Monday, April 29, 2024

అర్నబ్ అరెస్టుపై బిజెపి-కాంగ్రెస్ మాటల యుద్ధం

- Advertisement -
- Advertisement -

అర్నబ్ అరెస్టుపై బిజెపి-కాంగ్రెస్ మాటల యుద్ధం
ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి:బిజెపి
ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది: అమిత్ షా
కాంగ్రెస్‌ను దేశ ప్రజలు క్షమించరు: జెపి నడ్డా
బిజెపికి కొందరిపైనే ఎందుకీ ప్రేమ: కాంగ్రెస్

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్టుపై బిజెపి, కాంగ్రెస్ మధ్య బుధవారం మాటల యుద్ధం నెలకొంది. అర్నబ్ అరెస్టు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ బిజెపి ఆరోపించగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఆరోపణలను తిప్పికొడుతూ బిజెపి సంకుచిత దృక్పథాన్ని ఇది బయటపెడుతోందంటూ విమర్శించింది. కాగా, అర్నబ్ గోస్వామి ఆకస్మిక అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండిస్తూ 47 ఏళ్ల అర్నబ్ పట్ల పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, మీడియా చేసే విమర్శల పట్ల ప్రభుత్వ అధికారాన్ని చూపించకూడదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు పిలుపు ఇచ్చింది.  అర్నబ్ గోస్వామి అరెస్టు బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తదితరులు ముంబయి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్నబ్ అరెస్టు ఎమర్జెన్సీ రోజుల నాటి అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోందని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్యాన్ని మరోసారి అవమానించాయని ఆయన విమర్శించారు. రిపబ్లిక్ టివి, దాని ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై అధికార దుర్వినియోగానికి పాల్పడడం వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైన పత్రికా స్వేచ్ఛపై దాడి జరపడమేనని ఆయన పేర్కొన్నారు. ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందని, పత్రికా స్వేచ్ఛపై దాడిని వ్యతిరేకించాల్సిందేనని ఆయన ట్వీట్ చేశారు.

దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీని భారత్ ఎన్నడూ క్షమించలేదని, పత్రికా స్వేచ్ఛపై దాడి చేసిన రాజీవ్ గాంధీని భారత్ ఎన్నడూ క్షమించలేదని, ఇప్పుడు జర్నలిస్టులపై అధికార బలంతో వేధిస్తున్న సోనియా-రాహుల్ గాంధీని భారత్ మరోసారి శిక్షిస్తుందంటూ బిజెపి అధ్యక్షుడు నడ్డా ట్వీట్ చేశారు. అర్నబ్ గోస్వామి అరెస్టు జరిగిన తీరు కా్ంరఎస్ పార్టీ, మహారాష్ట్ర ప్రభుత్వ మనస్తత్వాన్ని తెలియచేస్తుందని, ప్రజాస్వామ్య, జర్నలిజం సిద్ధాంతాలపై ఇది గొడ్డలిపెట్టని, దీన్ని తాను ఖండిస్తున్నానని నడ్డా పేర్కొన్నారు. గోస్వామి అరెస్టును పత్రికా స్వేచ్ఛపై దాడిగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ అభివర్ణించారు. ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందంటూ ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని తాము ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరాని కూడా అర్నబ్ గోస్వామి అరెస్టును ఖండించారు. అర్నబ్ అరెస్టును మీడియాలో ఉన్న వారు ఖండించకపోతే వారు వ్యూహాత్మకంగా ఫాసిజాన్ని బలపరచిన వారవుతారని ఆమె వ్యాఖ్యానించారు. అర్నబ్‌ను మీరు ఏకీభవించినా లేకున్నా ఆయన అరెస్టు మీరు మౌనందాలిస్తే అణచివేతను సమర్థించిన వారవుతారని ఆమె అన్నారు. అర్నబ్ అరెస్టును అవాంఛనీయంగా, ఆందోళనకరమైన పరిణామంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభివర్ణించారు. మహారాష్ట్రలోని తన ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను నిర్లజ్జగా దుర్వినియోగం చేస్తుంటే కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎదురుదాడి:
అర్నబ్ గోస్వామి అరెస్టుపై తమను బిజెపి విమర్శించడాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. పత్రికా స్వేచ్ఛపై సంకుచిత దృక్పథంతో బిజెపి వ్యవహరిస్తోందని, ఈ కేసులో అర్నబ్ గోస్వామిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనంగా ఉప్పు, చపాతీలను పెడుతున్న దారుణ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్టును నెలల తరబడి జైలు పాలుచేస్తే బిజెపి నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఆమె ప్రశ్నించారు. బిజెపి నాయకులు ఉద్దేశపూర్వకంగా కొందరిపైనే అమిత ప్రేమ ఒలకపోయడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ ఆమె వ్యాఖ్యానించారు. జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు బనాయిస్తే ఈ బిజెపి నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ బుధవారం నాడిక్కడ మీడియా సమావేశంలో సుప్రియా శ్రీనాథ్ ప్రశ్నించారు. వారణాసిలోని ఒక గ్రామంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులను వెలుగులోకి తెచ్చిన స్క్రోల్ జర్నలిస్టు సుప్రియా శర్మపై కేసు బనాయిస్తే బిజెపి ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. యుపిలో పిపిఇ కిట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన ఒక పత్రికా విలేకరిపై దేశద్రోహం కేసులను పెట్టి జైలు పాల్జేస్తే బిజెపి నాయకులు ఎవరూ పెదవి విప్పలేదని ఆమె మండిపడ్డారు. ప్రత్యేకంగా కొందరిపైన ప్రేమ చూపిస్తూ బిజెపి సాగిస్తున్న సంకుచిత దృక్పథాన్ని అవాంఛనీయంగా ఆమె అభివర్ణించారు. తమపై విమర్శలు గుప్పిస్తున్న బిజెపి నాయకులు తమ వైఖరికి తామే సిగ్గుపడాలని ఆమె వ్యాఖ్యానించారు. తాను కూడా రెండు దశాబ్దాల పాటు జర్నలిజంలో ఉన్నానని, అర్నబ్ గోస్వామి జర్నలిజాన్ని అపత్రిష్టపాల్జేశారని ఆమె ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే హక్కు బిజెపికి లేదని ఆమె చెప్పారు. ప్రకటనల ద్వారా, వేధింపులు, భయాందోళనలకు గురి చేయడం ద్వారా మీడియాను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ సొంతంగా లేదా మిత్రపక్షాలతో కలసి అధికారంలో ఉన్న చోట అమాయకులను శిక్షించే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. అర్నబ్ కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె తెలిపారు.

Amit Shah fires over Arnab Goswami Arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News