Monday, April 29, 2024

అమెరికాకు తిరిగి మంచిరోజులు

- Advertisement -
- Advertisement -

Trump

దెబ్బతిన్న రాష్ట్రాల రీఓపెన్ ప్లాన్
దేశాధ్యక్షులు ట్రంప్ వెల్లడి
వెంటాడే గాయాలతోనే ముందుకు
వాషింగ్టన్: అమెరికాకు మరింతగా తిరిగి మంచిరోజులు వస్తున్నాయని దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా తీవ్రత తగ్గుతోందని ఆయన పరోక్షంగా తెలిపారు. షట్‌డౌన్ ఎత్తివేసి, తిరిగి మార్కెట్లను ప్రారంభించేందుకు వీలుగా పలు రాష్ట్రాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయని ట్రంప్ తెలిపారు. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాలలో 35 రాష్ట్రాలలో కరోనా ప్రభావం పడింది. ఆ రాష్ట్రాలన్ని ఇప్పుడు రీఓపెన్ ప్లాన్స్‌ను సూత్రప్రాయంగా సిద్ధం చేసుకున్నాయని ఇది మంచి పరిణామం అని ట్రంప్ తెలిపారు. కన్పించని శత్రువుతో బాగా దెబ్బతిన్న దేశం కోలుకుని, తిరిగి పుంజకుంటుందని, త్వరలోనే దేశానికి భలే మంచిరోజులు తిరిగి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారం నాటికి కరోనా వైరస్‌తో దేశంలో మృతుల సంఖ్య 61000కు చేరింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలోనే పది లక్షల మందికి పైగా ప్రజలకు వైరస్ సోకింది. మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేద్దామని , పొంచి ఉండి దెబ్బతీసి, ఎందరినో బలిగొన్న శత్రువు మిగిల్చిన గాయాలు, మనకు చేదు అనుభవంగానే మారుతాయని ట్రంప్ తెలిపారు. కష్టాలు నష్టాలు మనకు ఎప్పుడూ గుర్తుండిపోతాయని అన్నారు. బుధవారం ప్రెసిడెంట్ ట్రంప్ పారిశ్రామికవేత్తలతో ఓపెనింగ్ అప్ అమెరికా అగైన్ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశంలో అత్యధిక పరిశ్రమలు మూతపడ్డాయి. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపొయ్యాయి. 33 కోట్ల మంది దేశ జనాభాలో 95శాతానికి పైగా జనం ఇండ్లలోనే ఉండిపోవాలనే ఆదేశాలను పాటిస్తున్నారు. షట్‌డౌన్, లాక్‌డౌన్‌లతో, కట్టడిలోకి రాని వైరస్ భయాల మధ్యనే ట్రంప్ పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు స్తంభించింది. ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో 4.8 శాతం తిరోగమన సూచీ నమోదు చేసుకుంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితి చివరి దశలో తిరిగి పుంజుకుంటుందని ట్రంప్ పారిశ్రామికవేత్తలకు తెలిపారు. పలు రాష్ట్రాలు త్వరలోనే తిరిగి యధావిధిగా తమ ప్రాంతాలలో ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభిస్తాయని, దీనికి సంబంధించిన వివరాలను తాను పరిశీలిస్తున్నానని, మంచి పరిణామంతో మనం ముందుకు వెళ్లవచ్చునని తెలిపారు.
అమెరికాలో విమాన ప్రయాణాలు
కరోనా తీవ్రత ఉన్నప్పటికీ ట్రంప్ దేశంలో ఆంక్షల సడలింపులపై దృష్టి సారించారు. దేశంలో వివిధ ప్రాంతాల మధ్య విమానయానానికి అనుమతించారు. వచ్చే వారం నుంచి దేశంలో అంతర్గత ప్రయాణాలకు అనుమతించనున్నట్లు శ్వేతసౌధంలో విలేకరులకు తెలిపారు.త్వరలోనే దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో రాజకీయాలు ఏమీ లేవని , ఆర్థిక కార్యకలాపాల పట్ల ప్రజలలో భరోసా కల్పించేందుకు తాను వచ్చే వారం అరిజోనా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ట్రంప్ తెలిపారు.

Trump Plane to Covid 19 Affected States Re-Open

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News