Monday, April 29, 2024

నీటి విడుదలపై తగ్గేదేలే

- Advertisement -
- Advertisement -

తెగేసి చెప్పిన ఎపి ప్రభుత్వం
మా రాష్ట్ర హక్కులు మేం కాపాడుకుంటాం
సాగర్ సమస్య కృష్ణా బోర్డు వైఫల్యమే
కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ :‘నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం..నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదు ’ అని ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.నాగార్జున సాగర్ కుడికాలువ కింద తమకు కేటాయించిన 15 టిఎంసీలలో ఇప్పటివరకూ 5టిఎంసీలను మాత్రమే వాడుకున్నామని తెలిపింది. మిగతా 10 టిఎంసీల నీటిని వాడుకోనివ్వకుండా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌ను ఖాళీచేస్తే రాష్ట్రంలోని గుంటూరు, పల్నాడు , ప్రకాశం ,బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం పెద్ద సవాల్‌గా మారుతుందన్న ఆందోళనతోనే సాగర్ స్పిల్‌వేను స్వాధీనం చేసుకుని కుడి కాలువకు నీటిని విడుదల చేసి తమకున్న హక్కులను పరిరక్షించుకున్నట్టు వెల్లడించించి.

తెలుగు రాష్ట్రాల మధ్యన నాగార్జునసాగర్ జలవివాదం నేపధ్యంలో శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కృష్ణనదీయాజమాన్య బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రంచడంలో మీ (బోర్డు)వైఫల్యంవల్లే తమ రాష్ట్ర భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం స్వాదీనం చేసుకున్నామని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఏపీకి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు విడుదల చేశామని స్పష్టంచేసింది. సాగర్ స్పిల్‌వేలో సగభాగాన్ని ఏపీ స్వాధీనం చేసుకుందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కుడి కాలువకు నీటి విడుదలను ఆపేలా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని ఆ లేఖలో కోరింది.
ఎపి లేఖలో ప్రధానాంశాలివీ..
శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెకట్స్ సీఈకి, సాగర్ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెకట్స్ సీఈకి అప్పగించకుండా.. తానే నిర్వహిస్తోందని తెలిపింది. అదే సమయంలో తమ రాష్ట్ర భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సైతం తెలంగాణ తన అదీనంలోకి తీసుకుందని తెలిపింది. గత తొమ్మిదేళ్లుగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ సాగర్‌కు తరలించి.. అటు సాగర్ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని అనేకసార్లు బోర్డుకు ఫిర్యాదు చేశామని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను స్వాదీనం చేసుకోవాలని బోర్డును అనేకసార్లు కోరామని, లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని కోరామని తెలిపింది . కానీ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది.

అక్టోబరు 6న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, సాగర్ నుంచి 15 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చిందని వెల్లడించింది. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించిందని తెలిపింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ యథావిధిగా అదే రోజున ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి శ్రీశైలాన్ని తెలంగాణ సర్కార్ ఖాళీచేస్తూ వచ్చిందని, దీనిపై అప్పుడే బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపింది. దీనివల్ల శ్రీశైలంలో తమకు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలనే వాడుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. తెలంగాణ చర్యలవల్ల 17 టీఎంసీలను కోల్పోయామని ఆరోపించింది. సాగర్ కుడి కాలువ కింద ఏపికి కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు 5 టీఎంసీలు వాడుకున్నామని, మిగతా 10 టీఎంసీలను వాడుకోనివ్వకుండా నాగార్జున సాగర్ జలాశయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీచేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గా మారుతుందన్న ఆందోళనతోనే సాగర్ స్పిల్ వేను స్వాదీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి తమ రాష్ట్ర హక్కులను పరిరక్షించుకున్నామని వెల్లడిచింది. సాగర్ నుంచి నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదని ఈ మేరకు లేఖలో ఏపి ప్రభుత్వం కృష్ణాబోర్డుకు స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News