Monday, April 29, 2024

నేడు కేబినెట్ కీలక భేటీ

- Advertisement -
- Advertisement -
Today is a key meeting of the Cabinet
kcr

 

మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్
అధ్యక్షతన సమావేశం n లాక్‌డౌన్ పొడిగింపు,
ఆంక్షల సడలింపులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై
మద్యం విక్రయాలపై కీలక నిర్ణయాలు?
సమగ్ర వ్యవసాయ విధానంపైనా చర్చకు చాన్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ వివిధ అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులపై చర్చించనున్నారు. అలాగే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు చేస్తారు. రాష్ట్రానికి నూతన సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల, మద్యం విక్రయాలు, గ్రీన్ జోన్ల పరిధిలో పరిశ్రమలు అనుమతులతో సహా ఇతర అంశాలు చర్చకు రానున్నాయి.

అలాగే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, తీవ్రతపై కూడా సిఎం కెసిఆర్ సమీక్షించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ నెల 7 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండగా కేంద్రం ఈ నెల 17 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో కూడా మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ ను పొడిగించే దిశలో సిఎం కెసిఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. నేటి మంత్రివర్గ సమావేశంలో దీనిపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేసుల తీవ్రత శాతం తగ్గినప్పటికీ జిహెచ్‌ఎంసి పరిధిలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసుకొని సిఎం కెసిఆర్ తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఆర్థిక కార్యకలాపాలపై
ఆర్ధిక కార్యకలాపాలు సజావుగా సాగేందుకు కేంద్రం కరోనా కేసుల తీవ్రత ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. ఇందుకు కేంద్రం పలు సడలింపులు కూడా ఇచ్చింది. కేంద్రం నిర్ణయంతో పొరుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రాష్ట్రానికి చెందిన పలువురు మద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలన్న విషయంపై మంత్రివర్గం పూర్తి స్థాయిలో చర్చించనుంది. పట్టణ ప్రాంతాల్లోనూ నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది.

మిగతా సడలింపులకు సంబంధించి కూడా ఏం చేయాలన్న విషయమై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. కేసులు లేని జిల్లాలు, తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలతో పాటు కేసులు అధికంగా ఉన్న జిహెచ్‌ఎంసి సహా ఇతర ప్రాంతాల్లో ఎటువంటి వ్యూహం అనుసరించాలనేది కేబినెట్‌లో చర్చించి నిర్ణయించనున్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నిపుణులతో విస్తృతంగా చర్చిస్తున్న సీఎం.. వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పర్యవసనాలను అంచనా వేస్తున్నారు.

సమగ్ర వ్యవసాయ విధానం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లు సహా వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రానికి నూతన సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించిన సిఎం కెసిఆర్ అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి సత్వర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల సహా ఇతర అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్‌లో డిమాండ్ కలిగిన పంటలను సాగు చేసేందుకు రైతులను అవసరమైన సూచనలు, సలహాలపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించనుంది.

గతంలో తెలంగాణ ప్రాజెక్టులు, కరెంటు సరిగా లేకపోవడం వల్ల సాగునీటి లభ్యంత అంతగా లేకపోవడం, అప్పటి ప్రభుత్వాలు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల రైతులు పడిన అగచాట్లు భవిష్యత్తులో లేకుండా చూసేందుకు అవసరమైన నిర్ధిష్టమైన విధానాల రూపకల్పన కూడా చర్చిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంటల సాగు ఎక్కువ కావడంతో ధాన్యానికి సరపడా గోధాముల నిర్మాణం కూడా చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

 

Today is a key meeting of the Cabinet
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News