Sunday, April 28, 2024

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

Today Telangana state cabinet meeting

 

అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన
తీర్మానాలపై చర్చ, ఆమోదం
13న శాసనసభ, 14న
శాసన మండలి సమావేశం
పంటల కొనుగోలు,
యాసంగిలో సాగు విధానంపై
నేడు ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట మంత్రివర్గ సమావేశం శనివారం జరగనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. మంత్రివర్గం ఆమోదం పొందిన తరువాత వాటిని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెడతారు. దీని కోసం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 13న ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ, 14న ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. 13న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులను, 14న మండలిలో ప్రవేశ పెడతారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే అసెంబ్లీని సమావేశ పర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనుంది. అలాగే యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ సమావేశాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో పలు సవరణలు చేయనుంది. ఈ చట్టంలోని సెక్షన్ 21 (బి)లో సవరణలను ప్రతిపాదించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను ఈ ఎన్నికల్లోనూ కొనసాగించేలా అవసరమైన సవరణలను ప్రభుత్వం చేయనున్నట్టుగా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు 2016లోని రిజర్వేషన్లను కొనసాగించాలంటే జిహెచ్‌ఎంసి చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడింది.

తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లో ఈ అంశం ఉన్నప్పటికీ జిహెచ్‌ఎంసికి వర్తించదని, చట్ట సవరణతో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోతాయన్న భావనతో ప్రభుత్వం ఉంది. అలాగే రిజర్వేషన్లు రెండు పర్యాయాలు వర్తించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని యోచించినా ఇతర చట్టాల సవరణ నేపథ్యంలో ఆర్డినెన్స్‌ల కంటే శాసనసభ సమావేశం మేలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా సమాచారం. గతంలో జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీలను రద్దు చేయాలని ప్రభుత్వం భావించినా ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టంలో సదరు ప్రతిపాదనలను చేర్చింది. అయితే సిఎం కెసిఆర్ పలువురు చట్ట నిపుణుల సూచన మేరకు పునరాలోచన చేసినట్టుగా తెలిసింది. దీంతో కార్పొరేషన్‌లలో స్టాండింగ్ కమిటీలను కొనసాగించేలా చట్ట సవరణ చేయనున్నట్టుగా తెలిసింది. మతపరమైన నిర్మాణాల అంశంతో పాటు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అక్రమాలు చేసిన నేపథ్యంలో వారిని తొలగించేలా తాజా సవరణలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. కాగా కొత్త మున్సిపల్ చట్టంలో వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్నా అర్హులని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ అంశం ప్రస్తుతం జిహెచ్‌ఎంసి చట్టంలో లేకపోవడంతో చట్ట సవరణ అనివార్యమయింది.

వాస్తవానికి గత నెల 7 నుంచి 16వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. విఆర్‌వో వ్యవస్థతో పాటు రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భూముల రిజిస్ట్రేషన్ సరళతరం చేసేందుకు కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి పోర్టల్‌ను తీసుకొస్తున్నామని, 99.9 శాతం భూముల సమస్యలకు అదే పరిష్కారం చూపిస్తుందని వెల్లడించింది. అయితే వాస్తవానికి ణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 28 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో 16 వరకే పరిమితం చేశారు. ప్రజాప్రతినిధుల ఆరోగ్యం దృష్ట్యా 12 రోజులు ముందే సమావేశాలను ముగించారు. కాగా డిసెంబర్ చివరివారంలో హైదరాబాద్‌లో జిహెచ్‌ఎంసి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఒకవేళ షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ కారణగా చట్టాలు చేయడానికి వీలు కాదు. ఈ క్రమంలో ఆ లోపే పలు కీలకమైన చట్టాలను ఆమోదింపజేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తోంది.

నిర్ణిత పంటల సాగు, పంటల కొనుగులు కేంద్రాలపై సిఎం సమీక్ష

యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు ప్రగతిభవన్‌లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అయ్యే సమావేశంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు.

ఈ సమావేశంలో ప్రధానంగా యాసంగిలో రైతులు ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే అధిక లాభం కలుగుతుంది? ఏ పంట వేస్తే నష్టం వాటిల్లుతుంది? తదితర అంశాలపై సిఎం సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నది. దీని వల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై నేడు జరిగే సమావేశంలో ఈ విషయంపై కూడా విస్త్రతంగా చర్చ జరుగనుంది. కరోనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తలను కోనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో కూలంకశంగా సమీక్షిస్తారు.

కాగా రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించడం జరిగింది. అందువల్ల ప్రస్తుత వర్షాకాలం పంటలను కూడా గ్రామాల్లోనే సుమారు ఆరువేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశంపై కూడా చర్చిస్తారు. అలాగే పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించడంతో పాటు ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేయాలని అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News