Thursday, May 9, 2024

మరో 15 రోజుల్లో తరలించాలి

- Advertisement -
- Advertisement -

Evacuation of Migrant workers must be completed within 15 days

 

వలస కూలీలపై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకు పోయిన వలస కూలీల తరలింపు మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్న తర్వాత వారి పూర్తి వివరాలు గ్రామాల వారీగా నమోదు చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా వారికి తగిన ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం జారీ చేస్తామని తెలిపింది. వలస కూలీల అంశాన్ని సూమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఈ విధంగా స్పందించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను న్యాయస్థానానికి తెలియజేశారు. దేశవ్యాప్తంగా జూన్ 3వ తేదీ నాటికి 4,228 శ్రామిక్ రైళ్ల ద్వారా 57లక్షల మంది వలస కార్మికలును వారి స్వస్థలాలకు చేర్చినట్లు సొలిసిటర్ జనరల్ తెలియజేశారు.

మరో 41 లక్షల మంది సొంత వాహనాలతో స్వస్థలాలకు తరలి వెళ్లారని తెలిపారు. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ వీరిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రాలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా మరో 171 శ్రామిక్ రైళ్లకోసం రాష్ట్రాలనుంచి విజప్తులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్రనుంచి మరో ఒక్క రైలుకోసమే విజ్ఞప్తి వచ్చినట్లు చెప్పడంతో సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే మహారాష్ట్రనుంచి ఇప్పటికే 802 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు సొలిసిటర్ జనరల్ సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా పలు రాష్ట్రాలు వలసకార్మికుల తరలింపు కోసం తీసుకొంటున్న చర్యలను న్యాయస్థానం ముందుంచాయి. ఇప్పటివరకు 21 లక్షల 69 వేల మంది వలస కూలీలను స్వరాష్ట్రానికి తీసుకు వచ్చినట్లు యుపి తెలపగా, 28లక్షల మంది వలస కూలీలు వెనకి వచ్చినట్లు బీహార్ తెలిపింది. ఇప్పటికే 11 లక్షల మందిని తరలించామని, మరో 38 వేల మందిని తరలించాల్సి ఉందని మహారాష్ట్ర తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 22లక్షల మంది వలస కూలీల్లో 20.5 లక్షల మందిని తరలించినట్లు గుజరాత్ తెలిపింది. కాగా ఢిల్లీనుంచి 3 లక్షల మందిని పంపించామని, మరో 2లక్షల మంది వలస కూలీలు ఉన్నారని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News