Monday, April 29, 2024

యాదవుల ప్రత్యేక పండగ

- Advertisement -
- Advertisement -

Yadavas perform Sadar with utmost prestige and devotion

సదర్ అంటే తెలియని హైదరాబాదీ వుండరు. భాగ్యనగరం కేంద్రంగా దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే ఈ సదర్ వేడుకలు వున్నవి అని శాసనాలు ద్వారా తెలుస్తుంది. మన నగరం ఎలా అయితే దినదినం అభివృద్ధి చెందిందో దానితో పాటు సదర్ పండగ కూడా ప్రతి ఏటా అంతకుమించి అనేవిధంగా ఆకాశమే హద్దుగా విరాజిల్లుతుంది.. దీపావళి పర్వదినం తర్వాత రెండవ రోజు యాదవులు సదర్ ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం యాదవ కులస్థులు తమను శ్రీకృష్ణుని వారసులుగా చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడు ఆలమందలను (పశువుల సంపద) పెంచి పోషించాడు. మానవ జీవితంలోనూ కొన్ని సామాజిక తరగతులకు, కులాలకు పశువులను పెంచడం ఒక వృత్తిగా మారింది. యాదవ కులస్థులు పశుసంపదను పెద్ద ఎత్తున కలిగి ఉంటారు. తమ వృత్తి నుండి ఆవిర్భంచిన ఉత్సవం నేడు క్రమక్రమంగా సదర్ ఉత్సవంగా ఆదరణ పొందుతున్నది!

క్రీస్తు పూర్వం 5 లక్షల సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు యాదవుల కుటుంబాల్లో బాల్యం గడిచింది.. అలా యాదవులకు, శ్రీకృష్ణుడుకి విశిష్టమైన స్థానం వుంది. యాదవులు ఆ కాలం నుండే యుద్ధ విన్యాసల్లో, ధైర్యసాహసాల్లో పెట్టింది పేరుగా వుండేవారు. మరోపక్క జంతువుల సంరక్షణ చేసేవారు.. ఆలమంద (గేదె, అవు, గొర్రె, మేకలు) పశుపోషణను వారి కుటుంబంతో పాటు స్వంత కుటుంబ సభ్యులుగా పెంచేవారు. అప్పటి వ్యాపార సముదాయాలులో ముఖ్యమైనవి బియ్యం, పప్పుదినుసులు, ఆలమంద మొదలగు వాటికి బాగా విలువ వుండేది. అప్పట్లో డబ్బు వుండేది కాదు ఏ వస్తువు అయిన ఇచ్చి పుచ్చుకోవడం పద్ధతి. అప్పట్లో పశువులకు మంచి డిమాండ్ ఉండటం వల్ల ఒక చోట నుండి మరొక చోటికి వస్తువు మార్పిడి జరిగేది. ఆ రోజుల నుండి కాలక్రమేనా నాణేల మార్పిడి వరకు ముఖ్యమైన ప్రదేశాల్లో వ్యాపార సముదాయ లావాదేవీ కేంద్రాలను ‘సదరు’ అని పిలిచేవారు. అలా కాలక్రమేనా అది సదర్ ఉత్సవంగా పిలిచినట్టు చరిత్ర చెప్తున్న నిజాలు. భాగ్యనగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్‌పల్లి, ఈస్ట్‌మారెడ్‌పల్లి, చప్పల్‌బజార్, మధురాపూర్, పాతబస్తీ తదితర మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు రాష్ట్రంలోని పలుప్రాంతాల ప్రజల దృష్టిని ఆకర్శించే స్థాయిలో కొనసాగుతాయి. గతంలో యాదవ కులస్థులు ఎక్కువగా ఉండే మున్సిపల్ డివిజన్లు, కాలనీలు, అపార్టుమెంట్ల ప్రాంగణాల్లో ఎక్కువ జరుగుతూ వుండేవి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమంతా యాదవులు ఘనంగా సదర్‌ని నిర్వహిస్తున్నారు..

యాదవులు సదర్ పండగను దృష్టిలో పెట్టుకొని కొన్ని నెలల ముందు నుండి ముర్ర జాతికి చెందిన దున్నలను హర్యానా, పంజాబ్, రోటెక్, జింద్, హిస్సర్, కురుక్షేత్ర లాంటి ప్రాంతాల నుండి తీసుకు వస్తారు. ఈ మూర్ర జాతి దున్నలలో ప్రధానంగా 5 రకాలగా వుంటవి వాటిలో హైదరాబాద్ షైన్ షా, రుస్తుం, యువరాజు, ట్రంప్ దూడ, మహారాజ మొదలగు వాటిని సదర్ కు ముస్తాబు చేస్తారు.. ఈ దున్నల ఖరీదు సుమారుగా రూ. 15 కోట్ల నుండి రూ. 25 కోట్ల వరకు వుంటుంది. వీటికి ప్రతిరోజూ 50 లీటర్ల పాలు, వందల సంఖ్యలో ఆపిల్, బాదం, పిస్తా, కాన్బెర్రా, బ్లూబెర్రితో పాటు వైన్, విస్కీని వీటికి ఆహారంగా ఇస్తారు. వీటికి నలుగురు సంరక్షకులు వుంటారు. ప్రతి రోజూ రెండు సార్లు స్నానం చేయించాలి! ఒక మనిషికి అవసరమైన విధంగా ప్రత్యేక గది, ఎసితో పాటు ఫ్యాన్, రోజుకి రెండు సార్లు ఆయిల్ మసాజ్ సకల భోగాలు అందిస్తారు. పండగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు.

దున్నపోతుల శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారు చేస్తారు. అందుకు వెన్న లేదా పెరుగు ఉపయోగిస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడతారు. నెమలి ఈకలను అమర్చుతారు. అలంకరించిన తరువాత సుగంధ ద్రవ్యాలను చల్లుతారు. మనషులకు సైతం అసూయ పుట్టించే విధంగా అలంకరణ చేస్తారు. అలంకరించిన దున్నపోతులతో ఉత్సాహం కలిగిన యువకులు కుస్తీ పడతారు. ముక్కుతాడును చేతబట్టు కొని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరి కాళ్లను పైకెత్తి యువకులతో సరిసమానంగా స్టెప్పులు వేస్తుంది. అయితే భారీ శరీరం కావడం వలన వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కొన్నింటిని సుతారంగా గంగిరెద్దులా ఆడించే ప్రయత్నం చేస్తారు. ఎంపిక చేసిన ఆవరణలో గానీ, ఖాళీ ప్రదేశంలో గానీ, బస్తీల్లో గానీ ఈ వేడుకలను నిర్వహిస్తారు. యువకులు, మహిళలు, విద్యార్థులు అంతా ఈ ఉత్సవాలను చూసేందుకు అమిత ఆసక్తిని కనబరుస్తారు.యువకులు తీన్మార్ డాన్స్‌ల తో హోరెత్తిస్తారు. సదర్ ఉత్సవాలు ప్రస్తుతానికి ‘బఫెలో కార్నివాల్స్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో జరుగుతున్నాయి.

ఈ వేడుకలు మనషులకు, జంతువులకు కొన్ని కోట్ల ఎండ్లుగా ఉన్న సంబంధాల గురించి తెలియజేస్తుంది. దేశీయంగా ఇంత ప్రాముఖ్యత పొందిన సదర్ ఉత్సవాన్ని యాదవులు తమకే చెందిన పండుగల భావించకుండా సదర్‌ను కులం, మతం, జాతి, వర్గ భేదాలు లేకుండా అందరినీ కల్పుకొని ప్రతి ఏటా దీపావళి పర్వదినం తర్వాత రెండవ రోజు గొప్పగా జరుపుకోవడం మన రాష్ట్రానికే గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో , మండల కేంద్రాల్లో సదర్ పండగను గొప్పగా జరుపుకోవడం సంతోషకరం. సదర్ పండగ పైన బిబిసి, ఎన్‌డిటివి లాంటి అంతర్జాతీయ ఛానెల్, విజ్ఞాన ఛానెల్స్ లో గొప్పగా వర్ణిస్తూ ప్రసారం చేయడం సంతోషకరం. దీపావళి నాడు టపాసుల మోతతో మార్మోగిన జంట నగరాలు. మరుసటి రెండవ రోజున ఆలమందల కేళితో యాదవులు దుమ్ములేపుతారు. సదర్ సందడితో పట్నంలోని బస్తీలన్నీ జబర్దస్తీగా మారుతాయి. ద్వాపర యుగం నాటి ఈ సంబురం ఈనాటికీ ప్రతి గల్లి గల్లిలో కనువిందు చేస్తోంది. యాదవులకు పరిమితమైన ఈ పండుగ హైదరాబాద్ సంప్రదాయంలో ఓ భాగం అయింది. కాలక్రమంగా తెలంగాణ రాష్ట్రం అంతటా యాదవులు గొప్పగా సదర్ పండగ జరుపుతున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో యాదవుల సదర్ పండగ ముఖ్యమైనది!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News