Monday, April 29, 2024

ఒకటి నుంచి 8 తరగతుల సిబిఎస్‌ఇ విద్యార్థులకు పరీక్షలు రద్దు

- Advertisement -
- Advertisement -

cbse

 

పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్
9, 11 తరగతులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు
తర్వాత 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఇ)కి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఆదేశించింది. అలాగే పాఠశాలల్లో గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా 9,11 తరగతుల విద్యార్థులను సైతం ప్రమోట్ చేయాలని సూచించింది. పరీక్షలకు హాజరరు కాని 9,11 తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేయొద్దని తెలిపింది. 29 ప్రధాన సబ్జెక్టులకే సిబిఎస్‌ఇ బ్డ్రో పరీక్షలు నిర్వహిస్తుందని హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోబ్రియాల్ నిశాంత్ తెలిపారు. వర్సిటీ ప్రవేశాలు, ప్రమోట్‌కు అవసరమైన సబ్జెక్టులకే పరీక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. ముందస్తు సమాచారం ఇచ్చి బోర్డు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మిగతా సబ్జెక్టులకు సిబిఎస్‌ఇ పరీక్షలు నిర్వహించదనని తెలిపారు.

కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా సిబిఎస్‌ఇ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిబిఎస్‌ఇ కార్యదర్శి అనురాగ్ త్రిపతి ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సిబిఎస్‌ఇ అనుబంధ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌సిటిఇని సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్‌ఇ వెల్లడించింది. సిబిఎస్‌ఇ పాఠశాలల్లో 9, 11 తరగతుల విద్యార్థులకు ఇప్పటికే కొన్ని పాఠశాలలు పరీక్షలు నిర్వహించి, మూల్యాంకనం కూడా నిర్వహించాయని తెలిపారు.

అయితే ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించని పాఠశాలలు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పాఠశాల స్థాయి పరీక్షలు నిర్వహించి 9,11 తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 10,12 తరగతులకు బోర్డు పరీక్షలు కూడా నిర్వహించే పరిస్థితి లేదని తెలిపారు. 10,12 తరగతుల పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకటించలేమని స్పష్టం చేశారు. ఉన్నత విద్య ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల తేదీలను సమీక్షించి, ఉన్నత విద్యకు సంబంధించిన అధికారులకు సంప్రదించిన తర్వాతనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు. 10,12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని పాఠశాలలకు 10 రోజుల ముందుగానే అందజేస్తామని తెలిపారు.

పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్‌పాస్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు రాష్ట్రాలు ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఆల్‌పాస్ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి 8వ తరగతి చదువుతన్న విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ అయ్యే అవకాశం కల్పించింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను వార్షిక పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పాత మైసూరు ప్రాంతంలోని సిబిఎస్‌ఇ పాఠశాలల్లో ఈ సారి పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పాస్ చేయాలని నిర్ణయించారు.

From 1st to 8th grade exams canceled
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News