Monday, April 29, 2024

హాట్ టాఫిక్‌గా మారిన ‘నిజాముద్దీన్ మర్కజ్’

- Advertisement -
- Advertisement -

మత ప్రార్థనల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది
ఇప్పటికే ఆరుగురు మృత్యువాత
ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి వివరాల సేకరణ
పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్ మసీదు పేరు హాట్ టాఫిక్‌గా మారింది. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. అక్కడ జరిగిన మతపరమైన ప్రార్థనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 2 వేల మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వారిలో చాలామందికి కరోనా సోకినట్టుగా అధికారులు అంచనాకు వచ్చారు. అందులో ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు విధిగా తమ వివరాలు తెలపాలని అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
ప్రార్థనల్లో పాల్గొన్న 2వేల మంది తెలుగువారు
తెలంగాణలో ఏకంగా ఆరుగురు కరోనాతో చనిపోవడం, ఆ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మార్చి 13వ తేదీ నుంచి 15 తేదీల మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు పాల్గొనగా, ఈ ప్రార్థనలకు ఇతర దేశాల నుంచి మత పెద్దలు సైతం వచ్చినట్టుగా అధికారుల విచారణలో తెలిసింది. ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 2వేల మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనలకు హాజరయినట్టుగా సమాచారం.
రెండున్నర రోజులపాటు సదస్సు
ఇక్కడ ప్రార్థనలకు వచ్చిన వారు కరోనా వైరస్‌తో మృత్యువాడపడడంతో ఢిల్లీలోని ‘నిజాముద్దీన్’ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అక్కడి సదస్సులో పాల్గొని వచ్చిన వారిలోనూ ప్రస్తుతం ఈ సంఘటన కలవరం రేపుతోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రార్థనా మందిరంలో రెండున్నర రోజులపాటు ఓ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మంది హాజరుకాగా, వీరిలో అత్యధికులు మార్చి 14-,15వ తేదీల్లో తమ తమ ప్రాంతాల నుంచి రైళ్లలో వెళ్లారు. 16, 17, 18వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించడంతో పాటు ఢిల్లీలో ఉన్నన్నీ రోజులు కలిసే బస చేశారు. తిరుగు ప్రయాణంలో వీరంతా దురంతో ఎక్స్‌ప్రెస్, ఎపి ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణించినట్టుగా అధికారులు గుర్తించారు.
ప్రార్థనా మందిరాల్లో సమావేశాలు
ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో తెలంగాణలో ఇప్పటికే ఆరుగురు మృతిచెందారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు ఇతరులను కలవడంతో మరో ఏడెనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన వారి వివరాలు తెలిపేందుకు స్థానికంగా మరిన్ని ప్రార్థనా మందిరాల్లో చిన్నపాటి సమావేశాలు నిర్వహించినట్టుగా తెలిసింది.
లోకల్ కాంటాక్టు ద్వారా 70 శాతం కేసులు
తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసుల్లో సగం లోకల్ కాంటాక్టు వల్లే వస్తున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. వారం రోజులుగా నమోదవుతున్న కేసుల్లో, విదేశాల నుంచి వచ్చిన వాళ్లవి 30 శాతం మాత్రమే ఉంటుండగా, లోకల్ కాంటాక్టు ద్వారా 70 శాతం కేసులు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీలో ప్రార్థనా మందిరంలో మత పరమైన కార్యక్రమాలకు వెళ్లి వచ్చిన వారి వల్లే ఎక్కువ కేసులు నమోదవుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ నుంచి దాదాపు 300 మంది
ఢిల్లీలో ప్రార్థనలకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి దాదాపు 300 మంది వెళ్లినట్లు సమాచారం. వారిలో 150 మంది వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చాక వైరస్ లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చింది. అతడి నుంచి కుటుంబసభ్యుల్లో నలుగురికి వైరస్ సోకింది. దీంతో వైద్యశాఖ అధికారులు ఢిల్లీ ప్రార్థనా మందిరం నిర్వాహకులను సంప్రదించి ఆ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించారు. ఆ వివరాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లిన వారికి పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి
తెలంగాణలో అధిక శాతం కరోనా కేసులు హైదరాబాద్‌లోనే నమోదు అవుతుండగా, తర్వాత స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. తెలంగాణలో ఇప్పటి దాకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4, కరీంనగర్‌లో మూడు, వరంగల్ అర్బన్, నిజామా బాద్, మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 6 కుటుంబాలకు చెందిన 17 మంది వైరస్ బారిన పడ్డారు. కేవలం ఢిల్లీ వెళ్లడం ద్వారా మూడు కుటుంబాల వారు, తమ కుటుంబ సభ్యులకు వైరస్ అంటించినట్టుగా అధికారులు గుర్తించారు.

2,000 people attend to Delhi Prayers from Telugu states

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News