Friday, May 17, 2024

కుటుంబంలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

45 రోజుల్లో ఐదుగురిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి
ఆస్పత్రిలో కోలుకుంటున్న మరో ఇద్దరు
టిఎస్‌ఎండిసిలో జిఎంగా ఉద్యోగ బాధ్యతలు
నిర్వర్తిస్తున్న దీప్తి మృతి, పెద్దమ్మ, పెద్దనాన్న, మేనమామలు కూడా..
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం ప్రతిరోజు కరోనాతో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు చనిపోతున్నారన్న వార్తను మన వింటున్నాం. అలాంటి దురదృష్టకర సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. విధి పగబట్టిందో ఏమో ఒకే కుటుంబానికి చెందిన ఐదుమందిని కరోనా బలిగొంది. 45 రోజుల్లోనే ఒకరి తరువాత ఒకరిని ఈ వ్యాధి పొట్టనబెట్టుకుంది. ఈ ఐదుగురిలో ఒక నిజాయితీ గల అధికారిణి సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించడం అందరినీ కలచివేసింది. ప్రస్తుతం ఆ ఇంటికి చెందిన మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…
టిఎస్‌ఎండిసిలో జిఎంగా ఉద్యోగ బాధ్యతలు
2007 సంవత్సరంలో గ్రూప్ 1కు ఎంపికై ఆడిట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన దీప్తి ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ హోదాలో టిఎస్‌ఎండిసిలో జిఎంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో నిజాయితీగల అధికారిణిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె కరోనాతో పోరాడుతూ తనువు చాలించారు. అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ 1992 సంవత్సరంలో ఐఎస్‌ఐ ముష్కరుల చేతిలో దుర్మరణం చెందిన జి.కృష్ణప్రసాద్, దీప్తి తండ్రి. 13 ఏళ్ల వయస్సులో తన తండ్రి జి.కృష్ణప్రసాద్ ముష్కరుల చేతిలో మృత్యువాత పడడంతో కష్టపడి చదివి, మొక్కవొని ధైర్యంతో పోటీ పరీక్షలు రాసి 2007లో గ్రూప్1 ఉద్యోగాన్ని దీప్తి సాధించింది. మహబూబ్‌నగర్‌తో పాలు పలుచోట్ల ఆమె ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించింది. ఆయన నుంచి మంచి లక్షణాలు అలవర్చుకున్న ఆమె, తన విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించదన్న పేరు తెచ్చుకుంది. ఇంతలోనే ఆమె కరోనా బారిన పడి మృత్యువాత పడడంతో టిఎస్‌ఎండిసి అధికారులు, సిబ్బంది ఆమె సేవలను మరోసారి గుర్తు చేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.
45 రోజుల క్రితం ముగ్గురు
45 రోజుల క్రితం మొదటగా దీప్తి కుటుంబానికి చెందిన పెద్దమ్మ, పెద్దనాన్న, మేనమామలు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. తదనంతరం 20 రోజుల క్రితం ఆమె తల్లి కరోనా బారిన పడింది. ఆమె కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. 8 రోజుల క్రితం దీప్తికి ఆమెతో పాటు ఆమె తమ్ముడు, ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో దీప్తి పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం దీప్తి తమ్ముడు, ఆయన భార్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

5 of same family died of Covid in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News