Monday, April 29, 2024

ఆపన్న హస్తాలు

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ పిలుపుకు అనూహ్య స్పందన
భారీగా విరాళాలు ప్రకటిస్తున్న వివిధ రాష్ట్రాల సిఎంలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు
రూ.15 కోట్ల విరాళాన్ని ప్రకటింటిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
రూ.2 కోట్లను ప్రకటింటిన పశ్చిమ బెంగాల్ సిఎం మమతా
అపర్ణ కన్‌స్ట్రక్షన్ సంస్థ రు.6 కోట్లు, మైహోమ్ సంస్థ రూ.5 కోట్ల విరాళం

Tollywood Stars Donate to CMRF for flood victims in Hyd

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీవర్షాలకు వరద ముంపుకు గురైన ప్రజలను ఆదుకు నేందుకు పెద్దఎత్తున దాతలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పిలుపుకు అనూహ్య స్పందన లభి స్తోంది. వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. ప్రధానంగా వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు, తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు హీరోలు, వ్యాపారవేత్తలు, పలువురు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి (సిఎంఆర్‌ఎఫ్)కు భారీగా విరాళాలను అందజేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఇప్పటికే రాష్ట్రానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అదనంగా దుప్పట్లు, బ్లాంకెట్లు, మందులు కూడా పంపనున్నట్లు సిఎం కెసిఆర్ రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పళనిస్వామి ఉదారతపై సిఎం కెసిఆర్ స్పందించి ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసిన విషయం తెలిసిందే.

కాగా, మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునరావాస కార్యక్రమాల కోసం తమ రాష్ట్రం తరుపున ఈ సాయాన్ని అందజేస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా రూ.15 కోట్ల సాయం ప్రకంటించిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు తెలంగాణ ప్రజల తరపున సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేజ్రీవాల్‌కు సిఎం కెసిఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఎంతో ఉదారత చాటుకుని తమ రాష్ట్రానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం స్పందించి రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటిస్తూ సిఎం కెసిఆర్‌కు ఒక లేఖ రాశారు. భారీ వర్షాలకు తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి తాను చలించినట్లు ఆమె పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగడం విచారకరమన్నారు. ఇలాంటి విపత్కార సమయంలో ప్రతి ఒక్కరూ మానవతా ధృక్పథంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించిన మై హోమ్
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పిలుపుకు స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా మై హోమ్ సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. నగర ప్రజలకు ఎలాంటి విపత్తు వచ్చినా ప్రభుత్వంతో కలిసి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ సంస్థ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు తెలిపారు.

రూ.6కోట్ల విరాళాన్ని ప్రకటించిన అపర్ణ గ్రూప్
రాష్ట్రంలో ఊహించని రీతిలో కొనసాగుతున్న వరదల స్థితి నుంచి బయడపడేందుకు తగు సహకారం అందించడానికి వ్యాపార సంస్థలు ముందుకు రావాల్సిందిగా సిఎం కెసిఆర్ పిలుపుకు అపర్ణ కన్‌స్ట్రక్షన్, ఎస్టేట్ ప్రైవేటు సంస్థ కూడా స్పందించింది. తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.6 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రెడ్డి మాట్లాడుతూ, సమాజ సంక్షేమానికి వీలైనంత తోడ్పాటు అందించడానికి తాము ఎప్పుడు ముందుంటామన్నారు. ప్రస్తుత విపత్త నుంచి బయడపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలకు తమ సంస్థ పక్షాన సంపూర్ణ మద్ధతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అపర్ణ గ్రూప్ గత కొద్ది సంవత్సరాలుగా సామాజిక, సంక్షేమ, ఆరోగ్య సంరక్షణ తదితర కార్యక్రమాల్లో పెద్దఎత్తున భాగస్వామ్యం అవుతోందన్నారు. ప్రధానంగా అపర్ణ నోవెల్ సోసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ద్వారా అపర్ణ కంపెనీ పలు కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వీటి ద్వారా పేద వర్గాల చిన్నారులతో పాటుగా వయోవృద్ధుల జీవిత నాణ్యతను వృద్ధి చేయడం లక్షంగా పనిచేస్తున్నామని తెలిపారు.

సినీ ప్రముఖుల విరాళాలు
వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, దర్శక, నిర్మాతలు ముందుకు వచ్చి విరాళాలను ప్రకటించారు. వారిలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌లు స్పందించి ఒక్కొక్కరు కోటి రూపాయల చొప్పన సిఎంఆర్‌ఎఫ్‌కు విరాళంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌లు రూ.50 లక్షల చొప్పున, విజయ దేవరకొండ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారికా హాసిని క్రియేషన్స్ రూ.10 లక్షల చొప్పున, బండ్ల గణేష్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్‌లు రూ. 5 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు.

ధన్యవాదాలు తెలిపిన సిఎం కెసిఆర్
వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చి పెద్దఎత్తున విరాళాలను ప్రకటించిన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రులకు సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తేలిపారు. వారితో సిఎం కెసిఆర్ ఫోన్‌లో మాట్లాడుతూ.. తమ రాష్టానికి సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మైహోమ్ సంస్థ అధినేతకు, అపర్ణ గ్రూప్ సంస్థతో పాటు సినిమా రంగం నుంచి విరాళాలు ప్రకటించిన వారందరికి కూడా సిఎం కెసిఆర్ అభినందనలు తెలిపారు.

Tollywood Stars Donate to CMRF for flood victims in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News