Monday, April 29, 2024

కలవరపెడుతున్న మూడు దేశాలు

- Advertisement -
- Advertisement -

Worldwide

 రష్యా, బ్రెజిల్, భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 4.8 మిలియన్, మృతులు 318000 మంది
ప్రపంచ దేశాల ఆందోళన

మాస్కో : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గందరగోళానికి గురి చేస్తోంది. ఏప్రిల్‌లో చాలా తక్కువగా కరోనా నమోదైన దేశాల్లో అనూహ్యంగా ఇప్పుడు కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జాన్స్‌హాప్‌కిన్స్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం ప్రపంచం మొత్తం మీద 4.8 మిలియన్ ప్రజలు కరోనా రోగులుగా మారారు. 3,18, 000 మంది మృతి చెందారు. కరోనా కేసులు తాజాగా అత్యధికంగా పెరగడంలో అమెరికా తరువాత రష్యా, బ్రెజిల్ ఉండగా, భారత్ , దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాల్లో కూడా కరోనా కేసులు వ్యాప్తి చెందుతుండడం ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.

కరోనాపై పోరులో తగినంత పురోగతి కనిపిస్తున్నా వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభమౌతున్నా ఆసియాతోపాటు ఐరోపా, అమెరికా లోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్త భద్రతా నిబంధనలతో అమెరికా ఆటో వర్కర్లు, ఫ్రెంచి టీచర్లు, థాయ్ మాల్ వర్కర్లు, తదితర వేలాది మంది ఉద్యోగులు తిరిగి తమ ఉద్యోగాల్లో చేరుతున్నారు. దేశంలో కొత్తగా హాట్‌స్పాట్‌లు పుట్టుకొస్తున్నాయని రష్యా చెబుతోంది. గత 24 గంటల్లో రష్యాలో కొత్తగా 9263 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య దాదాపు 3,00,000 కు పెరిగింది. వీటిలో సగం మాస్కోలోనే ఉన్నాయి.

ఇప్పటివరకు 2837 మంది మృతి చెందారని రష్యా వెల్లడించింది. రష్యాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న రెండో నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ లో అన్ని శ్మశాన వాటికలు శవాలతో నిండిపోయాయి. లాటిన్ అమెరికాలో కరోనా నిర్ధారణ కేసులు 4,83,400 కాగా, ఇంతవరకు 30,900 మంది మృతి చెందారు. ప్రపంచంలో కరోనా కేసుల్లో మూడో స్థానం వహిస్తున్న బ్రెజిల్‌లో సోమవారం సాయంత్రానికి 2,50,000 కేసులు వరకు పెరిగాయి. రియోడి జనేరియో, సావో పాలో లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో 85 శాతం కన్నా ఎక్కువగా రోగులు ఉన్నారని ఆస్పత్రి అధికార వర్గాలు తెలిపాయి. ఇరాన్‌లో ఏప్రిల్‌లో కరోనా కేసులు తగ్గినా మళ్లీ మే లో పెరగడం కనిపించింది.

భారత్‌లో కరోనా కేసులు 1,00,000 వరకు పెరిగాయి. నగరాల నుంచి స్వస్థలాలకు వలస కార్మికులు చేరుతుండడంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. ఇంతవరకు 3100 మంది మృతి చెందినట్టు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో 1602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్ మే 30 వరకు పొడిగించినా రాజధాని ఢాకాలో వేలాది కార్లు వీధుల్లో తిరుగుతున్నాయి. ముస్లింల పండగ ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఆంక్షలను సడలించి కొన్ని దుకాణాలు తెరవడానికి వీలు కల్పించారు. ప్రజా రవాణా రద్దు చేసినా దేశంలో వేలాది గార్మెంట్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కొలంబియాలో లెటికా నగరం కరోనాకు కేంద్రంగా తయారైంది.

బ్రెజిల్ సరిహద్దులో ఈ నగరం ఉండడంతో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసి పోయాయి. హోటళ్లను అత్యవసర మెడికల్ సెంటర్లుగా మార్చి అక్కడకు రోగులను తరలిస్తున్నారు. కొలంబియాలో 16,295 కేసులు నిర్ధారణ కాగా, 592 మంది చనిపోయారు. ఐరోపా, అమెరికాలో 36 మిలియన్ అమెరికన్లు నిరుద్యోగులుగా ఉన్నారు. రాజకీయాలు కన్నా ఆర్థిక అంశాలే ప్రాధాన్యమౌతున్నాయి. బ్రిటన్‌లో నిరుద్యోగం కరోనా వల్ల మరింత పెరిగి ఏప్రిల్ నాటికి 69 శాతానికి చేరుకుంది. ఐరోపాలో కార్ల అమ్మకాలు ఏప్రిల్‌లో అనూహ్యంగా 76 శాతానికి పడిపోయాయి. ఆటోమోటివ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికాలో పరిశ్రమలు మళ్లీ ప్రారంభం కావడంతో 130000 మంది ఆటో వర్కర్లు ఫ్యాక్టరీలకు తిరిగి వచ్చారు.

Increasing corona cases in Russia Brazil and India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News