Friday, May 17, 2024

సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు మొహరింపు..

- Advertisement -
- Advertisement -

సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు
అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో

China has deployed 60000 Soldiers at Ladakh Border

వాషింగ్టన్: చైనా తన పొరుగుదేశం భారత్ పట్ల తీవ్రస్థాయి కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శించారు. భారత్ సరిహద్దుల వెంబడి ఉత్తరదిశలో చైనా ఇప్పటికే దాదాపు 60000 మంది సైనికులను రంగంలోకి దింపిందని అమెరికా మంత్రి ఆరోపించారు. చైనా వక్రబుద్ధి పలు విషయాలలో స్పష్టం అవుతోందని, ఆ దేశ దుందుడుకు వైఖరితో అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ దేశాల సమీకరణకు ముప్పు వాటిల్లుతోందని మైక్ పాంపియో తెలిపారు. మంగళవారం ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశం అయ్యారు. కరోనా వైరస్ క్రమంలో వీరు ముఖాముఖి కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఇండో పసిఫిక్, సౌత్ చైనా సీ వీటికి తోడుగా భారత్ సరిహద్దులలో చైనా అతిక్రమణల సైనిక చర్యలతో తలెత్తుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో క్వాడ్ కీలక భేటీ జరిగింది. టోక్యో నుంచి తిరిగి అమెరికాకు చేరిన తరువాత విదేశాంగ మంత్రి పాంపియో గే బెన్సన్ షోలో మాట్లాడారు. సరిహద్దులలో 60వేల మంది చైనా సైనికులు తిష్టవేసుకుని ఉనన విషయం భారత్ స్పష్టంగా చూడగల్గుతోందని చెప్పారు. ఇంత మంది సైనికులను మొహరించుకున్న చైనా విషయంలో భారత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఈ దశలో భారత్‌కు అమెరికా సాయం మరింతగా అవసరం అని పాంపియో అభిప్రాయపడ్డారు తాను టోక్యోలో భారత్, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో పలు అంశాలపై సమీక్ష జరిపినట్లు, చైనా నుంచి తలెత్తుతున్న పలు విపత్కర పరిణామాలపై చర్చించినట్లు వివరించారు. ఆయా ప్రాంతాలలో చైనా కమ్యూనిస్టు పార్టీ తమ బలగాల ద్వారా తీవ్రస్థాయి ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని పాంపియో అభిప్రాయపడ్డారు. భారతవిదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి సమగ్ర చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు మరింత కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని , ఇదే క్రమంలో ప్రపంచ స్థాయిలో భద్రతా వికాస స్థాపనకు పాటుపడటంపై మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమెరికాలోని గత ప్రభుత్వాలు తరచూ చైనా చేష్టలకు తలొగ్గుతూ వచ్చాయని, ఈ క్రమంలో అమెరికా మేధో ఆస్తులను , లక్షలాది ఉద్యోగాలను ఆ దేశం కబళించిందని పాంపియో ఆరోపించారు. అన్ని ప్రయోజనాలు చైనాకు దక్కేలా చేశారని పాంపియో గతపాలకులపై మండిపడ్డారు. సరిహద్దులలో చైనాతో తలెత్తిన పరిస్థితుల తరుణంలోనే అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ఈ నెల 26న భారత్‌కు వస్తున్నారు. రెండు రోజుల పాటు వారు భారత్‌లో పలు అధికారిక చర్చలు జరుపుతారు.

China has deployed 60000 Soldiers at Ladakh Border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News