Sunday, April 28, 2024

తబ్లీఘీ: లౌకికవాదుల తప్పులు

- Advertisement -
- Advertisement -

tabligi

 

ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీఘీ జమాఅత్ సమావేశం వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లిన నష్టం మన ముందుకు వచ్చింది. ఈ విషయంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హిందూత్వ శక్తులు కరోనాను కూడా హిందూ ముస్లిం సమస్యగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు తీవ్రంగా ఖండించదగ్గవి. జాతీయ స్థాయి టివి చానళ్ళలో యాంకర్లు కూడా ఇదే భాష వాడడం సిగ్గుచేటు. బయో జీహాద్ వంటి పదాలు యాంకర్లు నిర్లజ్జగా అనుమతిస్తున్నారు. నిజాముద్దీన్ తబ్లీఘీ జమాఅత్ సమావేశంలో పాల్గొన్న వారు హిందువులపై విషప్రయోగం చేయడానికే వెళ్ళారన్నట్లు టివి డిబేట్లలో కొందరు వాదిస్తుంటే యాంకర్లు ఆ వాదనలను వింటున్నారు.

నిజానికి ఢిల్లీ మర్కజ్ సమావేశం వల్ల కరోనా సోకిన వారిలో దాదాపు అందరూ ముస్లింలే. అంటే ఇది హిందువులపై జీహాద్ కాదు, నిజానికి ఇది ముస్లింల ప్రాణాలనే ప్రమాదంలో పడవేసిన సంఘటన. గమనించవలసిన మరో వాస్తవమేమంటే, ఈ సంఘటనకు సంబంధించి పాలనా యంత్రాంగం, వివిధ అధికారులు అందరి బాధ్యత ఉంది. తమ బాధ్యత నుంచి చేతులు దులుపుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. వీసాలను జారీ చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మర్కజ్‌కు చాలా దగ్గరగా పోలీసు స్టేషను ఉంది. పక్కనే మర్కజ్ భవనం ఉన్నప్పటికీ ఢిల్లీ పోలీసులు అక్కడి కార్యకలాపాలను తగిన సమయంలో గుర్తించి, మర్కజ్ భవనాన్ని ఖాళీ చేయించడంలో విఫలమయ్యారు. పోలీసులు ఒక విడియో విడుదల చేశారు. మర్కజ్ లోని పెద్దలతో ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ భవనాన్ని ఖాళీ చేయాలని చెబుతున్న విడియో. అంటే పోలీసులకు ఇక్కడి పరిస్థితి గురించి ముందే తెలుసు. పోలీసుల హెచ్చరికలను తబ్లీగ్ జమాఅత్ నాయకత్వం నిర్లక్ష్యం చేసిన తర్వాత పోలీసులు తీసుకున్న చర్య లేమిటి?

పోలీసుల విడియోలో ఢిల్లీ పాలనా యంత్రాంగానికి సంబంధించి స్పష్టమైన రిఫరెన్సులు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. బాధ్యత ఎవరిది అని ఆరోపణలు చేసే సమయం కాదిది. కాని, చాలా మందికి ఈ సంఘటనలో బాధ్యత ఉందన్నది కాదనలేని వాస్తవం. అదే విధంగా జమాఅత్ తబ్లీఘీ నాయకులు కూడా చాలా బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారన్నది కాదనలేని వాస్తవం. అక్కడి వారు భవనంలోనే ఉండేలా ప్రోత్సహించడం, ఆరోగ్యపరమైన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం కనిపిస్తోంది.

ఇప్పుడు బయటకు వచ్చిన విడియో, ఆడియో టేపుల వల్ల తెలుస్తున్నదేమంటే, తబ్లీఘీ జమాఅత్ పెద్దలు వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. “వైరస్ ఉంది, నిజమే, కాని 70 వేల దేవదూతలు నాతో ఉన్నారు. వాళ్ళు నన్ను కాపాడలేకపోతే మరెవరు కాపాడతారు? ఇలాంటి సమావేశాలు నిర్వహించవలసిన సమయం ఇది” అనే వైఖరి కనబరిచారు. ఒక టేపులో మౌలానా సాద్ గొంతుగా చాలా మంది భావిస్తున్న గొంతు ఈ మాటలు చెప్పడం వినబడుతోంది. “ముస్లింల మధ్య సమైక్యతను ధ్వంసం చేసే పథకమిది. ఒకరి నుంచి మరొకరిని దూరం చేసే పథకమిది” అని ఆ గొంతు చెబుతోంది.

ఈ టేపులు స్టింగ్ ఆపరేషనులో బయటపడ్డ టేపులు కావు. స్వయంగా తబ్లీఘీ జమాఅత్ యూ ట్యూబ్ చానల్‌లో పెట్టిన టేపులు. సోషల్ డిస్టెన్సింగ్ లేదా సామాజిక దూరం అనేది ముస్లింలకు వ్యతిరేకంగా ఒక కుట్రగా ఈ టేపుల్లో పేర్కొన్నారన్నది కూడా ఒక వాస్తవం. కరోనా వైరస్‌తో పోరాటం కొనసాగుతున్నప్పుడు, లక్షలాది మంది భారతీయులు కరోనా వ్యతిరేక పోరాటంలో అనేక త్యాగాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ధోరణి నేర ధోరణి మాత్రమే కాదు, ఇది హత్యా ప్రయత్నంతో సమానం అంటే తప్పులేదు. ఇదంతా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక ఈ విషయంలో సమస్య ఏముంది?

కాని, సెక్యులర్ శక్తులు కొన్ని ఈ సంఘటనకు సంబంధించి రక్షణాత్మక వైఖరి అవలంబిస్తున్నాయి. హిందువైనా, ముస్లిమైనా, సెక్యులర్ అయినా, మతతత్వవాది అయినా ఎవరైనా సరే, జమాఅత్ ప్రదర్శించిన ఛాందస మనస్తత్వాన్ని ఆమోదించడం కష్టమని నేను భావిస్తున్నాను. తబ్లీఘీ జమాఅత్ ఇస్లాంను కొన్ని శతాబ్దాలు వెనక్కు తీసుకెళ్ళడం ద్వారా తన ఉద్దేశాలు సాధించుకోడానికి పని చేస్తున్న సంస్థ.

హిందూ మతతత్వవాదులు చెప్పే ప్రతి మాటను వ్యతిరేకించాలనే మనస్తత్వంతో చాలా మంది లౌకికవాదులు పని చేస్తున్నారు. తబ్లీఘీ సమావేశం సంఘటనను ఉపయోగించుకుని హిందూత్వ తీవ్రవాదులు ముస్లింలపై దాడులు చేయడానికి, జీహాద్ వంటి పదాలు ఉపయోగించి ముస్లింలందరిపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్న వాతావరణంలో హిందూత్వ శక్తుల ఈ చర్యలకు జవాబుగా తబ్లీఘీ జమాఅత్‌ను సమర్ధించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఒక శోచనీయమైన పరిస్థితి ఇప్పుడు తలెత్తింది. జమాఅత్‌ను సమర్థించడానికి అనేక రకాలుగా ప్రయత్నించడం కనిపిస్తోంది.

మొదట వినిపించిన వాదన, పోలీసులు ఏం చేస్తున్నారనేది. ఈ సమావేశాన్ని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదనే వాదన ముందుకు వచ్చింది. నిజానికి ఇంటెలిజెన్స్ బ్యూరో తబ్లీఘీ జమాఅత్ పై ఒక కన్నేసి ఉంచుతుంది. తబ్లీఘీ కార్యక్రమానికి వచ్చిన విదేశీయులు దేశంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తుంటే ఐబి చూస్తూ ఊరుకోవడాన్ని చాలా మంది ప్రశ్నించారు. ఇవి నిస్సందేహంగా అడగవలసిన ప్రశ్నలే. కాని ఈ ప్రశ్నలు అడిగినంత మాత్రాన తబ్లీఘీ జమాఅత్ చేసిన పని సమర్థించదగిందిగా మారదు. ఒక అసమర్థ పోలీసు అధికారి పట్టుకోలేకపోయినంత మాత్రాన ఒక హంతకుడి నేరం తక్కువ అయిపోదు కదా. ఈ సంఘటనలో అనేక మంది అనేక తప్పులు చేశారు. తప్పులు చేసిన వారిలో జమాఅత్ కూడా ఒకటని చెప్పడం కూడా సరయిన వాదన కాదు. జర్మనీలో హిట్లర్ హోలోకాస్ట్ చేయించాడు. నిజానికి ప్రపంచం అతడిని ఆపలేకపోవడం వల్లనే హోలోకాస్ట్ జరిగింది. కాబట్టి అందరిపై బాధ్యత ఉందని వాదించినట్లు అవుతుంది.

ఈ వాదన అంత బలంగా లేదన్నది లౌకికవాదులు కూడా గుర్తించారు. అయితే ఆ తర్వాత మతతత్వవాదులు ఎక్కువగా ఉపయోగించే పద్ధతిని లౌకికవాదులు ఉపయోగిస్తూ, “మీరేం చేశారు” అనే వాదన తీసుకువచ్చారు. అంటే తబ్లీఘీ సమావేశం తప్పయితే, పార్లమెంటు కూడా సమావేశం అయ్యింది కదా అప్పుడు సామాజిక దూరం ఎందుకు పాటించలేదు, భోపాల్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ విజయోత్సవాల సంగతేమిటి? కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ అక్కడ బిజెపి నేతలు ఒకరినొకరు కౌగిలించుకుని పండగ చేసుకున్నారు కదా, ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ రామ నవమి సంబరాలు జరుపుకోలేదా? వాటి సంగతేమిటి? లాక్‌డౌన్ తర్వాత అనేక మంది వలస కార్మికులు పట్టణాలు వదిలి గుంపులు గుంపులుగా సొంతూళ్ళకు బయలుదేరారు. అక్కడ సామాజిక దూరాలు లేవు కదా.. ఇలాంటి వాదనలు ముందుకు వచ్చాయి.

ఈ సంఘటనలన్నీ నిస్సందేహంగా తప్పే. ఈ సంఘటనలను చాలా మంది విమర్శించారు కూడా. అలాగే ఒక తప్పును మరో తప్పు ఒప్పుగా మార్చేయలేదు. 1984లో ఢిల్లీలో సిక్కులపై హింసాకాండ జరిగింది. ఆ హింసాకాండ జరగలేదా అని వాదించడం వల్ల 2020 ఢిల్లీ హింసాకాండను ఎవరు సమర్థించలేరు. అది తప్పే, ఇది తప్పే. కాబట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బిజెపి నేతలు సామాజిక దూరాన్ని నిర్లక్ష్యం చేసి ఆలింగనాలతో ఉత్సవాలు జరుపుకోవడం తప్పే. ఈ తప్పును చూపించడం వల్ల తబీఘీ జమాఅత్ సామాజిక దూరం పాటించడంలో చూపించిన నిర్లక్ష్యాన్ని తక్కువ చేయలేం.

లౌకికవాదులు చేస్తున్న తప్పేమిటంటే, సమర్థించడం కుదరని సందర్భాల్లో కూడా సమర్థింపులకు దిగడం ద్వారా మతతత్వవాదుల దుర్మార్గం నుంచి ముస్లింలను కాపాడడానికి ప్రయత్నించడం. కాని ఈ ప్రయత్నాల్లో భారత లౌకిక వాదాన్ని మనం దెబ్బ తీస్తున్నాం. నైతికతకు, కామన్ సెన్స్‌కు విరుద్ధంగా ఏ కారణం వల్లనైనా గాని లౌకికవాదులు వైఖరి తీసుకున్న ప్రతిసారి భారత ఉదారవాద స్వభావాన్ని దెబ్బ తీస్తున్నారు. నిజమే, మతతత్వవాదులు హిందూ, ముస్లిం విద్వేష రెచ్చగొడుతున్నారు. కాని మనం ఇలాంటి వలలోనే జారిపోవడం మంచిది కాదు.

అనుచిత, నేర వైఖరి ఎక్కడ ఉన్నా దాన్ని ఖచ్చితంగా ఖండించవలసిందే. ఒక మతానికి చెందిన వారు కాబట్టి సమర్థించడం ప్రారంభిస్తే, మనం కూడా మతతత్వవాదుల స్థాయికి పడిపోతామన్నది మరిచిపోరాదు. అసలు ఈ సంఘటనకు మతానికి సంబంధం లేదని కొందరంటున్నారు. కాని ఇది నిజం కాదు. తబ్లీఘీ సమావేశం ధార్మిక సమావేశం. 70 వేలమంది దైవ దూతలు కాపాడతారని వారికి అక్కడ చెప్పడం జరిగిందన్నది కూడా మరిచిపోరాదు. లౌకిక వాదమంటే ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కాపాడ్డం అని అర్థం కాదు. వారేం చేసినా సరే కాపాడ్డం అని అర్థం కాదు. మతతత్వవాదులందరితోనూ పోరాడ్డమే లౌకికవాదం. తబ్లీఘీ జమాఅత్ సమావేశం కరోనా వ్యాపించడానికి కారణమైందన్నది ఇక్కడ సమస్య కాదు.

మతం పేరుతో జరిగిన సమావేశం కరోనా వ్యాపించడానికి కారణమవ్వడం వల్ల హిందూత్వ మతతత్వ వాదులకు అవకాశం ఇచ్చింది. ముస్లిం లు మతవాదులు, భారత చట్టాలను వాళ్ళు గౌరవించరు అనే విష ప్రచారం చేసే అవకాశం వారికి లభించింది. ఇదంతా నాన్సెన్స్ అనేది నిజమే. ఒక హిందువు ఎంత చట్టాలను గౌరవిస్తాడో ఒక ముస్లిం కూడా అంతే చట్టాలను గౌరవిస్తాడు. ఒక హిందువుకు ఎంత దేశ ప్రేమ ఉంటుందో, ఒక ముస్లింకు కూడా అంతే దేశ ప్రేమ ఉంటుంది. అందువల్లనే చాలా మంది ముస్లిం ప్రముఖులు తబ్లీఘీ జమాఅత్ వైఖరిని ఖండించారు. కాని లౌకికవాదులు ఈ వాస్తవాలను మరిచిపోయి వ్యవహరిస్తున్నారు. భారతదేశం పురోగమించాలంటే మనమంతా కలిసి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. హిందూ మతోన్మాదమైనా, ముస్లిం మతతత్వమైనా ఏదైనా సరే.

 

To make the corona Hindu Muslim issue
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News