Monday, April 29, 2024

కరోనా ప్రభావంతో 70 లక్షల మంది మహిళలకు అవాంఛిత గర్భధారణ?

- Advertisement -
- Advertisement -

Pregnancy

 

యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ అధ్యయనం వెల్లడి

ఐక్యరాజ్యసమితి : కరోనా మహమ్మారిపై పోరులో కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా అనేక దేశాల్లో వ్యవస్థలు స్తంభించి పోయాయి. ఏదీ అందుబాటు లోకి రాని దుర్బర పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా మహిళలు, బాలికలపై కరోనా విపరీత ప్రభావం చూపిస్తోంది. వారి ఆరోగ్యం, భౌతిక పరిస్థితులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతులకు, ఆరోగ్య సదుపాయాలకు దూరమౌతున్నారు. ఈ నేపథ్యంలో గర్భనిరోధక సాధనాలకు అంతరాయం ఏర్పడడంతో స్వల్ప, మధ్యాదాయ దేశాల్లోని 47 మిలియన్ మంది మహిళల్లో దాదాపు ఏడు మిలియన్ (70 లక్షల ) మంది మహిళలు అవాంఛిత గర్భధారణ పొందే అవకాశం ఉన్నట్టు యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ ( యుఎన్‌ఎఫ్‌పిఎ ) వెల్లడించింది. మహిళలపై వేధింపులు ఇతర హానికర సంఘటనలు కూడా ఎదురవుతాయని హెచ్చరించింది. కరోనా స్రభావం వల్ల లక్షలాది మంది మహిళలు, బాలికలపై విపరీత పరిణామాలు ఏర్పడతాయని, తమ కుటుంబాలను నడపడం లోను, తమ శరీరాన్ని ఆరోగ్యాన్ని సంరక్షించుకోడంలో సామర్థం కోల్పోతారని యుఎన్ ఎఫ్‌పిఎ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నటాలియా కనేమ్ చెప్పారు.

కరోనా ప్రభావం ప్రస్తుతం ఆరంభ దశలో ఉందని, రానున్న రోజుల్లో ఇది మరింత విపరీతంగా మారుతుందని నిపుణులు అభిప్రాయం ఆయన వివరించారు. ఆర్థిక, భౌతిక సమస్యలు ఎదురై మహిళలు, బాలికల హక్కులకు, ఆరోగ్యానికి చేటు కలుగుతుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్వల్ప, మధ్యాదాయ 114 దేశాల్లో దాదాపు 450 మిలియన్ మహిళలు గర్భ నిరోధక సాధనాలు వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ మరో ఆరు నెలల పాటు కొనసాగితే ఆయా దేశాల్లోని 47 మిలియన్ మంది మహిళలు ఆదునిక గర్భనిరోధక సాధనాలు ఉపయోగించలేని వారవుతారు. ఫలితంగా ఏడు మిలియన్ మంది మహిళలు అదనంగా అవాంఛనీయ గర్భధారణ పొందే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మహిళలపై లైంగిక వేధింపుల కేసులు 31 మిలియన్ వరకు చేరుకుంటాయని అధ్యయనం వెల్లడించింది. స్త్రీ జననేంద్రియ ఛేదన, బాల్య వివాహాలు తదితర కార్యక్రమాలు కరోనా కారణంగా విపరీత జాప్యానికి గురై మరో పదేళ్లలో రెండు మిలియన్ వరకు ఈ జననేంద్రియ ఛేదన కేసులు, అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల 13 మిలియన్ బాల్యవివాహాలు పెరుగుతాయని నివేదిక వివరించింది.

అదే కాలంలో మహిళల లైంగిక వేధింపుల కేసులు అదనంగా 31 మిలియన్ వరకు పెరుగుతాయని పేర్కొంది. లాక్‌డౌన్ కొనసాగింపులో ప్రతి మూడు నెలలకు మరో 15 మిలియన్ వరకు కేసులు పెరగవచ్చని అంచనా వేసింది. అవెనిర్ హెల్తు, జాన్స్‌హాప్క్‌న్స్‌యూనివర్శిటీ, విక్టోరియా యూనివర్శిటీ భాగస్వామ్యంతో ఈ అంచనా నివేదిక వెల్లడైంది. అయితే ఈ సంక్షోభ సమయంలో మహిళల ఆరోగ్యం, వైద్యసదుపాయాలపై వివిధ దేశ ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నట్టు యుఎన్‌ఎఫ్‌పిఎ వెల్లడించింది.

Unwanted Pregnancy for Women With Corona Effect
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News