Monday, April 29, 2024

33వేల చదరపు అడుగులు పెరిగిన నూతన సచివాలయ విస్తీర్ణం..

- Advertisement -
- Advertisement -

ప్రాంగణం విస్తీర్ణం 26.29 ఎకరాల నుంచి 28.05 ఎకరాలకు పెంపు
రోడ్ల వెడల్పు కార్యక్రమానికి అదనంగా 7,122 చ.మీ. స్థలం
రాష్ట్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీకి రోడ్లు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌ల ప్రతిపాదన

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయానికి రాష్ట్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ నెల 1న జారీ అయిన పర్యావరణ అనుమతుల్లో కొన్ని సవరణలు చేయాలంటూ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీకి సిఫారసు చేసింది. రోడ్లు భవనాల శాఖ రూపొందించిన డిజైన్‌తో పోలిస్తే ప్రస్తుత సచివాలయ విస్తీర్ణం సుమారు 33 వేల చదరపు అడుగుల మేర పెరిగింది. కొన్ని కొత్త కట్టడాలు కూడా ప్రాంగణంలో వస్తున్నందున వాటికి కూడా మదింపు కమిటీ అనుమతి ఇచ్చింది. నూతన సచివాలయ నిర్మాణం కోసం ఆగస్టులోనే పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయని, ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి కూడా అనుమతి లభించిందని రోడ్లు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ మదింపు కమిటీకి స్పష్టం చేసింది. ఆ ప్రకారం ఈ నెల 21న జరిగిన సమావేశానికి ఇంజినీర్‌తో పాటు పర్యావరణ నిర్వహణ ప్లాన్ రూపొందించిన ప్రైవేటు సంస్థ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. సాంకేతిక, పర్యావరణ, ఆర్థిక అంశాలను కమిటీ సభ్యులకు వివరించారు. ఆరుగురు సభ్యులు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ నెల జారీ చేసిన ఈసీకి తాజా మార్పులతో సవరణలు చేయాల్సిందిగా సిఫారసు చేసింది. ప్రస్తుతం సచివాలయ నిర్మాణానికి సుమారు రూ.650 కోట్ల ఖర్చు కానుంది.
ఈ భవనం మొత్తం విస్తీర్ణం 61,914.67 చ.మీ.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ ప్రకారం మొత్తం జీ+11 అంతస్తుల (సెల్లార్ అదనం)తో నిర్మాణమయ్యే ఈ భవనం మొత్తం విస్తీర్ణం 61,914.67 చ.మీ.గా ఉంటుంది. ఈ మేరకే గత నెలలో ఈసీ కూడా మంజూరైంది. కానీ ఇప్పుడు ఆ విస్తీర్ణం సుమారు 3,049 చ.మీ. (33,096 చ.అ) మేర పెరుగుతోంది. దీనికి తోడు ప్రాంగణంలో కొత్తగా జీ+2 అంతస్తులతో ఒక భవనం (సెక్యూరిటీ, డ్రైవర్ల కోసం) నిర్మించనున్నట్లు మదింపు కమిటీ సమావేశంలో ఈ ప్రతినిధులు ప్రతిపాదించారు. దీంతో పార్కింగ్ స్థలం కూడా స్వల్పంగా పెరగనుంది. రోడ్ల వెడల్పు కార్యక్రమానికి అదనంగా 7,122 చ.మీ. స్థలం అవసరమవుతున్నందున మొత్తం సచివాలయ ప్రాంగణం విస్తీర్ణం 26.29 ఎకరాల నుంచి 28.05 ఎకరాలకు (అదనంగా 1.76 ఎకరాలు) పెరిగింది. దీనికి తగినట్లుగా మొత్తం సచివాలయ నిర్మాణ వ్యయం కూడా రూ.400 కోట్ల నుంచి రూ.650 కోట్లకు పెరుగుతోంది.
ఏడాదిలోపు నూతన సచివాలయ నిర్మాణం పూర్తి
ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి ఆర్‌అండ్‌బి శాఖ టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఈ టెండర్ పత్రాల్లో గుత్తేదారు కంపెనీ నికర విలువ రూ.750 కోట్లు ఉండాలని, ఏదైనా ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.500 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలను నిర్వహించి ఉండాలని ఆర్‌అండ్‌బి పేర్కొంది. ఎంపికైన గుత్తేదారునకు ముందస్తుగా నగదు చెల్లింపునకు అవకాశం లేదని తెలిపింది. దీంతోపాటు టెండర్ ఖరారయిన రోజు నుంచి ఏడాదిలోపు నూతన సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని పేర్కొంది. 365 రోజులు 24 గంటల పాటు పనులు నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పిస్తామని ఆర్‌అండ్‌బి తెలిపింది. టెండర్లు దాఖలు చేసే గుత్తేదారు సంస్థ గడిచిన అయిదేళ్ల వ్యవధిలో ఇలాంటి నిర్మాణాలు మూడు చేసి ఉండాలని పేర్కొంది. కనీసం రూ.100 కోట్ల విలువైన 10 అంతస్థుల భవనాన్ని నిర్మించిన అనుభవం ఉండాలని ఆ నోటిఫికేషన్ తెలిపింది. సచివాలయం నిర్మాణంలో భాగంగా చెట్లు, మొక్కలను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించకూడదని ఆర్‌అండ్‌బి పేర్కొంది. ఒకవేళ నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తితే ఆర్‌అండ్‌బి దృష్టికి తీసుకురావాలని తెలిపింది. ఈనెల 18వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 4.30 గంటల వరకు ఈ టెండర్లను స్వీకరించనున్నారు.

TS new secretariat area increases by 33000 square feets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News