Friday, May 17, 2024

సమరోత్సాహంతో గబ్బర్ సేన

- Advertisement -
- Advertisement -

Today India Sri Lanka first ODI match

నేడు శ్రీలంకతో తొలి వన్డే

కొలంబో: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ జట్టు సిద్ధమైంది. సీనియర్లు లేకుండానే శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరుగనుంది. భారత సీనియర్ జట్టు టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో ఉంది. ఇదే సమయంలో శ్రీలంకతో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఆడనుంది. కీలక ఆటగాళ్లు లేకుండానే శిఖర్ ధావన్ సారథ్యంలో యువ భారత జట్టు లంకతో పోరాటానికి రెడీ అయ్యింది. పూర్తి కొత్త ముఖాలతో కళకళాడుతున్న టీమిండియా సిరీస్ విజయమే లక్షంగా బరిలోకి దిగనుంది.

మరోవైపు శ్రీలంక కూడా దాదాపు కొత్త ఆటగాళ్లతో తలపడనుంది. ఆ జట్టులోని చాలా మంది కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా లంకకు చెందిన పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. దీంతో భారత్‌తో జరిగే సిరీస్‌లో వారు బరిలోకి దిగడం లేదు. దీంతో భారత్‌తో పోరుకు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును లంక బోర్డు ఎంపిక చేసింది. రెండు జట్లలోనూ యువ ఆటగాళ్లే ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పాలి.

ధావన్‌పైనే భారం..

ఇక సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్ శిఖర్ ధావన్ కీలకంగా మారాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై పడింది. ఓపెనర్‌గా బరిలో దిగనున్న ధావన్ జట్టుకు శుభారంభం అందించాల్సిన ఉంది. పృథ్వీషాతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక దేశవాళి క్రికెట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయిన పృథ్వీషా ఈ సిరీస్‌లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రానున్న రోజుల్లో టీమిండియాలో స్థానాన్ని పదిలం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. ధావన్ కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. సిరీస్‌లో వీరిద్దరూ జట్టుకు చాలా కీలకమని చెప్పాలి. ఇక మనీష్ పాండే, హార్దిక్ పాండ్యలు కూడా మెరుగైన ఆటను కనబరచక తప్పదు. సీనియర్లు లేని సమయంలో వీరి బాధ్యత మరింత పెరిగింది. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా రానున్న ప్రపంచకప్‌లో జట్టులో స్థానాన్ని దక్కించుకోవాలని మనీష్ పాండే భావిస్తున్నాడు.

కుర్రాళ్ల సత్తాకు పరీక్ష

ఇదిలావుంటే యువ ఆటగాళ్ల సత్తాకు ఈ సిరీస్ పరీక్షలాంటిదేనని చెప్పాలి. అందివచ్చిన అవకాశాన్ని వారు ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాల్సిందే. సూర్యకుమార్ యాదవ్, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, దేవ్‌దుత్ పడిక్కల్, సంజు శాంసన్ తదితరులు కూడా ఛాన్స్ దొరికితే చెలరేగి పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సూర్యకుమార్, నితీష్ రాణాలకు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్, సంజుల మధ్య పోటీ నెలకొంది. ఆల్‌రౌండర్ల కోటాలో కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్, వరుణ్ చక్రవర్తిలలో ఎవరికీ స్థానం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. స్పిన్నర్ల విభాగంలో రాహుల్ చాహర్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇదిలావుండగా ఐపిఎల్‌లో అసాధారణ రీతిలో రాణించిన చాలా మంది యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ఓ సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు.

కొత్త ఆటగాళ్లతో..

మరోవైపు ఆతిథ్య శ్రీలంక కూడా కొత్త ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. కెప్టెన్ కుశాల్ పెరీరా గాయం వల్ల సిరీస్‌కు దూరమయ్యాడు. అతను లేకుండానే లంక సిరీస్‌కు సిద్ధమైంది. సీనియర్ ఆటగాళ్లు డిక్వెల్లా, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా తదితరులు కూడా అందుబాటులో లేరు. దీంతో లంక చాలా మంది యువ ఆటగాళ్లకు లంక జట్టులో చోటు దక్కింది. ఇక అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో యువ ఆటగాళ్లు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News