Monday, April 29, 2024

భారత్‌కు ప్రయాణించవద్దు: బైడెన్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

భారత్‌కు ప్రయాణించవద్దు
సురక్షితం కాదనుకుంటే వెంటనే వచ్చేయండి
అమెరికన్ పౌరులకు బైడెన్ ప్రభుత్వం సూచనలు
భారత్‌లో కొవిడ్-19 పరిస్థితిపై అమెరికా ఆందోళన

వాషింగ్టన్: అమెరికన్ పౌరులెవరూ భారతదేశానికి ప్రయాణించవద్దని, అలాగే భారతదేశంలోని అమెరికన్ పౌరులతోపాటు తమ దౌత్య కార్యాలయాలలో పనిచేస్తున్న అమెరికన్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సాధ్యమైనంత త్వరగా సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. కొవిడ్-19 కేసులు తీవ్రరూపం దాలుస్తున్న దరిమిలా భారత్‌లో వైద్య సదుపాయాల కల్పన పరిమితంగా మారుతోందని బైడెన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌కు రాకపోకలను లెవల్ 4(అమెరికా విదేశాంగ ప్రకారం ఇదే అత్యంత ప్రమాదకర హెచ్చరిక)గా అమెరికా నిర్ణయించింది.
భారత్‌లో కరోనా వైరస్ పరిస్థితి ఆందోళనకరంగా పరిణమించిన నేపథ్యంలో అమెరికా పౌరులెవరూ భారత్‌కు ప్రయాణించరాదని, అలాగే భారత్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షితమని భావిస్తే సాధ్యమైనంత త్వరగా తిరిగి రావాలని అమెరికా ప్రభుత్వం కోరింది. అంతేగాక భారత్ మిషన్‌లో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా తిరిగిరావాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. న్యూఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత, ముంబయిలోని అమెరికన్ కాన్సులేట్స్ జనరల్ కార్యాలాయాలు తెరిచే ఉంటాయని, అత్యవసర కాన్సులర్ సర్వీసులను సమకూరుస్తాయని అమెరికా ప్రభుత్వం తెలిపింది.
కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్టా భారత్‌లో వైద్య సదుపాయాలు చాలా పరిమితంగా లభిస్తున్నాయని, అమెరికాకు తిరిగిరావాలని భావిస్తున్న అమెరికా పౌరులు పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా అమెరికాకు నేరుగా వాణిజ్య విమానాలు అందుబాటులో ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. న్యూఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ ఒక ప్రకటనలో ఇదే విషయాన్ని తెలియచేస్తూ భారత్‌లో ఆరోగ్య, భద్రతకు సంబంధించి ఎంబసీకి సంబంధించిన కీలక సమాచారం పొందగోరే అమెరికన్ పౌరులు స్టెప్(స్మార్ట్ ట్రావెలర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్)లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ప్రయాణ ఆంక్షలపై తాజా సమాచారం కోసం భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కూడా తన పౌరులను అమెరికా కోరింది.
భారతదేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని, అనేక ప్రాంతాలలో కొవిడ్-19 టెస్టింగ్ సదుపాయాలు చాలా పరిమితంగా ఉన్నాయని అమెరికన్ ఎంబసీ పేర్కొంది. కొవిడ్ రోగులతోపాటు కొవిడ్ లేని రోగులకు సైతం ఆక్సిజన్, పడకలకు కొరత ఏర్పడుతున్నట్లు ఆసుపత్రులు చెబుతున్నాయని, పడకలు లేని కారణంగా కొన్ని నగరాలలోని ఆసుపత్రులలో అమెరికన్ పౌరులను చేర్చుకోవడం లేదని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు కర్ఫూలు, ఇతర ఆంక్షలను విధించడంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోందని తెలిపింది.

Americans to leave India: Biden Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News