతలు చెప్పినట్లుగా సమాచారం. అన్ని విషయాలను సిఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి సిఎస్ హామి ఇచ్చారని తెలుస్తోంది.

100 శాతం సామర్థంతో ఓపెన్
గత రెండున్నర నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను ఈ నెల 8 నుంచి పునఃప్రారంభించాలని యాజమాన్యాలు భావిస్తున్నా యి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం సీట్ల సామర్థ్యం లో థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో 100శాతం సామర్ధంతో థియేటర్లను తెరవాలన్న నిర్ణయానికి యాజమాన్యాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కొత్త సినిమాల విడుదలపై నిర్మాతలు పునరాలోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలకు ఒటిపిలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. పైగా గతంలోనూ వకీల్‌సాబ్ విడుదల చేసినా నిర్మాతలు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోయారు. సినిమా విడుదలైన నాలుగు రోజులకే కరో నా రెండోదశ ముప్పు రావడంతో థియేటర్లు మూతపడ్డాయి. ఫలితంగా నిర్మాతలకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు మూడో ముప్పు రాబోతుందన్న ఊహాగానాలు నిర్మాతలను మళ్లీ ఆలోచనలో పడేశాయి.

Theaters Reopen in Telangana from July 8?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News