Sunday, April 28, 2024

తొలి వన్డే వర్షార్పణం

- Advertisement -
- Advertisement -

dharmashala

ధర్మశాల: భారత్‌దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మొదటి వన్డే వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక, మ్యాచ్ జరుగడంపై ముందే అనుమానాలు నెలకొన్నాయి. మ్యాచ్‌కు వరుణుడి ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అదే నిజమైంది. కనీసం టాస్ వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొద్ది సేపు వర్షం ఆగి పోవడంతో మ్యాచ్ నిర్వహించేందుకు నిర్వాహకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అయితే ఆ వెంటనే మళ్లీ వర్షం జోరందుకుంది. ఈ వర్షానికి స్టేడియం మొత్తం నీటితో నిండి పోయింది. కవర్లు కప్పి ఉంచినా ఫలితం లేకుండా పోయింది. భారీ వర్షంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. సాయంత్ర వర్షం తగ్గినా మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. పలుసార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
పెవిలియన్‌కే పరిమితం
ఇక, భారీ వర్షం వల్ల ఆటగాళ్లు పెవిలియన్‌కే పరిమితం కాక తప్పలేదు. మధ్యలో కొద్ది సేపు వర్షం తగ్గడంతో ఇరు జట్ల ఆటగాళ్లు సాధన చేశారు. కానీ, అది కొద్ది సేపటికే పరిమితమైంది. తర్వాత మళ్లీ వర్షం కురవడంతో రెండు జట్ల క్రికెటర్లు మళ్లీ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భావించిన రెండు జట్ల ఆటగాళ్లకు వర్షం నిరాశ కలిగించింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌లో సత్తా చాటి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావించిన యువ క్రికెటర్లకు నిరాశ తప్పలేదు. రెండు జట్ల మధ్య ఆదివారం లక్నోలో రెండో వన్డే జరుగుతుంది.
విమర్శల వెల్లువ
తరచు భారీ వర్షాలతో సతమతమయ్యేధర్మశాల వంటి ప్రదేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించడం మంచిది కాదని పలువురు మాజీ క్రికెటర్లు ముందే హెచ్చరించారు. అయినా బిసిసిఐ మాత్రం ధర్మశాలలో తొలి వన్డేను నిర్వహించేందుకు మొగ్గు చూపింది. అనుకున్నట్టే భారీ వర్షం వల్ల మ్యాచ్ రద్దయ్యింది. కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దేశంలో ఎన్నో స్టేడియాలు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ఉన్నా ధర్మశాల వంటి చిన్న నగరంలో మ్యాచ్‌ను నిర్వహించాలని భావించడం మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు. వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించే మార్చి నెలలో అయితే ధర్మశాలం వంటి నగరాల్లో మ్యాచ్ నిర్వహించడం పెద్ద పొరపాటని విశ్లేషకులు సయితం ముందే హెచ్చరించారు. అయినా ఐసిసి, బిసిసిఐ అధికారులు వీటిని పట్టించుకోలేదు. చివరికి రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య ఓ అంతర్జాతీయ వన్డేకు ధర్మశాలను వేదికగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయం చాలా పొరపాటని గురువారం తేలి పోయింది. దీంతో బిసిసిఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీడని కరోనా భయం
ఇదిలావుండగా భారత్‌దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం ధర్మశాలలో జరిగిన తొలి వన్డేపై కరోనా వ్యాధి భయం స్పష్టంగా కనిపించింది. కరోనా భయం నేపథ్యంలో అభిమానులు మ్యాచ్‌ను చూసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో చాలా టికెట్లు అమ్ముడు పోలేదు. స్టేడియం మొత్తం ఖాళీగా కనిపించింది. గతంలో ధర్మశాలలో మ్యాచ్ అంటే చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చేవారు.
అయితే ఈసారి మాత్రం ఆ సందడి కనిపించలేదు. అభిమానులు మ్యాచ్‌ను చూసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. కరోనా వ్యాధి భయం నేపథ్యంలో స్టేడియానికి తరలి వచ్చేందుకు అభిమానులు సాహసం చేయలేదు. అందువల్ల సగం టికెట్లు కూడా అమ్ముడు కాలేదు. గతంలో గంటల్లోనే టికెట్లను అమ్మడు పోయేవి. కానీ, ఈ మ్యాచ్‌లో ఆ పరిస్థితి కనిపించలేదు. కేవలం 30 శాతం టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. కాంప్లిమెంటరీ పాస్‌లపై కూడా ఎవరూ ఆసక్తి చూపించక పోవడం గమనార్హం. ఫ్రీగా టికెట్లు ఇస్తామన్నా తీసుకునేందుకు ప్రముఖులు ముందుకు రాలేదు. దీన్ని బట్టి కరోనా భయం ఈ మ్యాచ్‌కు ఎంతలా వెంటాడిందో ఊహించుకోవచ్చు.

IND vs SA 1st ODI Match Abandoned due to Rain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News