Sunday, April 28, 2024

సంపాదకీయం: అమిత్ షా చెన్నై యాత్ర

- Advertisement -
- Advertisement -

Arcep Regional Comprehensive Economic Partnership

తమిళనాడులో ఆరు మాసాల ముందే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలైనట్టుంది. చలి ముదిరిన సమయంలో రాజకీయ వేడి ఊపందుకునేటట్టు కనిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యూహ కర్త అమిత్ షా మొన్న శనివారం నాడు చెన్నైలో జరిపిన పర్యటన ఈ విషయాన్ని చాటింది. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జరిగే శాసన సభ ఎన్నికలకు పాలక ఎఐఎడిఎంకెతో బిజెపి పొత్తు కొనసాగుతుందని స్పష్టమైంది. ముఖ్యమంత్రి ఎలప్పడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం స్వయంగా ఈ సంగతిని ప్రకటించారు. అమిత్ షాకు ఘన స్వాగతం ఇచ్చి విమానాశ్రయం నుంచి ఆయన వెళ్లిన దారి పొడుగునా విశేషంగా జనాన్ని సమీకరించిన తీరు ఎన్నికల ప్రచార ప్రారంభ ఆర్భాటాన్ని ప్రతిబింబించింది.

దేశంలోనే అతి గొప్ప పాలన సాగుతున్నది తమిళనాడులోనేనని అమిత్ షా కొనియాడారు. డిఎంకె, కాంగ్రెస్‌ల మీద విరుచుకుపడ్డారు. నిరూపణ కాని 2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ఆరోపణను వాటిపై సంధించారు. తమిళనాడులో సొంతంగా వ్రేళ్లు పాతుకొని అధికారంలోకి రావాలన్నది భారతీయ జనతా పార్టీ చిరకాల కోరిక. ఆర్య వ్యతిరేక భావజాలానికి, హిందీ భాష పెత్తనాన్ని నిరసించిన మహోద్యమానికి వేదిక అయిన తమిళనాడు ప్రజల మద్దతను చూరగొనడం ద్వారా దక్షిణ భారత విజేతగా చాటుకోవాలన్న ఆకాంక్ష బిజెపిలో ఉన్నదే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ జయలలిత ఆకస్మిక మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితులను ఉపయోగించుకొని అందుకు వ్యూహ రచన చేసుకున్నది. జయలలిత కుడిభుజంగా, ఆంతరంగికురాలుగా ఉండి ఎఐఎడిఎంకెలో విశేష ప్రాబల్యం గడించిన శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో అధికారంలోని ఆ పార్టీకి అండగా ఉండి అంతః కలహాలతో మునిగిపోకుండా దాని పాలక పడవను కాపాడే బాధ్యతను 2017లో బిజెపి తీసుకున్నది.

కోర్టు తీర్పుల నేపథ్యంలో జయలలిత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చిన రెండు సందర్భాల్లో ఆమె ఆశీస్సులతో ఆ పీఠం అధిరోహించిన పన్నీరు సెల్వంకు, ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామికి సయోధ్య కుదిర్చిన ఖ్యాతి కూడా బిజెపిదే అని చెప్పక తప్పదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎఐఎడిఎంకె ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో వీరిద్దరి మధ్య నెల రోజుల క్రితం తలెత్తిన విభేదాలను సద్దుమణిగించి భవిష్యత్తులోనూ ఇప్పటి ఏర్పాటే కొనసాగేలా అంగీకారం కుదిర్చింది కమలనాథులే. ఈ విధంగా తమిళనాడు ప్రభుత్వాన్ని చెప్పుచేతల్లో నడిపించుకుంటున్న బిజెపి ఆ రాష్ట్ర ప్రజల మద్దతును సాధించుకోడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. ఈ మధ్యనే అద్వానీ రామ రథయాత్ర మాదిరిగా తమిళనాడులో మురుగన్ యాత్ర తీయాలని ఆ రాష్ట్ర బిజెపి సంకల్పించిన ఘట్టానికి ఎఐఎడిఎంకె ప్రభుత్వం అనుమతి నిరాకరించిందంటే అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బ తీయరాదనేదే అందుకు కారణం. బిజెపి కఠిన హిందుత్వకు, పెరియార్ పెంచి పోషించిన ద్రావిడోద్యమ ఆశయాలకు బొత్తిగా కుదరదు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు, దళితుడైన మురుగన్ ఈ విషయాన్ని గ్రహించి అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా పెరియార్ పట్ల గౌరవాన్ని కూడా ప్రకటించాడు.

ఆయన నాస్తికత్వంతో తాము ఏకీభవించంగాని ఆయనంటే తమకెంతో గౌరవమని ప్రకటించాడు. అయినా ఆయన తలపెట్టిన మురుగన్ యాత్రను మాత్రం ప్రభుత్వం అనుమతించలేదు. ఆయనను అరెస్టు చేసింది. ఇంత జరిగినప్పటికీ బిజెపి కేంద్ర నాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎఐఎడిఎంకెనే తోడు చేసుకోవాలని నిర్ణయించడం దాని ముందు చూపుకి, రాజకీయ వ్యూహ చతురతకు నిదర్శనం. అక్కడి ప్రజల్లో జయలలితకు, ఆమె పార్టీకి గల విశేష ఆదరాభిమానాలే అందుకు కారణం. బీహార్‌లో నితీశ్ కుమార్ భుజాల మీద ఊరేగి ఈ రోజున జెడి(యు)ని తొక్కివేసి తనదే పై చేయి చేసుకున్న మాదిరిగా తమిళనాడులో నడిపించుకోడం మాత్రం బిజెపికి సులభ సాధ్యం కాదు. ఎఐఎడిఎంకె పదేళ్లుగా అక్కడ అధికారంలో ఉంది. జయలలిత 2016 ఎన్నికల్లో మళ్లీ గెలిచి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతవరకు డిఎంకె, ఎఐఎడిఎంకెలలో ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం అత్యంత అరుదైన విషయంగా ఉండేది.2016 ఎన్నికల్లో ఎఐఎడిఎంకెకి 136, డిఎంకెకి 98 స్థానాలు వచ్చాయి.అప్పటి నుంచి డిఎంకె బలపడుతూ వచ్చింది.గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎఐఎడిఎంకె, బిజెపి కలిసి పోటీచేసి కేవలం ఒక్క స్థానా న్ని మాత్రమే గెలుచుకోగలిగాయి.ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో కరుణానిధి వారసుడైన స్టాలిన్ నాయకత్వంలో డిఎంకె మరింత గట్టి పోటీ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. వరుసగా మూడోసారి ఎఐఎడిఎంకె అధికారంలోకి వచ్చేలా చేయడం ఆ పార్టీ నాయకత్వానికి దానికి అండదండగా ఉన్న బిజెపి కేంద్ర వ్యూహ కర్తలకు సాధ్యమవుతుందా అనేది కీలకమైన ప్రశ్న.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News