Monday, April 29, 2024

గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గర్భాశయ(సర్వైకల్) క్యాన్సర్‌ను నివారించేందుకు 9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. దేశంలో గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించిన కేసులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గత నెలలో ప్రకటించింది. ఈ విషయమై రాష్ట్రాలతోపాటు వివిధ ఆరోగ్య విభాగాలతో నిత్యం సందప్రదింపులు జరుపుతున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం 9-14 ఏళ్ల వయసున్న బాలికలకు వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రపంచ మహిళా జనాభాలో 16 శాతం మంది భారత్‌లో నివసిస్తున్నారు. అయితే అన్ని రకాల గర్భాశయ క్యాన్సర్ కేసులలో దాదాపు పావు వంతు భారత్‌లోనే ఉన్నాయి.

కాగా..కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకటనను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సిఇఓ అదార్ పూనావాలా స్వాగతించారు. 9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేట్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన అభినందించారు. హెచ్‌పివిని నిరోధించి, వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి సులభంగా తీసుకురావడానికి అందరం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆశా, గంగన్వాడి కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడం, మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం, ప్రసూతి, శిశు ఆరోగ్య రక్షణ పథకాలను క్రమబద్ధం చేయడం వంటి చర్యలు ఆరోగ్య రంగం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపుతున్నాయని ఆయన ప్రశంసించారు. కాగా..తాజా గణాంకాల ప్రకారం ఏటా దేశంలో దాదాపు 80,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారినపడుతుండగా 35,000 మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో గర్భాశయ క్యాన్సర్ నిరోధానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సెర్వవాక్ అనే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ప్రైవేట్ మార్కెట్‌లో దీని ధర డోసుకు రూ. 2,000 వరకు ఉంది. మెర్క్ షార్ప్ అండ్ డోహ్మె(అమెరికా, కెనడాలో మెర్క్ అండ్ కో.ఐఎన్‌సిగా పిలిచే)కు చెందిన ఎంఎస్‌డి ఫార్మసీ సంస్థ భారత్‌లో విక్రయిస్తున్న హెచ్‌పివి వ్యాక్సిన్ గార్డాసిల్ 4 డోసు ధర రూ.3,927 ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News