Sunday, April 28, 2024

జిహెచ్‌ఎంసి ఎన్నికలకు భారీ భద్రత

- Advertisement -
- Advertisement -

Huge Police security for GHMC elections

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 50,500 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 38 డివిజన్లు, 20.5లక్షల ఓటర్లు ఉండగా, 19 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 2,569 పోలింగ్ స్టేషన్లు, 674 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. 243 పోలింగ్ లొకేషన్లలో 770 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నాయి. 179 రూట్ మొబైల్ పోలీసులను కేటాయించారు. బ్యాలెట్ బాక్స్‌లు సరఫరా చేసేందుకు 10 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఎన్నికల్లో భద్రతకు 10,500 సివిల్ పోలీసులు, 3,000 ఆర్మ్‌డ్ పోలీసులను మోహరించనున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10,000మంది పోలీసులను ఎన్నికల విధులకు కేటాయించారు, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 27,000మంది ఎన్నికల భద్రతకు నియమించారు. నగరంలో 4,936 పోలింగ్ స్టేషన్లు ఉండగా అందులో 1,704 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నాయి. నగరంలో మొత్తం 2,785మందిని బైండోవర్ చేశారు. 1,167మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. 3,744 లైసెన్స్‌డ్ గన్స్‌ను డిపాజిట్ చేశారు. నగరంలో 19మందిపై ఎన్నికలకు సంబంధించిన కేసులు నమోదు చేయగా, రూ.1,40,87,450 డబ్బులు, రూ.10లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్

మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, విసి సజ్జనార్, మహేష్‌భగత్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లలో ధైర్యం నింపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చార్మినార్ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేరెడ్‌మెట్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి డబ్బులు, మద్యం నగరంలోకి రాకుండా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 186 మందిని బైండోవర్ చేశారు. పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిరంతరం నిఘా పెట్టేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.

రాజకీయ పార్టీలతో సమావేశం…

ఆయా పోలిస్ స్టేషన్ల పరిధిలోని రాజకీయ పార్టీల నాయకులతో పోలీసులు సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించవద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థుల ప్రచారం, ఎన్నికలను పూర్తిగా వీడియో తీస్తున్నారు. వాటి ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News