Monday, April 29, 2024

సంపాదకీయం: ట్రంప్ ఎదురీత

- Advertisement -
- Advertisement -

sampadakiyam వచ్చే నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగల అవకాశాలు రోజురోజుకీ తగ్గుతున్నాయి. ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ విజయావకాశాలు పెరుగుతున్నా యి. ప్రధానమైన సర్వేలలో బిడెన్ మెజారిటీలు ఏక అంకెను దాటి రెండంకెలలో పెరుగుతూ కొనసాగుతూ ఉండడం ఇందుకు గాఢమైన సూచన. న్యూయార్క్ టైమ్స్/ సీనా కాలేజీ సర్వేలో ట్రంప్ కంటే బిడెన్‌కు 14 పాయింట్లు, హార్వర్డ్ / హరీస్ సర్వేలో 12 పాయింట్లు ఆధిక్యం రావడం గణనీయమైన పరిణామం. మొన్న బుధవారం నాడు విడుదలయిన క్విన్ని పికా యూనివర్శిటీ పోల్ ఫలితాల్లో బిడెన్ కంటే ట్రంప్ 17 పాయింట్లు వెనుకబడిపోయాడు. కరోనాను కట్టడి చేయడంలో వైఫల్యం ట్రంప్‌ను ఓటమి పాలు చేసే అంశాలలో ప్రధానమైనది కాబోతున్నది. ఆయన ప్రభుత్వం కరోనాను అదుపు చేస్తున్న తీరుపై అమెరికన్ ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఓటింగ్ సరళి నిరూపించింది. ఈ అంశంపై బిడెన్‌కు 59 పాయింట్లు రాగా, ట్రంప్‌కు అనుకూలంగా 35 మాత్రమే వచ్చాయి. ఏ సంక్షోభాన్నైనా ఎదుర్కొనే విషయంలోనూ, ఆరోగ్య భద్రత అంశంపైనా ట్రంప్ రేటింగ్ దారుణంగా పడిపోయింది.

జాతుల మధ్య అసమానతలు తొలగించే విషయంలో తెల్ల జాతి ఓటర్లు ట్రంప్‌కి వ్యతిరేకంగా బిడెన్‌కి అనుకూలంగా స్పందించడం గమనార్హం. ఇటీవల ఒక ఆఫ్రో అమెరికన్ నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను ఒక తెల్ల పోలీసు అధికారి బూటు కాలితో అదిమి పట్టి శ్వాస ఆడకుండా చేసి క్రూరాతి క్రూరంగా హతమార్చిన ఉదంతం, దానిని తన ఓటు బ్యాంకు పెంచుకోడానికి ఒక పావుగా చేసుకోవాలని ట్రంప్ సాగించిన యత్నం తెల్లవారిలో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభపడాలని అతడు పడిన ఆరాటం నల్లవారినే కాకుండా శ్వేత జాతీయులను సైతం ఆయనకు వ్యతిరేకం చేసిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పట్టభద్రులైన తెల్ల జాతి మహిళలే కాకుండా పెద్దగా చదువుకోని ఆ వర్గం వారు కూడా డెమొక్రాటిక్ పార్టీ వైపు మొగ్గడం కనిపించింది. అంతేకాదు స్వల్ప స్థాయిలోనైనా రిపబ్లికన్ ఓటర్లు బిడెన్ వైపు మళ్లుతున్నారు.

గత అధ్యక్ష ఎన్నికల్లో చదువు, నైపుణ్యాలు అంతగా లేని తెల్లవారు ఓటు వేయడం వల్ల ట్రంప్‌కు అంతిమ విజయం లభించింది. సాధారణ ఓట్లలో హిల్లరీ క్లింటన్ మంచి ఆధిక్యత నిరూపించుకున్నప్పటికీ నిర్ణాయకమైన ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లలో మెజారిటీ గడించి ట్రంప్ నెగ్గుకు రాగలిగాడు. ఒక మాదిరి చదువులు చదువుకున్న, నిరుద్యోగులైన తెల్లవారే తన చెక్కు చెదరని ఓటు బ్యాంకు అని భావించిన ట్రంప్ తన పాలనలో వారిని సంతృప్తి పరిచే చర్యలకే ప్రాధాన్యమిస్తున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదంతో విద్య, శిక్షణ, ఉద్యోగాల్లో తెల్లవారికే అగ్ర తాంబూలం అర్పిస్తున్నాడు. శ్వేతేతర విద్యార్థుల ఉద్యోగులపై పరిమితులు, ఆంక్షలు విధిస్తున్నాడు. హెచ్1 బి వీసాలు మంజూరు చేయడాన్ని ఈ సంవత్సరాంతం వరకు వాయిదా వేసిన చర్య ఇందుకు ఉద్దేశించినదే. పూర్తి ఆన్‌లైన్ విద్యను అభ్యసించే విదేశీ విద్యార్థులకు ఆరంభ సీజన్‌లో ప్రవేశం నిషేధిస్తూ ఇటీవల జారీ చేసి, తర్వాత ఉపసంహరించుకున్న ఉత్తర్వులు ఇందులో భాగమే. హెచ్1 బి వీసాలపై ఆంక్షలను సుందర్ పిచాయ్ వంటి అమెరికన్ కార్పొరేట్ కంపెనీల సిఇఒలు తీవ్రంగా విమర్శించారు.

అమెరికన్ పౌరుల్లో ఒకప్పుడు 12 శాతం (1965) ఉన్న శ్వేతేతరులు ఇప్పుడు 39 శాతానికి పెరిగారు. వారి మీద తెల్లజాతి వారిలో అదే పనిగా ద్వేషాన్ని ట్రంప్ రెచ్చగొడుతున్నాడు. అమెరికాలో శరీర శ్రామికులుగా, సేవకులుగా పనిచేసే మెక్సికన్ల మీద కక్షతో వ్యవహరిస్తున్నాడు. మెక్సికోకు అమెరికాకు మధ్య శాశ్వతమైన గోడ కడతానని చెప్పుకున్న ‘గొప్పతనం’ ట్రంప్‌దే. అయితే హద్దులు మీరి ఇష్టావిలాసంగా సాగిపోతున్న ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం ఈ సారి ఆయనకు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చనే అంచనాలు వినవస్తున్నాయి. దేశం లో నిరుద్యోగం దారుణ స్థాయికి పేట్రేగిపోడం ట్రంప్‌ను ఎన్నికల్లో దెబ్బ తీసే మరో అంశం కానున్నది. అమెరికాను పారిస్ ఒప్పందం నుంచి వైదొలగించడం, డబ్లుహెచ్‌ఒ వంటి ఐక్యరాజ్య సమితి సంస్థల నుంచి ఉపసంహరించుకోడం వంటి నిర్ణయాలు కూడా ట్రంప్ అవకాశాలను దెబ్బ తీయవచ్చు. అయితే ఎన్నికలకు ఇంకా 4 మాసాల వ్యవధి ఉన్నందున ఆలోగా సంభవించే పరిణామాలు కూడా వాటిపై ప్రభావం చూపుతాయి. ట్రంప్ అధికారంలో కొనసాగడానికి ఎన్ని కుయుక్తులనైనా పన్నే అవకాశాలు లేకపోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News