Wednesday, May 29, 2024

జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్

- Advertisement -
- Advertisement -

Zomato

రూ.2500 కోట్లకు కొనుగోలు
జోమాటో ప్లాట్‌ఫామ్‌కు ఉబెర్ కస్టమర్ల మార్పు

న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ వ్యాపారాన్ని పెంచుకుంటోంది. వాటా ఒప్పందం ద్వారా ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ ఈట్స్ ఇండియాను కొనుగోలు చేసినట్టు జొమాటో మంగళవారం ప్రకటించింది. దీపిందన్ గోయల్ ఆధ్వర్యంలోని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నుంచి ఉబెర్ సంస్థ 9.99 శాతం వాటాలను పొందనుంది. ఈ డీల్ విలువ రూ.2500 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాల సమాచారం. దేశంలోని రెస్టారెంట్ భాగస్వాములు, డెలివరీ భాగస్వాములు, కస్టమర్లను ఉబెర్ యాప్ ద్వారా జోమాటో ప్లాట్‌ఫామ్‌కు మారుస్తారు. సంస్థ మంగళవారం ఈ సమాచారం ఇచ్చింది. నష్టాల కారణంగా ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని విక్రయించాలని ఉబెర్ నిర్ణయించింది. ఉబెర్ ఈట్స్ కొనుగోలుతో జోమాటో మార్కెట్ వాటాను 50 శాతానికి పైగా పెరగనుంది. ప్రస్తుతం స్విగ్గీ 48 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఉబెర్ 2017లో భారతదేశంలో ఫుడ్ డెలివరీలోకి ప్రవేశించింది.

ఉబెర్ నుంచి 26 వేల రెస్టారెంట్లు జోమాటోకు..
జోమాటో, స్విగ్గీల పోటీ కారణంగా ఉబెర్ ఈట్స్ నిలదొక్కుకోలేకపోయింది. గత 5 నెలల్లో కంపెనీ రూ.2,197 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఉబెర్ 2017లో భారతదేశంలో ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ సంస్థకు 41 నగరాల్లో 26,000 రెస్టారెంట్లు భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు 24 దేశాలలో 1.5 మిలియన్ రెస్టారెంట్ల గురించి సమాచారం జోమాటో రెస్టారెంట్ డిస్కవరీ, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఈ సంస్థ ప్రతి నెలా 70 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్త్తోంది. ఇది భారతదేశంలో 1.5 లక్షల రెస్టారెంట్ భాగస్వాములను కలిగి ఉంది.

దేశంలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ సంస్థగా…

కొద్ది రోజుల క్రితం జోమాటో తన ప్రస్తుత పెట్టుబడిదారుడు యాంట్ ఫైనాన్షియల్ నుండి 150 మిలియన్ డాలర్ల (రూ. 1065 కోట్లు) కొత్త పెట్టుబడిని సేకరించింది. జోమాటో విలువను 300 మిలియన్ డాలర్లు (రూ .21,300 కోట్లు)గా అంచనా వేశారు. దీని ఆధారంగానే యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడులు పెట్టింది. దేశంలోని 500కి పైగా నగరాల్లో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో అగ్రగామిగా నిలిచినందుకు గర్వంగా ఉందని జోమాటో సిఇఒ దీపిందర్ గోయల్ అన్నారు. ఉబెర్ ఈట్స్ కొనుగోలు చేయడం ద్వారా తమ స్థానం బలోపేతం అవుతుంది. మరోవైపు ఉబెర్ సిఇఒ దారా ఖోస్రోషాహి మాట్లాడుతూ, భారతదేశం ఒక ముఖ్యమైన మార్కెట్ అని, ఇక్కడ రైడ్ వ్యాపారంలో వృద్ధిని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం కొనసాగుతుందని చెప్పారు. జోమాటో సమర్థవంతమైన వ్యాపారం తమల్ని ఆకట్టుకుందని అన్నారు. మీడియా నివేదికల ప్రకారం, ఉబెర్ ఈట్స్ ఉద్యోగులను నియమించదు. సుమారు 100 మంది ఉద్యోగులను ఇతర వ్యాపారాలకు మారుస్తుంది లేదా తొలగించే అవకాశముంది.

Zomato which bought Uber Eats India
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News