Sunday, April 28, 2024

గోల్కొండ కోట-కుతుబ్‌షాహీ టూంబ్స్ సొరంగ మార్గాన్ని తెరిపించాలి..

- Advertisement -
- Advertisement -

Have to Reopen Golconda Fort-Qutub Shahi Tombs tunnel

మనతెలంగాణ/హైదరాబాద్: కుతుబ్‌షాహీల కాలంలో గోల్కొండ కోట నుంచి కుతుబ్‌షాహీ టూంబ్స్(తమ వంశీకుల సమాధులున్న ప్రాంతం) వద్ద రాజులు ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాన్ని తిరిగి తెరిపించాలని ఎంపి అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నారు. గురువారం చారిత్రక కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్ ప్రాంగణంలో పర్యాటకుల కోసం ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ (భూగర్భనిర్మాణాని)కి సంబంధించి మంత్రులు కెటిఆర్, తలసాని, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీలు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సొరంగ మార్గాన్ని తెరిపిస్తే పర్యాటకులకు ఆకట్టుకుంటుందని భావించిన ఎంపి అసదుద్దీన్ ఇదే విషయాన్ని మంత్రుల వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. దీనిపై మంత్రులు కూడా ఆసక్తి కనబరిచనట్టుగా సమాచారం. త్వరలో ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రులతో పాటు ఎంపి అసదుద్దీన్ కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సమాధుల నుంచి 300 మీటర్ల దూరంలో ఈ సొరంగం మొదలవుతోంది. గోల్కొండ కోటలోని పటాన్‌చెరు వరకు ఈ సొరంగం ఉంటుందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక ఈ కోటకు వచ్చే టూరిస్టులకు ఈ మార్గాన్ని పరిచయం చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పర్యాటకులను ఆకర్శించవచ్చని మంత్రులతో పాటు ఎంపిలు భావిస్తున్నారు. భూగర్భ నిర్మాణం పూర్తయ్యే లోపు ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ నిర్మాణం
కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్‌లో, భూగర్భంలో నిర్మించే ఈ ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ నిర్మాణం దాదాపు 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పూర్తిగా భూమిలోనే ఉంటుంది. దానిపై స్లాబుపై ఉద్యానవనాలు, పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తారు. ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్చరల్ సంస్థ స్టూడియో లోటస్ ఈ డిజైన్‌ను అందించింది. కుతుబ్‌షాహి టూంబ్స్ ప్రపంచ వారసత్వ సంపద, దీనికి సమాంతరంగా నిర్ధేశిత పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలులేకుండా నిబంధనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భూగర్భ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ పిల్లల కోసం చిల్ట్రన్ గ్యాలరీలు, ఫలహార శాలలు, ఫిల్మ్ స్క్రీనింగ్ గదులు, మల్టీపర్సస్ గ్యాలరీ కోర్టులు ఇందులో నిర్మించనున్నారు. చారిత్రక వస్తువులతో కూడిన చిన్న మ్యూజియం కూడా ఇక్కడ ఉంటుంది.

Have to Reopen Golconda Fort-Qutub Shahi Tombs tunnel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News