Monday, April 29, 2024

ఉద్యోగులకు ఫుల్ సాలరీ

- Advertisement -
- Advertisement -

Full Salaries for Government Employees

 

పెన్షనర్లకూ వర్తింపు, ఆదాయం మెరుగుపడడంతో వేతనాల్లో కోతలు వద్దని సిఎం కెసిఆర్ ఆదేశాలు
ముఖ్యమంత్రి ప్రకటనపై తెలంగాణ ఉద్యోగుల జెఎసి హర్షం, కృతజ్ఞతలు తెలిపిన పిఆర్‌టియు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆదాయం పరిస్థితి కొంచెం, కొంచెం మెరుగవుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూన్ నెలకు పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీంతో జూలై నెలలో ఉద్యోగులకు పూర్తి వేతనం, పెన్షనర్లకు పూర్తి పెన్షన్ అందనుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌లపై ఐదు రోజుల కిందటే ప్రభుత్వ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీంతో ఈ నెలకు కూడా కోత తప్పదేమోనని ఉద్యోగులు భావించారు. అయితే కోర్టులో చట్ట ప్రకారమే జీతాల్లో వాయిదా విధించామని చెప్పేందుకు ఆర్డినెన్స్ జారీ చేసినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు సిఎం నిర్ణయంతో ఉద్యోగుల నుంచి సంతోషం వ్యక్తమౌతోంది. ప్రతినెలా జీతాలకు, పెన్షన్‌లకు రూ.2500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. లాక్‌డౌన్ మొదలైన మార్చి 23 నుంచి ప్రభుత్వానికి పూర్తిగా ఆదాయం పడిపోయింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల నుంచి జీతాల్లో ప్రభుత్వం కోత విధించింది. ఏప్రిల్, మే నెలల్లోనూ కోత కొనసాగింది. అయితే సడలింపులు ఇవ్వడం, ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. ఇటీవల ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్‌లో గరిష్టంగా 50 శాతం కోత విధించేలా ఆర్డినెన్స్ రూపొందించారు. సిఎంతో సహా ఇతర ప్రజాప్రతినిధులందరి వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల్లో ఐఎఎస్, ఐపిఎస్‌ల వేతనాల్లో 60 శాతం కట్ చేశారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో 5-0 శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 10 శాతం కోత విధించారు. అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల పెన్షనర్లకు మొదట 50 శాతం కోత విధించారు. అయితే తరువాత దీనిని ప్రభుత్వం 25 శాతానికి కుదించింది. నాలుగో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌లలో 10 శాతం కోత విధించారు. జూలై నెలలో పూర్తిస్థాయి జీతం అందుకోనున్నారు. ఈ మేరకు ట్రెజరీ బిల్లులు ఆర్థిక శాఖ అధికారులు తయారు చేశారు. అయితే ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత కొనసాగుతుందా ? లేదా అనేది స్పష్టత రాలేదు. అయితే మూడు నెలల్లో కోత విధించిన మొత్తాన్ని వాయిదా పద్ధతిలో ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News