Sunday, April 28, 2024

ఖాకీలను వెంటాడుతున్న కరోనా

- Advertisement -
- Advertisement -

 

ఆరుగురు సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి
ఏకంగా మహారాష్ట్రలో 714 మందికి వైరస్
రాష్ట్రంలో పోలీసుల అప్రమత్తం

మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తూ దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 10మందికి పైగా ప్రాణాలు సైతం కోల్పోయారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా భూతం సుమారు 700 మంది పోలీసులుకు సోకింది. వారిలో ఐదుగురు మరణించారని రాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు తమ శాఖలోనే 648 యాక్టివ్ కేసులు నమోదైనట్టు పోలీసు శాఖ పేర్కొంది. ఒక్క ముంబైలోనే 55 ఏళ్ళు దాటిన పోలీసులను ఇళ్లలోనే ఉండాల్సిందిగా ఈ శాఖ ఉన్నతాధికారులు కోరారు. ముగ్గురు పోలీసులు ఇటీవల కరోనాతో మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో కరోనా ప్రభావం మహారాష్ట్రలో అధికంగా ఉన్న విషయంవిదితమే. మహారాష్ట్రలో 19,063 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా వారిలో 714 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు గుర్తించారు. ముంబైలోని వడాలా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వారిలో 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సీనియర్ ఇన్‌స్పెక్టర్ షాహాజీ షిండే తెలిపారు.

వడాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు రెడ్‌జోన్లతోపాటు నాలుగు మురికివాడలు కూడా ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం ద్వారానే పోలీసులకు వైరస్ సంక్రమించి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రెడ్‌జోన్ పరిధిలోని ప్రజలకు పోలీసులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని, ఈ సందర్భంగా కరోనా బాధితుడి నుంచి వారికి వైరస్ సోకి వుంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీలో కరోనా విధుల్లో ఉన్న పోలీసులకు వైరస్ సోకడంతో 30 మంది పోలీసులు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు ఎఎస్‌ఐలతోపాటు ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారితో సన్నిహితంగా మెలిగిన డిసిపి సహా 30 మందిని ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్ ఉండాలని ఆదేశించారు.

సిఐఎస్‌ఎఫ్‌లో ః

సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన అసిత్ కుమార్ అనే అధికారి కరోనా కారణంగా కోల్‌కతలో మృతి చెందారు. కోల్‌కత మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అసిత్ కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. కాగా అసిత్‌తో సన్నిహితంగా మెలిగిన మరో 50 మంది పోలీసు సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతలోని ఇండియన్ మ్యూజియం వద్ద అసిస్టెంబ్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకు స్థాయిలో అసిత్ విధులు నిర్వర్తిస్తున్నారు. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద విధుల్లో ఉన్న మరో అధికారి కరోనాతో మృతి చెందాడు. ఇప్పటివరకూ 531 మంది పోలీసులకు కరోనా (కోవిడ్-19) పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కాగా వారిలో 39 మంది కోలుకున్నారు. వీరిలో 51 మంది పోలీసు అధికారులున్నారని, 480 మంది కానిస్టేబుళ్లకు ఈ మహమ్మారి సోకిందని అధికారులు వెల్లడించారు. ప్రాణాంతక వైరస్ బారినపడి మరణించిన పోలీసుల సంఖ్య ఐదుకు పెరిగిందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.

క్వారంటైన్‌లో క్రైం బ్రాంచ్ పోలీసులు

తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ కు చెందిన ఇద్దరు పోలీసులకు కరోనా సోకింది. వీరిద్దరికీ కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరితో పాటు క్రైమ్ బ్రాంచ్ టీమ్ లోని మరో 12 మందిని క్వారంటైన్ కు పంపించారు. వీరితో కలిపి ఢిల్లీలో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 100 దాటిందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి.

రాష్ట్రంలో అప్రమత్తం ః

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధి నిర్వహణలో ఉన్న నలుగురు పోలీసులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈక్రమంలో సైఫాబాద్, చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ సోకడంతో పోలీసు శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఈక్రమంలో దాదాపు వీరితో పాటు విధులు నిర్వహించిన 20మంది పోలీసులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కరోనా వైరస్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు బాసులు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News